Sunday, April 28, 2024

అస‌మాన‌త‌లు త‌గ్గించే టెక్నాల‌జీకి ప్రాణం పోయండి – ఎన్‌ఐటి విద్యార్దుల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ పిలుపు

అమరావతి, ఆంధ్రప్రభ: టెక్నాలజీ రంగంలోకి అడుగుపెడు తున్న వరంగల్‌ ఎన్‌ఐటి విద్యార్ధులు ప్రజలకు అధికంగా ఉపయోగపడే, అసమానతలను తగ్గించే టెక్నాలజీలను కనుగొనాలని జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ ఆకాంక్షించారు. గురువారం వరంగల్‌ ఎన్‌ఐటిలో జరిగిన స్ప్రింగ్‌ ఫ్రీ ఫెస్టివల్‌లో ప్రధాన వక్తగా పాల్గొన్న పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ మానవాళి కి సేవ చేసే టెక్నాలజీపైన దృష్టి పెట్టాలన్నారు. అణుబాంబు లాంటి టెక్నాలజీలను కనిపెట్టిన శాస్త్రవేత్త దాని వల్ల జరిగిన విధ్వంసాన్ని చూసి ఎందుకు కనిపెట్టానా అని బాధపడ్డారని గుర్తు చేశారు. టెకీ విద్యార్ధులంతా ఆపిల్‌ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్‌ జాబ్స్‌ను ఆరాధిస్తారని, కానీ ఆయన తయారు చేసిన ఫోన్లను ఎంతమంది ఉపయోగించగలుగుతున్నారని, పేదవాళ్లు ఆ ఫోన్లు ఉపయోగించగలిగే పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. అదే భారత దేశానికి చెందిన దిలీప్‌ మహ్లోనబీస్‌ తయారు చేసిన ఓఆర్‌ఎస్‌ టెక్నాలజీ ఐదు కోట్ల మంది ప్రజల ప్రాణాలు కాపాడిందని, దీనిపై ఇప్పటి వరకు పెటెంట్‌ కూడా తీసుకోలేదని గుర్తు చేశారు. నికోలస్‌ టెస్లా అనే శాస్త్రవేత్త పేరు మీద 300 పరిశోధనలు ఉన్నాయని, ఒక్క దానిపై కూడా పెటెంట్‌ తీసుకోలేదని, ప్రపంచ ప్రజలే తన కుటుంబమన ఆయన భావించారని చెప్పారు. విద్యార్ధులు కూడా ఆ విధంగా ఆలోచించి అసమానతలు తగ్గించే టెక్నాలజీలను కనుగోనాలన్నారు.

ఇంటర్‌లో కాపీ కొట్టే అవకాశమొచ్చినా…
ఎవరికైనా ముఖ్యంగా విద్యార్దులకు నైతిక క్రమశిక్షణ ఎంతో అవసరమన్నారు. నైతికంగా ఎప్పుడూ సక్రమ పద్దతిలోనే నడవాలన్నారు. అప్పుడే మంచి విజయాలను సాధించగలన్నారు. తన జీవితంలో జరిగిన ఒక ఘటనను ఉదహరించారు. తాను ఇంటర్‌ చదివే రోజుల్లో కాపీలు కొట్టి స్లిప్పులు పెట్టి పాసయ్యే అవకాశం వచ్చిందన్నారు. కానీ తాను మాత్రం వాటి జోలికి పోకుండా పరీక్ష రాశానని, మహాత్మా గాంధీ స్పూర్తితో తాను అలా చేశానని, తాను పరీక్ష తప్పినా దాన్ని హుందా తనంగానే పరిగణించి కష్టపడి మళ్లి పరీక్ష రాసి పాసయ్యానని చెప్పారు. విద్యార్ధులకు మేధోశక్తితో పాటు శరీర దృఢత్వం కూడా ఎంతో అవసరమని చెప్పారు. ఈ విషయంలో తన చిన్నప్పటి రోల్‌మోడల్‌ అయిన లియోనార్డ్‌ డావిన్సిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

ఏ ఇజంలో ఉన్నా హ్యుమనిజం ముఖ్యం
మీరు ఏ ఇజంలో ఉన్నా హ్యుమానిజాన్ని అయితే మర్చిపోవద్దని పవన్‌ కళ్యాణ్‌ సలహానిచ్చారు. సైద్దాంతికంగా ఎన్ని విభేదాలు ఉన్నా, ఎదుటి వారు బద్ద శత్రువు అయినా సరే మానవత్వాన్ని మర్చిపోవద్దన్నారు. జీవితంలో దొడ్డిదారులు ఉండవని, కష్టపడి పైకి రావాల్సిందేనని అన్నారు. జీవితంలో వైఫల్యాలు వస్తూ ఉంటాయని, వాటిని ఎదుర్కొని ముందుకు వె ళ్లానని అన్నారు. ఎప్పుడూ కలలు కంటూనే ఉండాలని, వాటిని సాధించుకునేందుకు కార్యాచరణ చేపట్టాలని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement