Friday, May 3, 2024

నేటికీ వదలని కరోనా మహమ్మారి

ఏడాదికిపైగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి.. సెకండ్‌ వేవ్‌ పేరుతో మరోసారి పంజా విసురుతుంది. కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా విధించిన జనతా కర్ఫ్యూకి నేటితో ఏడాది పూర్తైంది. 130 కోట్ల మంది దేశ ప్రజలకు ఇంటికే పరిమితం అయిన సందర్భంగా అది. దేశవ్యాప్తంగా మూడు నెలలకు పైగా సుదీర్ఘ లాక్‌డౌన్‌ విధించడానికి ముందు.. పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు సోమవారం నాటితో ఏడాది పూర్తవుతుంది. వైరస్ బారిన పడిన ప్రజలను ప్రాణాలకు తెగించి చికిత్సను అందిస్తున్న వైద్యులకు సంఘీభావంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గత ఏడాది మార్చి 22 వ తేదిన జనతా కర్ఫూని విధించి ప్రజలు మద్దతును కోరారు. కరోనా వైరస్‌ తీవ్రత నియంత్రణకు మార్చి 22న కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూను అమలు చేసింది. ఆ తరువాతే లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. దేశ వ్యాప్తంగా కూడా క్రమక్రమంగా వ్యాప్తి భారీగా పెరగడంతో విడతల వారీగా పొడిగిస్తూ వచ్చారు. వివిధ దశల్లో మూడు నెలల పాటు ఇది కొనసాగింది.

గతేడాది ఇదేరోజున స్వీయ కర్ఫ్యూ పాటించారు దేశ ప్రజలు. దాంతో మార్చి 22న అత్యవసర సేవలు మినహా జనజీవనం స్తంభించింది. అయితే అదే సమయంలో కొవిడ్‌పై వరుస సమీక్షలు నిర్వహించిన ప్రధాని మోడీ.. మార్చి 25 నుంచి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విధించారు. ముందుగా 21 రోజుల పాటు కఠిన ఆంక్షలు అమలు చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఆ తర్వాత నాలుగు దశలుగా లాక్‌డౌన్‌ను అమలు చేసింది. మే 31 వరకు దేశం మొత్తం లాక్‌డౌన్‌ సంకెళ్లలో ఉండగా.. జూన్‌ 1 నుంచి క్రమంగా ఆంక్షలు సడలిస్తూ వచ్చింది.

కరోనా వైరస్ ఉధృతంగా వ్యాపిస్తోన్న సమయంలో, దాని బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతోన్న డాక్టర్లు, నర్సులు, ఇతర హెల్త్‌ వర్కర్లకు సంఘీభావాన్ని ప్రకటిస్తూ ప్రతి ఒక్కరూ దీపాలు వెలిగించాలని, చప్పట్లు కొట్టాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపునకు దేశం మొత్తం కదిలి వచ్చింది. మోడీ సూచనలకు అనుగుణంగా ప్రజలు జనతా కర్ఫ్యూ నాటి సాయంత్రం కొన్ని నిమిషాల పాటు లైట్లను ఆర్పివేసి, దీపాలు వెలిగించారు. గో కరోనా గో అంటూ నినదించారు.

సరిగ్గా ఏడాది తిరిగే సరికి దేశవ్యాప్తంగా మరోసారి అలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. తగ్గుముఖం పట్టిందనుకున్న కరోనా మహమ్మారి ఒక్కసారిగా విజృంభణ మొదలు పెట్టింది దేశంలో తగ్గినట్టే తగ్గిన మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొద్ది రోజులుగా కరోనా వ్యాప్తి పెరుగుతూనే ఉంది. ఒక దశలో దేశవ్యాప్తంగా 10 వేల కంటే దిగువకు నమోదైన రోజువారీ పాజిటివ్ కేసులు..ఇప్పుడు 40 వేలకు పైగా కొత్త కేసులు రికార్డవుతున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, గుజరాత్.. వంటి రాష్ట్రాల్లో రోజువారీ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. దీంతో పలు రాష్ట్రాల్లోని ప్రధాన పలు నగరాల్లో పాక్షిక లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement