Sunday, May 19, 2024

ఎన్నిక‌ల బ‌రిలోకి సై.. సై అంటున్న‌బ్యూరోక్రాట్స్…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మారుతున్న రాజకీయ పరిస్థితులకు బ్యూరోక్రాట్లు ఆకర్షితుల వుతున్నారు. మార్పు మాతోనే సాధ్యమన్న నినాదంతో వచ్చే ఎన్నికల్లో పోటీకి సమాయత్త మవుతున్నారు. మొన్నటివరకు వాళ్ళంతా సివిల్‌ సర్వెంట్లు… పదవుల్లో ఉన్నప్పుడు నిబద్ధతతో విధులను నిర్వహించారనే పేరు సొంతం చేసుకున్నవాళ్లే.. ఒక్కోసారి ప్రభుత్వం విధానాలు సరిగ్గాలేవని కొన్ని అంశాల్లో విబేధించిన వాళ్లు కూడా ఉన్నారు. తమ జీవిత ఆశయాలను ఐఏఎస్‌, ఐపీఎస్‌లుగా సాధించాలనుకున్న వాళ్లు…, కానీ, ప్రభుత్వ అధికారులుగా పేదలకు అందించలేని సేవలను రాజకీయాల్లోకి వస్తే అంతకంటే ఎక్కువగా విశేషంగా అందించవచ్చని అనుకున్నా రేమో వచ్చే ఎన్నికల్లో రాజకీయ కదన రంగంలో పోటీ పడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సెలబ్రిటీల కంటే ఎక్కువ పేరుండే ఐఏఎస్‌, ఐపీఎస్‌ ఉద్యోగా లను ఒకే సంతకం చేసి వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకున్న వారు, పదవీ విరమణ తర్వాత రాజకీయాల్లోకి వస్తున్న వారు కూడా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ సర్వీస్‌ అధికారులే గాక జిల్లా స్థాయి అధికారులు కూడా పెద్ద సంఖ్యలో రాజకీయాల్లోకి వచ్చేందుకు ముందుకు వస్తున్నారు. వారిలో రాజకీయ నేతల ఒత్తిడులకు లొంగనివారే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అధికార బీఆర్‌ఎస్‌, బీఎస్పీ, స్వతంత్రులుగా పోటీ చేసి రాజకీయాల్లో తమ సత్తాను చాటుకునేందుకు రాజకీయ కదన రంగంలోకి వస్తున్నారు. నిన్నటి వరకు రాష్ట్ర డీజీపీగా పనిచేసిన మహేందర్‌రెడ్డి రాజకీయా ల్లోకి రావాలని ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. పూర్వ ఖమ్మం జిల్లాలోని ఏదేని జనరల్‌ స్థానం నుంచి శాసనసభకు, లేదా ఎంపీగా పోటీ చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర చీఫ్‌ ఆఫ్‌ది పోలీస్‌ బాస్‌గా పని చేసిన మహేందర్‌ రెడ్డికి పదవీ విరమణ తర్వాత ప్రభుత్వ సలహాదారుగా ప్రభుత్వం నియమిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ, ఎందువల్లో మహేందర్‌ రెడ్డికి ఆ అవకాశం దక్కలేదు. రాజకీయాలంటే ఆసక్తి ఉన్న మహేందర్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీ తరపున పోటీ చేయాలనుకుంటున్నట్లు సమాచారం.

అదే విధంగా అడిషనల్‌ డీజీగా ఉండి సర్వీసులో డీజీపీ అవుతారని భావించిన ఐపీఎస్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తన ఉద్యోగానికి రాజీనామా చేసి బహుజన సమాజ్‌ పార్టీలో చేరి ప్రస్తుతం ఆ పార్టీ రాష్ట్ర బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన సొంత ఊరు అలంపూర్‌.. అక్కడి నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని నియోజకవర్గంలో బీఎస్పీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ ఎస్సీ నియోజకవర్గమైన అలంపూర్‌ శాసనసభకు పోటీ చేయకపోతే నాగర్‌కర్నూలు పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే విధంగా రంగారెడ్డి, నాగర్‌కర్నూలు జిల్లాల కలెక్టర్‌గా పని చేసిన ఎల్‌ శర్మన్‌ చౌహాన్‌ కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు. తన పదవీ విరమణ తర్వాత రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. తన సొంత ఊరు ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లా ఖానాపూర్‌ నుంచే పోటీ చేయాలనే ఆసక్తిని వెల్లడించారు. తాను కష్టపడి ఐఏఎస్‌ స్థాయి వరకు వచ్చానని, పదవీ విరమణ అనంతరం తన జీవితం పేద వర్గాల కోసం అంకితం చేస్తానని ప్రకటించారు.

మరో రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి వి. మురళి కూడా ఎన్నికల బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాను స్థాపించిన ఉద్యమ సంస్థ సోషల్‌ డెమోక్రటిక్‌ ఫోరం తరపున పోటీ చేయనున్నట్లు తెలిసింది. తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించనప్పటికీ, మేధావులు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిస్తున్న నేపథ్యంలో ఆయన కూడా బరిలోకి దిగుతారని స్పష్టమవుతోంది. ప్రస్తుతం హెల్త్‌ డైరెక్టర్‌గా ఉన్న గడల శ్రీనివాస్‌ వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం నియోజక వర్గం నుంచి శాసనసభకు పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. తనకు బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను ఇప్పటికే అభ్యర్థించారు. గతంలో ఓ సారి కేసీఆర్‌ను కలిసిన సందర్భంగా పాదాభివందనం చేయడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్‌ తనకంటే వయస్సులో పెద్దవారు, ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి అలాంటి వారికి పాదాభివందనం చేయడం తప్పేమి కాదని వివరణ కూడా ఇచ్చారు. కొత్తగూడెం ఎన్నికల్లో పోటీ చేస్తున్న క్రమంలో ఇప్పటి నుంచే సామాజిక సేవా కార్యక్రమాలు, కుల సంఘాల సమావేశాల్లో పాల్గొంటున్నారు. వారితో పాటు జిల్లా స్థాయి అధికారులుగా ఉన్న అదిలాబాద్‌ రిమ్స్‌ డైరెక్టర్‌ ఉన్న జైసింగ్‌ రాథోడ్‌ ఎస్టీ నియోజకవర్గమైన బోథ్‌ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు. టీఎన్‌జీవో నేత మామిళ్ల రాజేందర్‌ సంగారెడ్డి నుంచి బీఆర్‌ఎస్‌ టికెట్‌కై ప్రయత్నిస్తున్నారు. తనకు టికెట్‌ వస్తుందని ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మహబూబాబాద్‌లో ఇరిగేషన్‌ శాఖలో పని చేస్తున్న హరిరాం మరి కొందరు కూడా రాజకీయాలకు వస్తున్నారు. అదిలాబాద్‌ జిల్లా ఖానాపూర్‌ ఎమ్మెల్యేగా ఉన్న రేఖానాయక్‌ భర్త ట్రాన్స్‌పోర్టు డిపార్టుమెంట్‌లో పనిచేస్తున్న శ్యాంనాయక్‌ కూడా రాజకీయాల్లోకి వస్తున్నారు. శ్యాం నాయక్‌ వచ్చే ఎన్నికల్లో బోథ్‌ అసెంబ్లిd నియోజకవర్గం లేదా అదిలాబాద్‌ ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎస్టీ నియోజకవర్గమైన బోథ్‌ నుంచి పోటీ చేసేందుకు ఎక్కువ సంఖ్యలో అధికారులు ఆసక్తి చూపుతుండడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement