Monday, April 29, 2024

Great Person: నువ్వుండాలే సామి.. పది కాలాల పాటు సల్లంగా ఉండాలే..

అతని జీవనం సాదాసీదాగానే ఉంటుంది.. అచ్చం పల్లెటూరి పోకడలే.. కానీ, ఆలోచనలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మనతోపాటు సకల జీవరాశులు బతికుండాలనుకోవడం పరిపాటు.. కానీ, ఆచరణలో చూపుతున్నాడీ విలేజ్ మన్.. అతని విషయాలేంటో తెలుసుకోవాలంటే పల్నాడుకు వెళ్లాల్సిందే..

పేరు కొమెర జాజి.. పల్నాడులోని నల్లమల సమీపంలో ఉంటాడు. రోజూ అడవికి వెళ్లడం అతనికి అలవాటు. అలా వెళ్లకుంటే ఏదో కోల్పోయిన ఫీలింగ్ ఉంటుంది. అలా వెళ్లి స్వచ్ఛమైన గాలిపీలుస్తూ.. పరిసరాలను చూస్తూ మైమరచి పోవడం అతనికి అలవాటైంది. అంతేకాకుండా అక్కడి పక్షులకు కొన్ని గింజలు చల్లి.. వనమూలికలు ఏరుకొని వచ్చేవాడు. అయితే ఇందులో కొత్తేముంది అనుకుంటారు కదా.. ఇక్కడే ఓ ట్విస్టు ఉంది..

ఈ యువకుడికి రెండెకరాల పొలం ఉంది. ఆ పొలంలో వేర్వేరు పంటలు సాగుచేస్తాడు. కానీ, కేవలం పక్షుల కోసమే ఒక ఎకరం వదిలేసి సజ్జలు, జొన్నలు పండిస్తున్నాడు. ఇలా ఎందుకు స్వామీ అడిగితే.. ‘‘మనుషులతో పాటు పక్షులు కూడా బతకడమే బయో డైవర్సిటీ’’ అంటాడు కొమెర జాజి. పక్షులు లేకపోతె ప్రకృతి లేదు, ఈ భూమ్మీద పండే ప్రతీ గింజలో పక్షులకు వాటా ఉందని చెప్పడమే కాదు.. ఆచరణలో చూపుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇట్లాంటి ఆదర్శవంతుడికి ఎన్ని కోట్లచ్చినా తక్కువే..  అవును.. జాజిపూల పరిమళం వంటి స్వచ్ఛమైన మనిషి కొమెర జాజి.

Advertisement

తాజా వార్తలు

Advertisement