Sunday, May 5, 2024

హిజాబ్​, కాషాయ కండువాలు వద్దు, బాగా చదువుకోండి.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు..

కర్నాటకలో స్టూడెంట్స్​ మధ్య చిచ్చురేపిన హిజాబ్ ధరించే విషయమై ఇవ్వాల హైకోర్టు విచారణ జరిపింది. కాలేజీలు, స్కూళ్లలోని విద్యార్థులంతా తదుపరి కోర్టు ఉత్తర్వులు వచ్చే దాకా హిజాబ్, కాషాయపు శాలువాలు లేదా మతపరమైన దుస్తులు ధరించరాదని కర్నాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. కొన్ని కాలేజీల్లో “డ్రెస్ కోడ్”ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ నియమం కొన్ని కాలేజీలకు మాత్రమే పరిమితం చేస్తున్నట్టు పేర్కొంది. కాగా, విద్యా సంస్థలను తిరిగి తెరిచి, స్టూడెంట్స్​ రావడానికి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. మతం, విశ్వాసంతో సంబంధం లేకుండా విద్యార్థులంతా కలిసిమెలిసి ఉండాలని, కాషాయ శాలువాలు, హిజాబ్, మతపరమైన జెండాలు తరగతి గదిలోకి తేవొద్దని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రితూ రాజ్ అవస్తీ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. దీనికి సంబంధించిన పిటిషన్లన్నింటిని ప్రస్తుతం పెండింగ్‌లో పెడుతున్నట్టు తెలిపారు.

కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు, విద్యాసంస్థల మూసివేత బాధాకరమని హైకోర్టు పేర్కొంది. ఈ కేసు గురించి కోర్టుకు తెలుసునని, రాజ్యాంగపరమైన ప్రాముఖ్యత, వ్యక్తిగత చట్టం యొక్క ముఖ్యమైన అంశాలు తీవ్రంగా చర్చించనున్నట్టు పేర్కొంది. మనది బహు సంస్కృతులు, మతాలు, భాషలతో కూడిన దేశం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లౌకిక రాజ్యంగా ఉండటం వల్ల అది ఏ మతంతోనూ తమను తాము గుర్తించుకోదు. ప్రతి పౌరుడికి నచ్చిన విశ్వాసాన్ని ప్రకటించి ఆచరించే హక్కు ఉంది. అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.

తరగతి గదిలో హిజాబ్ ధరించడం అనేదానిపై లోతైన పరిశీలన చేయాలని ధర్మాసనం పేర్కొంది.  మనది నాగరిక సమాజం, మతం, సంస్కృతి.. ఇలాంటి వాటి పేరుతో ప్రజల శాంతి, ప్రశాంతతకు భంగం కలిగించే ఏ చర్యను ఏ వ్యక్తిని అనుమతించకూడదు. అంతులేని ఆందోళనలు, విద్యా సంస్థలను నిరవధికంగా మూసివేయడం సంతోషకరమైన విషయాలు కాదు. ఉన్నత చదువుల్లో ప్రవేశానికి కాలక్రమం ఉన్నందున, విద్యా నిబంధనలను పొడిగించడం విద్యార్థులకు హానికరం అని హైకోర్టు పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement