Friday, May 3, 2024

మద్యం తాగి మరణిస్తే.. ఇన్సూరెన్స్‌ రాదు..

బీమా పరిహారం చెల్లింపు విషయంలో సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అతిగా మద్యం తాగి చనిపోయిన వ్యక్తి వారసులకు బీమా పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని ఎం.ఎం. శాంతన్‌ గౌండర్‌, జస్టిస్‌ వినీత్‌ శరణ్‌లతో కూడిన ధర్మాసం… సోమవారం ఈ సంచలన తీర్పును ప్రకటించింది. ప్రమాదంలో మరణిస్తే తప్ప.. ఇతర సందర్భాల్లో బీమా మొత్తాన్ని అందించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. 1997లో జరిగిన ఓ వ్యక్తి మరణానికి సంబంధించిన ఓ కేసు విషయమై సుప్రీం ఈ నిర్ణయాన్ని తాజాగా ప్రకటించింది.

వివరాల్లోకి వెళితే.. 1997 అక్టోబర్ 7న సిమ్లా జిల్లాలోని చోటాప్‌ పంచాయతీలో హిమాచల్‌ అటవీ సంస్థలో పనిచేస్తోన్న ఓ వ్యక్తి మరణించాడు. ఆ సమయంలో భారీగా వర్షాలు కురవడం, చలి కారణంగానే సదరు వ్యక్తి మరణించాడని కుటుంబ సభ్యులు అధికారులకు తెలిపారు. అయితే పోస్టుమార్టం నిర్వహించిన అధికారులు.. ఆ వ్యక్తి గాయాల కారణంగా మరణించలేదని, అధికంగా మద్యం సేవించడం వల్లే మరణించాడని నివేదిక ఇచ్చారు. ఈ కారణంతో పరిహారం చెల్లించడానికి బీమా కంపెనీ నిరాకరించింది. దీంతో కుటుంబ సభ్యులు జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించగా వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో సదరు బీమా కంపెనీ జాతీయ ఫోరంను ఆశ్రయించింది. బీమా కంపెనీ ఎలాంటి పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని, మరణించిన వ్యక్తి పనిచేసిన అటవీ సంస్థ మాత్రం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. దీనిపై సుప్రీంకోర్టుకు అప్పీలు చేయగా కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. మద్యం సేవించి మరణించిన వ్యక్తికి పరిహారం చెల్లించాల్సిన అవసరం రెండు సంస్థలకూ లేదంటూ తేల్చి చెప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement