Sunday, May 19, 2024

నాసా అంతరిక్ష కేంద్రం కూలిపోవచ్చు.. వెంటనే ఆంక్షలు ఎత్తేయాలని హెచ్చరించిన రష్యా

రష్యాపై పాశ్చాత్య దేశాల ఆంక్షలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)పై ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. అమెరికా, ఐరోపా దేశాలు తీసుకుంటున్న చర్యలతో ఐఎస్‌ఎస్‌ కూలిపోయే ప్రమాదం ఉందని రోస్‌ కాస్మోస్‌ (రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ) మరోసారి హెచ్చరించింది. వెంటనే ఆంక్షలు ఎత్తివేయాలని సంస్థ డైరెక్టర్‌ దిమిత్రి రోగోజిన్‌ పిలుపునిచ్చారు. వాటివల్ల ఐఎస్‌ఎస్‌కు రష్యా వైపునుంచి అందుతున్న సేవలకు అంతరాయం కలగనుందని వెల్లడించారు. ఫలితంగా 500 టన్నుల బరువైన ఈ నిర్మాణం సముద్రంలో కానీ, భూమిపై కానీ కూలిపోయే అవకాశం ఉందని హెచ్చరికలు చేశారు. ఐఎస్‌ఎస్‌ నిర్దేశిత కక్ష్యలో తిరిగేందుకు కావాల్సిన ప్రొపెల్షన్‌ సిస్టమ్‌ను అందజేస్తోంది రష్యానే. ఐఎస్‌ఎస్‌లో ముఖ్యంగా రెండు కీలకమైన విభాగాలు న్నాయి. ఇందులో ఒకదాన్ని అమెరికా పర్యవేక్షిస్తుంటే.. మరొకదాన్ని రష్యా నిర్వహిస్తోంది. ఐఎస్‌ఎస్‌ను నివాసయోగ్యంగా మార్చే పవర్‌ సిస్టమ్స్‌లను యూఎస్‌ నిర్వహిస్తోంది.

ఇక ఈ అంతరిక్ష నౌక నిర్దేశిత కక్ష్యలో తిరిగే బాధ్యతలను రష్యా చూస్తోంది. ప్రస్తుతం ఐఎస్‌ఎస్‌ పూర్తిగా జీరో గ్రావిటీ స్పేస్‌లో లేదు. ఇది కొద్దిగా భూమి గురుత్వాకర్షణను ఎదుర్కొంటుంది. అలాగే భూమి చుట్టూ తిరుగుతున్న సమయంలో ఇది కొంత శక్తిని కోల్పోతుంది. దాన్ని అలాగే వదిలేస్తే.. అది కూలిపోయే ప్రమాదం ఉంది. దీన్ని నియంత్రించేందుకు రష్యా థ్రస్టర్లను పంపుతుంది. ఇవి ఐఎస్‌ఎస్‌ను నిరంతరం నియంత్రిత కక్ష్యలో తిరిగేలా చేస్తాయి. కాగా, దిమిత్ర రోగోజిన్‌ బెదిరింపుల నేపథ్యంలో స్పేస్‌ఎక్స్‌ సంస్థ అధిపతి ఎలాన్‌మస్క్‌ స్పందించారు. అంతరిక్ష కేంద్రానికి రష్యాతన సహకారాన్ని ఉపసంహరించుకుంటే, రంగంలోకి దూకేందుకు తమ కంపెనీ సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement