Friday, May 10, 2024

శశికళ నిర్ణయం వెనుక కారణం!

అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల శిక్ష అనుభవించిన తమిళనాడు మాజీ సీఎం జయలలిత నెచ్చెలి శశికళ రాజకీయాకలు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. శశికళ గత నెలలో బెంగుళూర్ జైలు నుంచి విడుదల అయ్యారు. జైలు నుంచి వచ్చాక ఆమె రాజకీయాల్లో బిజీ అవుతారని అందరూ ఊహించారు. మళ్లీ అన్నాడీఎంకేలో చక్రం తిప్పుతారని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి సంచలనం రేపారు. దాంతో శశికళ అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. అయితే, ఆమె రాజకీయాల నుంచి వైదొలగడానికి కారణం ఏమై ఉంటుందన్నదానిపై భిన్న ఊహాగానాలు వినిపించాయి. తాజాగా ఈ విషయంపై ఏఎంఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రాజకీయాల నుంచి తప్పుకోవాలన్నది తన పిన్ని శశికళ సొంతంగా తీసుకున్న నిర్ణయం అని దినకరన్ స్పష్టం చేశారు. ఆ నిర్ణయం వెనుక ఎవరి ప్రోద్బలం లేదన్నారు. అన్నాడీఎంకే, ఏఎంఎంకే పార్టీలను ఒక్కటిగా చేసేందుకు బీజేపీనే ఆమెపై ఒత్తిడి తెచ్చిందన్న వాదనలు నిజం కాదని తెలిపారు. బెంగళూరు నుంచి ఆమె తిరిగొచ్చాక… పూర్తిస్థాయిలో రాజకీయాల్లో కొనసాగుదామని అనుకున్నారని చెప్పారు. కానీ అన్నాడీఎంకే నాయకులు పదేపదే చేస్తున్న వ్యాఖ్యలతో ఆమె మనసు గాయపడిందన్నారు. అందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారని వివరించారు. అయితే, తనను మాత్రం రాజకీయ పోరాటంలో ముందుకు వెళ్లాలని ఆశీర్వదించారని దినకరన్ చెప్పారు.

కాగా, శశికళను అన్నాడీఎంకేలోకి చేర్చుకునే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి పళని స్వామి గతంలో తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. శశికళ జైలు నుంచి విడుదలైన సందర్భంగా తీవ్రమైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. శశికళ ఆటలు అన్నాడీఎంకేలో సాగవని స్పష్టం చేశారు. చివరికి శశికళ.. తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement