Monday, May 6, 2024

ఇదేం విడ్డూరం… సమస్యలపై ప్రశ్నించినందుకు ఎంపిటిసి అరెస్ట్

జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం చిలుపూర్ మండల సర్వసభ్య సమావేశంలో సమస్యలను ప్రశ్నించినందుకు ఓ ఎంపీటీసీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన చిలుపూర్ మండల కేంద్రంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. చిల్పూర్ మండల సర్వసభ్య సమావేశంలో మండలానికి చెందిన వెంకటాద్రి పేట గ్రామ ఎంపీటీసీ కుమార్.. పలు సమస్యలపై ఎంపిపి బొమ్మిశెట్టి సరిత, ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డిని ప్రశ్నించారు. గత సమావేశంలో ఇచ్చిన హామీ పనులు ఎంతమేరకు జరిగాయో వివరించాలని వారిని కోరారు. అదేవిధంగా మండల పరిషత్ నిధుల వివరాలను సభాముఖంగా వెల్లడించాలని కుమార్ పట్టుబట్టి సభను ముందుకు సాగకుండా అడ్డుకున్నారు. ఎంపిపిని ఏక వచనంతో సంబోధించడంతో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఎంపిటిసి కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు.

వెంకటాద్రి పేట గ్రామానికి జెడ్పి, మండల, సిడిఎఫ్, ఎమ్మెల్సీ నిధుల్లో ఏ ఒక్కటి కేటాయించలేదని తాను సిపిఎం పార్టీకి చెందిన ఎంపీటీసీగా గెలుపొందడం వల్లే గ్రామాన్ని అభివృద్ధి జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఎంపీపీ సరిత మాట్లాడుతూ సమావేశంలో ప్రశ్నించి సమాధానం రాబట్టాల్సింది పోయి ఒక మహిళా ఎంపీపీ అని చూడకుండా ఏక వచనంతో సంబోధించడం సరైన విధానం కాదని ఆమె తప్పుపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement