Saturday, May 28, 2022

BIG STORY : తెలంగాణ రైతన్నకు నెల నెలా పింఛన్.. సీఎం కేసిఆర్ వినూత్న ప‌థ‌కం..

దేశంలోనే ప్రతిష్టాత్మక పథకాలతో ముందున్న తెలంగాణ రాష్ట్రం మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రైతుల సంక్షేమానికి రైతుబంధు, రైతు బీమా పథకాలతో పాటు రైతు వేదికల లాంటి నిర్మాణాలను చేపట్టిన సీఎం కేసీఆర్‌ తాజాగా రైతుల కోసం మరో పథకాన్ని తీసుకురాబోతున్నట్లు సమాచారం. రానున్న బడ్జెట్‌లో అన్నదాతల కోసం సరికొత్త స్కీమ్‌ ప్రకటించేందుకు సీఎం కేసీఆర్‌ రెడీ అవుతున్నారు. అన్నదాతకు పింఛన్‌ స్కీమ్‌ను అమలు చేయడానికి సాధ్యాసాధ్యాలపై డిపార్ట్‌మెంట్‌ ఎక్సర్‌సైజ్‌ మొదలుపెట్టింది. కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం సమయంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ త్వరలో రైతులకు గుడ్‌ న్యూస్‌ చెప్తానని అన్నారు. అందుకు సమయం ఆసన్నమైనట్లుగా ప్రభుత్వ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో రైతుబంధు పథకం లబ్ధిదారులు 67 లక్షల మంది ఉన్నారు. వీరిలో 47 ఏళ్లు నిండిన వాళ్లు ఎంత మంది, 49 ఏళ్లు నిండిన వారు ఎంత మంది ఉన్నారనే విషయంపై పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు టాక్‌.

అంతేకాదు రైతుబంధు పథకం లబ్ధిదారులైన రైతులలో ఎంతమందికి భూమి ఉందనే విషయంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. 47 ఏళ్లు నిండిన చిన్న, సన్నకారు రైతులకు నెలకు రూ.2,016 పెన్షన్‌ ఇచ్చే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. 3 నుంచి 5 ఎకరాలలోపు ఉన్న రైతులకు ఈ పెన్షన్‌ ఇచ్చే అవకాశం ఉందని ఆర్థికశాఖ అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన గీత కార్మికులకు పింఛన్‌ ఇస్తున్నారు. వీరికంటే అన్నదాతలకు మూడేళ్ళ గరిష్ట పరిమితిని తగ్గించాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నట్లు సమాచారం. దీనికోసం రాష్ట్ర ఖజానాపై ఎంత భారం పడుతుందనే దానిపై సర్కార్‌ లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రైతుల కోసం అనేక పథకాలు చేపట్టిన కేసీఆర్‌ సర్కార్‌.. వారి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది.
రైతుబంధుతో ఇప్పటికే 50వేల కోట్లను ఖర్చు చేసింది. రైతు బీమా ద్వారా.. మరణించిన రైతులకు రూ.5 లక్షల బీమా ఇచ్చేలా ఇన్సూరెన్స్‌ చేస్తోంది.

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు పంచాయతీ నడుస్తున్న ఈ సమయంలో కొత్త పథకంతో మరోసారి ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కోవచ్చనే భావనతో గులాబీ దళపతి ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ స్పీడుపెంచగా, మరోవైపు కాంగ్రెస్‌ కూడా టీఆర్‌ఎస్‌పై అవకాశం వచ్చినప్పుడల్లా విమర్శల దాడులకు దిగుతోంది. దీంతో వారికి చెక్‌ పెట్టడంతో పాటు రైతులకు మేలు జరిగేలా ఈ పథకానికి వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం. ఈ పథకం అమలైతే చిన్న, సన్నకారు రైతులకు ఎంతో ఊరట లభించనుంది. పథకానికి సంబంధించిన అన్ని వివరాలను పొందుపరుస్తూ ఓ సమగ్ర నివేదికను అధికారులు తయారు చేస్తున్నారు. అంతేకాదు అన్నదాతకు ఈ పథకాన్ని అమలు చేస్తే.. ఖజానాపై ఎంత భారం పడనున్నదని అనే విషయంపై కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

స్కీమ్‌ల సంచలనం ..
కేసీఆర్‌ పథకాలు ఏవైనా దేశంలో పెద్ద చర్చకు దారితీశాయి. కల్యాణలక్ష్మి వంటి పథకాలు ఆదర్శంగాకా, రైతుబంధు పథకం ఆశ్చర్యపరిచింది. కేంద్రప్రభుత్వంతో పాటు అనేక రాష్ట్రాలు ఈ పథకాన్ని అనుసరిస్తున్నాయి. దళితబంధు పెద్ద సెన్షేషన్‌. రైతుభీమా తో పాటు మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, కాళేశ్వరం వంటి పథకాలు కూడా దేశంలో చర్చకు దారితీశాయి. ఇపుడు మరోపథకానికి రూపకల్పన చేస్తున్నారన్న ప్రచారం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది. మా దగ్గర ఇంకో రెండు మూడు స్కీంలున్నాయి.. అవి పెడితే మీరు ఖతమే అని పలుమార్లు ప్రతిపక్షాలను హెచ్చరించిన కేసీఆర్‌ ఇపుడు రైతుకు పెన్షన్‌ అస్త్రాన్ని బయటకు తీయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement