Tuesday, May 7, 2024

గురుకుల పాఠ‌శాల‌ని త‌నిఖీ చేసి – పిల్ల‌ల‌తో క‌లిసి భోజ‌నం చేసిన – మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్

తెలంగాణ రాష్ట్రం వచ్చాక కెసిఆర్ నాయకత్వంలో వెయ్యి గురుకులాలు పెట్టి, నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందిస్తూ… ఒక్కో విద్యార్థిపై దాదాపు లక్ష రూపాయలు ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా, కురవి మండలం, సీరోలు గ్రామంలో ఏకలవ్య ఆదర్శ గురుకుల బాలికల పాఠశాలలో కలుషిత ఆహారం తినికొంతమంది విద్యార్థినిలు అస్వస్థతకు గురైన నేపథ్యంలో నేడు మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు ఆ పాఠశాలకు వెళ్లి, పరిస్థితులను సమీక్షించారు. విద్యార్థులకు భోజనం అందిస్తున్న సరుకులను, వంటశాలను స్వయంగా తనిఖీ చేసి చూశారు.విద్యార్థులతో కలిసి అక్కడే టిఫిన్ చేశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు… సీరోలు గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారన్న విషయం తెలిసిన వెంటనే కలెక్టర్, జిల్లా అధికారులతో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిరక్షించాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పాను. దాదాపు 38 మంది విద్యార్థులు కలుషితాహారం తినడం వల్ల వాంతులు, విరోచనాలతో ఇబ్బందికి గురయ్యారు. అయితే వెంటనే వైద్య సేవలు అందించడం వల్ల అందరూ బాగున్నారు. ఇంకో 14 మంది విద్యార్థులు నీరసంగా ఉండడంవల్ల వారిని మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ చేర్పించి వైద్యం అందిస్తున్నాం. నిన్న అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే రాత్రి 1:00 కు ఇక్కడికి వచ్చాను. పిల్లలు చేసుకుంటున్న ఏరియా హాస్పిటల్ వెళ్లి వారిని పలకరించాను. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నాన‌న్నారు.

పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వారంతా కోలుకున్నారు. తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పని లేదు.ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో మన గురుకుల పాఠశాలలు దేశంలోనే గొప్పగా ఉన్నాయి. గురుకులాలు సీఎం గారి మానసపుత్రికలు. తెలంగాణ వచ్చాక 1000 గురుకులాలు పెట్టి, నాణ్యమైన విద్యతో పాటు భోజనం అందిస్తున్నాం. గురుకులాల్లో చదివే ప్రతి విద్యార్థి మీద సాలీనా దాదాపు లక్ష రూపాయలు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ. అయినప్పటికీ ఇంకా ఎక్కడైనా చిన్న, చిన్న లోపాలు ఉంటే వాటన్నిటిని సరిదిద్దే బాధ్యత మాపై ఉన్నది. నిన్న జరిగిన సంఘటనలో లోపం ఎక్కడుందో గుర్తించి, సరి చేయడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. విద్యార్థులు కూడా ఉద్దేశపూర్వకంగా ఇది జరిగింది కాదని, రోజులాగే తిన్నామని తర్వాత హఠాత్తుగా వాంతులు, విరోచనాలు మొదలయ్యాయని చెప్పారు. దీనిపై విచారణ జరిపిస్తున్నాం. ఏదైనా పొరపాటు కావాలని జరిగితే తప్ప కుండా చర్యలు తీసుకుంటాం. గతంలో ప్రిన్సిపాల్ గా ఉన్న వ్యక్తిని మార్చి, మహిళను ప్రిన్సిపాల్ గా వేయడం జరిగింది. వసతులు మెరుగుపరచడం జరిగింది.కోవిడ్ కారణంగా చాలా రోజులు విద్యాసంస్థలు మూతపడి ఉన్నాయి. పరీక్షలు వస్తున్న నేపథ్యంలో వారిని పరీక్షలకు సంసిద్ధం చేయడం కోసం కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాలికల పాఠశాలలో మహిళా అధికారులను పర్యవేక్షణ చేసేలా చూడాలి అని చెప్పాను. ఈ తనిఖీలో మంత్రితోపాటు కలెక్టర్ శశాంక, జెడ్పిటిసి బండి వెంకట్ రెడ్డి, జిల్లా అధికారులు, స్థానిక నేతలు ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement