Friday, May 3, 2024

గాంధీకి వ‌స్తే పున‌ర్జ‌న్మ.. త్వరలో 200 ప‌డ‌క‌ల ఎంసీహెచ్ ఆస్ప‌త్రి

సికింద్రాబాద్ గాంధీ ఆస్ప‌త్రిలో ఎంఆర్ఐ, క్యాథ్ ల్యాబ్‌ను అందుబాటులోకి తీసుకు రానున్నామని  వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్ రావు తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో సీటీ స్కాన్ సేవ‌ల‌ను మంత్రి హ‌రీశ్ రావు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్ర‌ధాన ఆస్పత్రుల్లో 21 సీటీ స్కాన్ కేంద్రాల‌ను మంజూరు చేశామ‌ని చెప్పారు. అందులో భాగంగా మొద‌టి సీటీ స్కాన్ కేంద్రాన్ని గాంధీలో ప్రారంభించామ‌న్నారు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో సీటీ స్కాన్ అవ‌స‌రం ఉందన్నారు. అలాగే, గాంధీ ఆస్ప‌త్రిలో కొత్త క్యాథ్ ల్యాబ్‌ను రూ. 6.5 కోట్ల‌తో, MRI మిష‌న్‌ను రూ. 12.5 కోట్ల‌తో మంజూరు చేశామని తెలిపారు. వచ్చే 45 రోజుల్లో MRI, క్యాథ్ ల్యాబ్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత గాంధీ ఆస్ప‌త్రికి రూ. 176 కోట్ల మంజూరు చేశమని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 100 కోట్ల ప‌నులు పూర్త‌య్యాయని వెల్లడించారు. మిగిలిన ప‌నుల‌ను యుద్ధ‌ప్ర‌తిపాదిక‌న పూర్తి చేస్తామ‌న్నారు. గాంధీ ఆస్ప‌త్రిలో కొవిడ్ సేవ‌లు అద్భుతంగా అందించారని మంత్రి హరీశ్ రావు ప్రశంసించారు. 84,187 మంది కొవిడ్ బాధితుల‌కు వైద్యం అందించారని తెలిపారు. కొవిడ్ చికిత్స విష‌యంలో ప్ర‌యివేటు ఆస్ప‌త్రులు చేతులు ఎత్తేస్తే.. గాంధీకి వ‌స్తే పున‌ర్జ‌న్మ క‌ల్పించారని చెప్పారు. గాంధీలో అత్యాధునిక‌మైన ప‌రిక‌రాల‌ను ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకొస్తామ‌న్నారు. గాంధీ ఆవ‌ర‌ణ‌లో 200 ప‌డ‌క‌ల ఎంసీహెచ్ ఆస్ప‌త్రి త్వ‌ర‌లోనే అందుబాటులోకి తీసుకొస్తామ‌ని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement