Sunday, December 8, 2024

తగ్గుతున్న మత్స్య సంపద.. నిధుల కొరతతో ఇబ్బందులు

కర్నూలు, (ప్రభన్యూస్‌) : జిల్లాలో ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో చాపల ఉత్పత్తి తగ్గుతున్నది. జిల్లాలో 109 మత్స్యశాఖ కోఆపరేటివ్‌ సొసైటీలో 6154 మంది సభ్యులు ఉండగా, వారిలో 5,320 మందికి గుర్తింపు ఉంది. 15 మహిళా సొసైటీల్లో 627 మంది సభ్యులు ఉన్నారు. వీరందరూ జిల్లాలోని చెరువులు, రిజర్వాయర్లలో మత్స్య సంపదపై ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లాలో మత్స్యశాఖకు సంబంధించి 9 రిజర్వాయర్లు, 177 చెరువులు ఉండగా, 9512 హెక్టార్లలో విస్తీర్ణం ఉంది. చేపల పెంపకానికి 3765 హెక్టార్లు అనువుగా ఉంది. చేపల పునరుత్పత్తి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని జూన్‌, జూలై, ఆగస్టు నెలల్లో చేపల వేటపై నిషేధం విధిస్తారు. ఈకాలంలో మత్స్యశాఖ ఉత్పత్తి కేంద్రాల్లో వృద్దిచేసిన చిరు చేపలను చెరువుల, రిజర్వాయర్లలో వదులుతారు. ప్రభుత్వం నుండి నిధులు రాకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి.

చెరువులు, రిజర్వాయర్‌ నుండి రోజుకు 166 టన్నుల చేపలను బయటకు తీసి విక్రయిస్తుంటారు. జిల్లా నుంచి విజయవాడ, హైదరాబాదు తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. నంద్యాల డివిజన్‌ పరిధిలో నంద్యాల నుండి రైలు మార్గం ద్వారా దూర ప్రదేశాలకు దాదాపు 100 టన్నుల చేపలను విక్రయిస్తుంటారు. ఇక్కడ ఉత్పత్తి చేసిన చిరు చేపలను మత్స్యకారులకు సైజును బట్టి వెయ్యి చేప పిల్లలను రూ.175 నుంచి రూ.250 వరకు సొసైటీ సభ్యులు మత్స్యకారులకు ఇస్తారు. కొనుగోలు చేసిన వీటిని చెరువులు, రిజర్వాయర్లలో వదులుతారు.

ఈ ఏడాది నిధుల కొరత కారణంగా చేపల ఉత్పత్తి తగ్గడంతో జిల్లాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు లక్ష కుటుంబాలకు పైగా వీదినపడ్డారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మత్స్య ఉత్పత్తికి ప్రత్యేక నిధులు కేటాయించాలని సొసైటీ సభ్యులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement