Friday, April 26, 2024

కొనుగోలు ఎలా జరుగుతున్నది ?.. రైతులతో మంత్రి ఎర్రబెల్లి కుశల ప్రశ్నలు

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చిన్నగూడూరు గ్రామం లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు ఎలా జరుగుతున్నది? మీకు సమస్యలు ఏమైనా ఉన్నాయా? అంటూ కుశల ప్రశ్నలు వేశారు. ఒక మహిళా రైతు వద్ద నుంచి ఆమె తెచ్చుకున్న టిఫిన్ బాక్స్ తెరిచి అందులో ఏముందో చూసి… తెచ్చింది అంతా నువ్వే తిన్నావా? నాకేమీ ఉంచ లేదా? అంటూ మంత్రి రైతు కూలీలతో కాసేపు ముచ్చటించారు.

ఈ సందర్భంగా రైతులు మంత్రి దృష్టికి ట్రాన్స్పోర్టేషన్ సమస్యను తీసుకువచ్చారు. వెంటనే మంత్రి… సంబంధిత అధికారులు, జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తీసుకెళ్లడానికి లారీలు రావడం లేదని అక్కడి రైతులు చెబుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమస్యను పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. అక్కడే ఉన్న అధికారితో మాట్లాడి కారణాలు తెలుసుకుని వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా తమ దృష్టికి తేవాలని రైతులకు మంత్రి సూచించారు. రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, రైతులు పండించిన ఆఖరు గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement