Tuesday, May 21, 2024

కొత్త నిబంధనను ప్రవేశపెట్టిన ఏఐసీటీఈ

ఇంజనీరింగ్ చదవాలంటే ఇంటర్‌లో గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్ర సబ్జెక్టులను కచ్చితంగా చదివి ఉండాలి. ఇప్పటిదాకా ఉన్న నిబంధన అదే. కానీ ఇకపై అవి తప్పనిసరి కాదని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) వెల్లడించింది. 2021–22 విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాలకు ఇంటర్‌లో గణితం, భౌతిక శాస్త్ర సబ్జెక్టులను ఐచ్ఛికం చేసింది. ఇంజనీరింగ్ చదివేందుకు అర్హతలకు సంబంధించి విడుదల చేసిన హ్యాండ్ బుక్‌లో ఏఐసీటీఈ ఈ విషయాలను వెల్లడించింది.

ఇంజినీరింగ్‌కు అవసరమైన గణితం, భౌతిక శాస్త్ర సబ్జెక్టులను ఇంటర్‌లో చదవని విద్యార్థుల కోసం ఇంజనీరింగ్‌లో బ్రిడ్జి కోర్సులను ఏర్పాటు చేస్తామని ఏఐసీటీఈ ప్రకటించింది. ఆ రెండు సబ్జెక్టులతో పాటు ఇంజనీరింగ్ డ్రాయింగ్ ను విధిగా నేర్పిస్తామని పేర్కొంది. ఏఐసీటీఈ నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బ్రిడ్జి కోర్సు అనేది గణితంలో వీక్‌గా ఉన్న వారిని రాటు దేల్చేందుకు మాత్రమే ఉపయోగపడుతుందని శాస్త్రయూనివర్సిటీ వీసీ ఎస్. వైద్య సుబ్రహ్మణ్యం అన్నారు. అంతేగానీ అసలు గణితం చదవని విద్యార్థులకు ఇంజనీరింగ్ చదివే అవకాశం ఇస్తామనడం సరికాదన్నారు.

మ్యాథ్స్, ఫిజిక్స్ లేకుండా సైన్సులోని ప్రాథమిక సూత్రాలను అర్థం చేసుకోవడం చాలా కష్టమని మద్రాస్ యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగాధిపతి రీటా జాన్ అన్నారు. ఆ సబ్జెక్టులు లేకుండా ఇంజనీరింగ్ చదవడమంటే భవిష్యత్‌లో నూతన ఆవిష్కరణలకు తావు లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ లోని మొత్తం 8 సెమిస్టర్లలో 7 సెమిస్టర్ల వరకూ గణితం తరగతులుంటాయని, అలాంటిది బేసిక్స్ లేకుండా చదవడం మంచిది కాదని అంటున్నారు.

విమర్శలపై ఏఐసీటీఈ స్పందించింది. హ్యాండ్ బుక్ లో ఐచ్ఛికం అని చెప్పలేదని వివరణ ఇచ్చింది. సబ్జెక్టుల్లో ఏవైనా మూడు సబ్జెక్టులు చదివి ఉండాలని మాత్రమే పేర్కొన్నామని ఏఐసీటీఈ చైర్మన్ అనిల్ డి. సహస్రబుద్ధ అన్నారు. ఇంజనీరింగ్ లో మరిన్ని అవకాశాలు కల్పించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే, వేరే కోర్సులు చదివి ఇంజనీరింగ్ చేసే వారికి దానికి అవసరమయ్యే సబ్జెక్టులపై శిక్షణనిస్తామన్నారు. ఉదాహరణకు ఓ విద్యార్థి ఇంటర్‌లో మ్యాథ్స్ చదవకపోతే.. ఇంజనీరింగ్ ఫస్టియర్‌లో ఎక్కువగా ఆ సబ్జెక్టుపైనే ఫోకస్ పెడతామన్నారు. నేరుగా సెకండియర్‌లోకి వచ్చే డిప్లొమా విద్యార్థులకూ మ్యాథ్స్ కోర్సులను ఎక్కువగా పెడతామని వివరించారు.ఇంజినీరింగ్‌కు మ్యాథ్స్, ఫిజిక్స్ తప్పనిసరి కాదు

Advertisement

తాజా వార్తలు

Advertisement