Friday, April 26, 2024

జాతీయ‌పార్టీగా ఆమ్ ఆద్మీ.. ట్వీట్ చేసిన మ‌నీష్ సిసోడియా

కాషాయ పార్టీకి కంచుకోట‌గా ఉన్న గుజ‌రాత్ లో ఈసారి కూడా బిజెపీనే అధికారం చేప‌ట్ట‌నుంది. అయితే ఈ రెండు పార్టీలకు ధీటుగా పోటీ పడుతుందని భావించిన ఆమ్ ఆద్మీ పార్టీ రెండంకెల స్థానాన్ని కూడా దాటే అవకాశం కనిపించడం లేదు. కానీ తాజా ఫలితాల వల్ల ఆప్ జాతీయ పార్టీగా గుర్తింపు పొందడానికి ఆరాటపడుతోంది. గుజరాత్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా అవతరించబోతోందని ఆప్ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ట్వీట్ చేశారు. గుజరాత్ లో బీజేపీ, కాంగ్రెస్ కంటే ఆప్ చాలా వెనుకబడి ఉన్నప్పటికీ పూర్తి ఎన్నికల ఫలితాలు వచ్చే సమయానికి 2 సీట్లు గెలుపొందినా కూడా అది జాతీయ పార్టీ హోదాను పొందుతుందని నివేదికలు చెబుతున్నాయి. అయితే రాష్ట్రంలో 6 శాతం ఓట్లను పార్టీ సాధించాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల వల్ల తమది కూడా ఒక జాతీయ పార్టీ అని అరవింద్ కేజ్రీవాల్ చెప్పుకునే అవకాశం లభించింది. దీని వల్ల భవిష్యత్ లో ఆయన ఎలాంటి అడుగులు వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓ జాతీయ పార్టీగా ఆప్ లోక్ సభ బరిలో ఉండే అవకాశం కనిపిస్తోంది.

కాగా.. భారతదేశంలో ఎనిమిది జాతీయ పార్టీలు ఉన్నాయి. మన దేశంలో భారత ఎన్నికల సంఘం గుర్తించిన ఎనిమిది జాతీయ పార్టీలు ఉన్నాయి. అందులో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (ఏఐటీసీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్ సీ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్ఫీపీ), నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) లు ఉన్నాయి. కానీ 2014 నుంచి కాంగ్రెస్ ప్రభావం తగ్గుతున్నప్పటికీ ఏ ఇతర పార్టీ కూడా బీజేపీని ధీటుగా ఎదుర్కొలేదు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీ, కాంగ్రెస్ కు దేశ వ్యాప్తంగా ఉన్నంత నెటవర్క్ లేదు. కాబట్టి ఒక వేళ ఆప్ జాతీయ పార్టీగా గుర్తింపు పొందినా.. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడం ఇప్పటికైతే కష్టంగానే కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement