Saturday, May 4, 2024

Tollywood: సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో విషాదం.. సోదరుడు రమేష్ బాబు మృతి

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో విషాదం నెలకొంది. సూపర్ స్టార్ కృష్ణ పెద్దకుమారుడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు కన్నుమూశారు. ఆయన వయసు 56 సంవత్సరాలు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రమేష్ బాబు నిన్నరాత్రి తుది శ్వాస విడిచారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రమేష్ బాబు గారు చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రిలో తీసుకెళ్తుండగా.. దారి మధ్యలో మరణించినట్లు సమాచారం. 

రమేష్ బాబు మృతితో టాలీవుడ్ లో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన మరణంతో పలువురు దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రస్తుతం రమేశ్ బాబు భౌతికకాయాన్ని హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రిలో ఉంచారు. ఈ రోజు ఉదయం నివాసానికి తరలించనున్నారు. మరోవైపు మహేశ్ బాబు కరోనా సోకడంతో ప్రస్తుతం ఆయన ఐసోలేషన్ లో ఉన్నారు.

సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కూమారుడైన రమేష్ బాబు పలు సినిమాల్లో హీరోగా నటించి మెప్పించారు. సామ్రాట్ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అనంతరం పలు సినిమాల్లో నటించినప్పటికీ రాణించని రమేష్ బాబు ఇక సినిమాలకు దూరంగా ఉన్నారు.  రమేశ్ బాబు నటుడిగానే కాకుండా నిర్మాతగానూ పలు చిత్రాలు నిర్మించారు. మహేశ్ బాబు నటించిన ‘అర్జున్’, ‘అతిథి’ చిత్రాలు నిర్మించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement