Monday, April 29, 2024

షూ సీక్రెట్ లేయర్​లో​ దాచి డ్రగ్స్​ సప్లయ్​.. 1.7కిలోల హెరాయిన్​ పట్టుకున్న ఏటీఎస్..​​

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో అర్ధరాత్రి యాంటీ టెర్రరిజమ్​ స్వ్కాడ్​ (ATS) సోదాలు నిర్వహించింది. కాగా ఒక వ్యక్తి తన షూలోని స్పెషల్​ లేయర్​లో  దాచిన రూ.25.17 కోట్ల విలువైన హెరాయిన్‌ను మహారాష్ట్ర ఏటీఎస్ స్వాధీనం చేసుకుంది.

ATS జుహు, థానే యూనిట్లు చేపట్టిన ఈ స్పెషల్​ ఆపరేషన్​లో దాదాపు 25.17 కోట్ల హెరాయిన్​ దొరికింది. 1,724 గ్రాముల (1.7 కిలోలు) హెరాయిన్, అంతర్జాతీయ మార్కెట్‌లో రూ. 25.17 కోట్ల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు. రూ. 2.6 లక్షల నగదు, రెండు మొబైల్ ఫోన్‌లు, మాదక ద్రవ్యాల విక్రయానికి ఉపయోగించే ఇతర పరికరాలను ఏటీఎస్​ స్వ్కాడ్​ స్వాధీనం చేసుకున్నట్టు మహారాష్ట్ర ఏటీఎస్​ చీఫ్​ వినీత్​ అగర్వాల్​ తెలిపారు.

నిందితుడిపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఉత్తరాఖండ్‌ రాష్ట్రం హరిద్వార్ జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన ఇద్దరు నిందితులు అలీమ్ అక్తర్ (46), ఛోటానాసిర్ (40)ని  అరెస్టు చేశారు. నిందితులకు ఫిబ్రవరి 15 వరకు ఏటీఎస్ కస్టడీ విధించారు. పట్టుబడిన నిషిద్ధ  వస్తువులను పొరుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి సరఫరా చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఒక కొత్త జత బూట్లలో ప్రత్యేకంగా ​ అమర్చిన సీక్రెట్​ లేయర్​లో పెట్టుకుని డ్రగ్స్​ సరఫరా చేస్తున్నట్టు కనిపెట్టారు.

అరెస్టయిన ఇద్దరు వ్యక్తులు వారి మరో పార్టనర్​ కలిసి వసాయ్‌లోని అద్దె అపార్ట్ మెంట్‌లో పనిచేస్తున్నారు. అక్కడి నుంచి ముంబయిలోని అక్రమ రవాణాదారులకు నిందితులు మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని ఏటీఎస్​ అధికారులు తెలిపారు. కాగా, ఈ ఆపరేషన్​లో  ఎస్పీ రాజ్‌కుమార్ షిండే, ఏసీపీ సిద్ధేశ్వర్ గోవే, ఏటీఎస్ జుహు, థానే విభాగాలకు చెందిన పలువురు సభ్యుల పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement