Saturday, May 4, 2024

యాదాద్రి క్షేతం పునరావిష్కారం.. నేడు మహా కుంభ సంప్రోక్షణ

యాదాద్రి పంచనారసింహ క్షేత్రం పునరావిష్కారానికి సిద్ధమైంది. ఈ రోజు మహాకుంభ సంప్రోక్షణకు అంకురార్పణ జరుగుతుంది. బాలాలయంలో నిర్వహించే ఈ క్రతువుతోపాటు, పారాయణాల నిర్వహణకు దేశంలోని వివిధ క్షేత్రాల నుంచి వేదపండితులు, రుత్విక్కులు యాదాద్రికి చేరుకున్నారు. యాగనిర్వహణకు బాలాలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రధానాలయంలో శుద్ధి కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయ్యాయి.

యాగశాలలో తూర్పున చతురస్రాకారం, దక్షిణాన ధనుస్సు, పడమరన వృత్తాకారం, ఉత్తరాన త్రికోణాకారం, ఈశాన్యంలో పద్మ కుండం ఏర్పాటుచేశారు. మధ్యలో స్వామివారి కవచమూర్తులను ప్రతిష్ఠించేందుకు ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. నలువైపులా ప్రవేశ ద్వారాలను, దర్పణాలను ఏర్పాటు చేశారు. సోమవారం నారసింహుడి జన్మనక్షత్రం(స్వాతి) సందర్భంగా పంచకుండాత్మక మహాయాగాన్ని ప్రారంభిస్తున్నారు. సోమవారం సప్తాహ్నిక దీక్షతో మహాయాగ పర్వాలు మొదలవుతాయి.

తొలి రోజు పూజలో భాగంగా ఉదయం 9 గంటల నుంచి స్వస్తివాచనం, విష్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, పంచగవ్య ప్రాశనం, అఖండజ్యోతి ప్రజ్వలన, వాస్తుపూజ, హోమం, పర్వగ్నకరణం. సాయంత్రం 6 గంటలనుంచి మృత్స్యంగ్రహణం, అంకురార్పణ, యాగశాల ప్రవేశం, కుంభస్థాపన.

యాగం చివరి రోజున శ్రీమన్నారాయణుడి జన్మ నక్షత్రం (శ్రవణం) నాడు ఉదయం 11.55 గంటలకు నిర్వహించే మహాకుంభ సంప్రోక్షణ అనంతరం భక్తులకు స్వయంభువుల దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. మహా పూర్ణాహుతి అనంతరం ఉత్సవ మూర్తులను శోభాయాత్రతో ప్రధానాలయంలోకి తీసుకొస్తారు. ఆలయ గోపురాలకు మహాకుంభ సంప్రోక్షణ అనంతరం కలశాలను బిగించి, ప్రధానాలయంలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తరువాత భక్తులకు స్వయంభువుల దర్శనం కల్పిస్తారు. సీఎం కేసీఆర్‌ మహాకుంభ సంప్రోక్షణలో పాల్గొని స్వయంభువులను దర్శించుకొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement