Monday, April 29, 2024

ఒళ్లు గ‌గుర్పొడిచే సాహసం – గాల్లో విమానాలు-మారేందుకు పైల‌ట్ల ప్ర‌య‌త్నం

ఇద్ద‌రు విమాన పైల‌ట్లు డ్యూటీలు మారారు. అది కూడా విమానం గాల్లో వుండ‌గానే ఒక‌రి విమానం నుంచి మ‌రొక‌రి విమానంలోకి మార‌డం విశేషం. వినడానికి ఆశ్చర్యంగా, వెన్నులో వణుకు పుట్టించేలా వుంది.. పైలెట్స్ కజిన్స్ ల్యూక్ ఐకిన్స్ , ఆండీ ఫారింగ్‌టన్ మొదటిసారిగా ఈ ప్రయత్నం చేశారు. అయితే ఈ ప్రయోగంలో కేవలం ఐకిన్స్ మాత్రమే ఆండీ విమానంలోకి ప్రవేశించి.. అరిజోనా ఎడారిలో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. అయితే ఫారింగ్‌టన్ మాత్రం ఐకిన్స్ విమానంలోకి ప్రవేశించలేకపోయాడు. కానీ, పారాచూట్ సాయంతో సేఫ్‌గా కిందకి దిగగా.. విమానం కూలిపోయింది. ఐకిన్స్, ఫారింగ్టన్‌లకు విమానం నడపడంలో మంచి అనుభవం ఉంది. అంతేకాదు వీరద్దరూ మంచి అనుభవం కలిగిన స్కైడైవర్లు కూడా. ఐకిన్స్ ఇప్పటివరకు విమానం నుంచి 21 వేల జంప్‌లు చేశాడు. 8,750 కమర్షియల్ ఫ్లయింగ్ అవర్స్‌తో ఈవెంట్‌లోకి ప్రవేశించాడు. ఫారింగ్టన్ 27 వేల జంప్‌లు.. 6,000 కమర్షియల్ ఫ్లయింగ్ అవర్స్‌ను కలిగి ఉన్నాడు. వీరిద్దరూ గత కొంతకాలంగా గాల్లో నుంచి విమానాలను మారేందుకు ప్రాక్టీస్ చేస్తున్నారు. సమాన ఎత్తులో ఎగురుతూ ఫైట్లు మారాలనేది వీరి ఆలోచన. కానీ, గాల్లోకి ఎగిరిన తర్వాత వారి ప్లాన్ బెడిసికొట్టింది. అయితే, ఐకిన్స్ విజయవంతంగా మరో విమానంలోకి ప్రవేశించగలడంతో మరోసారి తమ ప్రయత్నం ఫలిస్తుందని నిర్వాహకులు అంటున్నారు. మరోవైపు ఫారింగ్టన్ ఉపయోగించిన విమానం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఇద్దరు సురక్షితంగా కిందికి చేరుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement