Tuesday, April 30, 2024

Lotus Strategy – రిజ‌ర్వ్ డ్ పై ప‌ట్టు సాధిద్దాం – అధికారం కైవ‌సం చేసుకుందాం …

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ:

అసెంబ్లి ఎన్నికలు సమీపించడంతో తెలంగాణ బీజేపీ వ్యూహాలను పదునెక్కిస్తోంది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో పాగా వేయడం ద్వారా రాష్ట్రంలో సులువుగా అధికారం చేజిక్కించుకోవాలని భావిస్తోంది. రాష్ట్రంలో 31 ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. తెలంగాణలో అధికారానికి ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో గెలుపు దగ్గరిదారి అని బీజేపీ ముఖ్యనేతలు చెబుతున్నారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో 19 స్థానాలు షెడ్యూల్‌ కులాలకు(ఎస్సీ), 12 నియోజకవర్గాలను షెడ్యూల్‌ తెగలు(ఎస్టీ)లకు రిజర్వ్‌ అయ్యాయి. ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లిd ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు చెందిన 31 నియోజకవర్గాల్లో ఏ పార్టీ ఎక్కువ స్థానాల్లో గెలిచిందో ఆ పార్టీనే అధికారం దక్కించుకున్న విషయాన్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వం గుర్తించింది. రాష్ట్రంలో అధికారాన్ని ఏర్పాటు చేయాలంటే కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 63లో సగం 31 సీట్లు ఎస్టీ, ఎస్టీలవే కావడంతో ప్రధానంగా ఈ నియోజకవర్గాలపై బీజేపీ ఫోకస్‌ పెంచింది. గడిచిన 2018 ఎన్నికల్లో 19 ఎస్సీ నియోజకవర్గాలకుగాను 16చోట్ల, 12 ఎస్టీ నియోజక వర్గాలకు గాను ఆరు చోట్ల అధికార బీఆర్‌ఎస్‌ గెలుపొందింది. మిగతా చోట్ల కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌తో కూడిన మహాకూటమి గెలుపొందింది.

అసెంబ్లి ఎన్నికలకు ఇక నాలుగు నెలల సమయం మాత్ర మే ఉండడంతో తెలంగాణ బీజేపీ నాయకత్వం ఈ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటిికే జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి నేతృత్వంలో బీజేపీ ఎస్సీ నియోజకవర్గాలపై గురిపెట్టి మిషన్‌-19 వ్యూహాన్ని, అదేవిధంగా గరికపాటి మోహన్‌రావు నేతృత్వంలో మిషన్‌-12 వ్యూహాన్ని ఎస్టీ నియోజక వర్గాల్లో గెలుపే లక్ష్యంగా అమలు చేస్తోంది. ఇటీవల పలువురు దళిత, గిరిజన, ఆదివాసీ వర్గానికి చెందిన నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరడంతో ఆయా నియోజకవర్గాల్లో ఎలాగైనా పాగా వేయాలని కమలదళం ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే 19 ఎస్సీ, 12 ఎస్టీ నియోజకవర్గాలన్నింటిలో బూత్‌ కమిటీలను ఏర్పాటు చేసింది. ఎన్నికలు సమీపించడంతో 31 ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో గెలుపును ఖాయం చేసుకునేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ మోర్చాలతోపాటు ఆయా వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రుల తో ప్రచారం నిర్వహించాలని వ్యూహం రచించింది. మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌, చత్తీస్‌గఢ్‌, మిజోరాం తదితర రాష్ట్రాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ మోర్చాల ప్రతినిధులు త్వరలో తెలంగాణలో ఆయా 31 నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి బీజేపీ పార్టీని గిరిజన, దళిత వర్గాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లనున్నారని బీజేపీ ముఖ్యనేత ఒకరు చెప్పారు.

తాజాగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అధ్యక్షతన రెండు రోజులపాటు జరిగిన బీజేపీ పదాధికారుల, ముఖ్యనేతల సమావేశంలోనూ రాష్ట్రంలోని 31 ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై ప్రధానంగా ప్రత్యేక దృష్టిపెట్టి పనిచేయాలని నిర్ణయించారు. ప్రతినెలా ఈ నియోజకవర్గాల్లో టిఫిన్‌ బైఠక్‌లు, 119 నియోజకవర్గాల్లో నిర్వహించాలని నిర్ణయించిన బహిరంగసభలను ముందుగా ఎస్టీ, ఎస్టీ నియోజకవర్గాల్లోనే పూర్తి చేయాలని నిర్ణయించింది.

పలు ఎస్టీ నియోజకవర్గాల్లో రాబోయే రెండు నెలల వ్యవధిలో ఒకటి రెండు నియోజకవర్గాల్లో రాష్ట్రపతి పర్యటనలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర బీజేపీ కోరుతోంది. తెలంగాణలోని పలు ఆదివాసీ, గిరిజన గూడాల్లో ప్రజలు రక్తహీనతతో బాధపడుతున్నారని, ఈ అంశంపై రాష్ట్రపతి పర్యటన ద్వారా ఆదివాసీ, గిరిజనులతో మమేకం అయ్యేందుకు ప్రణాళికా సిద్ధం చేసింది. వరంగల్‌ విజయ సంకల్ప సభలోనూ ఆదివాసీల సం క్షేమానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోడీ ఉద్ఘాటించిన నేపథ్యంలో ఎస్టీ నియోజకవర్గాలపై బీజేపీ తెలంగాణ నాయకత్వం ఫోకస్‌ పెంచనుంది.

అన్ని ఎస్సీ నియోజకవర్గాల్లో బహిరంగసభలు నిర్వహిస్తాం…
ఇప్పటికే ఎస్సీ నియోజకవర్గాల్లో బీజేపీ పార్టీ పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. బూత్‌ కమిటీలను బలపరిచాం. ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో వారి సమస్యలపై ఎప్పటికప్పుడు ఉద్యమిస్తున్నాం. ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో ప్రతి ఎస్సీ నియోజకవర్గంలో బహిరంగసభలు నిర్వహించడం ద్వారా ప్రజలకు మరింత చేరువ అవుతాం. కేంద్ర ప్రభుత్వం దళితుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. వాటిన్నింటినీ దళిత వర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల విషయంలో అనుసరిస్తున్న వివక్ష వైఖరిని ఇంటింటికీ వెళ్లి ఎండగడతాం.
……..జితేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement