Sunday, May 5, 2024

పట్టాభిషిక్తుడైన వైకుంఠ రాముడు.. భక్తుల జయజయ ధ్వానాలతో భక్తాద్రిగా భద్రాద్రి

భద్రాచలం, ప్రభన్యూస్‌: సూర్యచంద్రులు ప్రకాశించినంతకాలం… భూమండలంపై సర్వప్రాణులు సంచరించినంత వరకు లోక కళ్యాణార్థం, లోక సంరక్షణార్థం రామయ్యే పరిపాలకుడుగా కొలువై ఉండాలంటూ శ్రీరామ చంద్రమూర్తిని స్వాగతించగా వైకుంఠ రాముడు శ్రీరామ రాజ్యానికి మహా రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. ఆదివారం సీతా సమేతంగా పసుపు వస్త్రములతో భక్తులకు అభయమిచ్చిన కళ్యాణ రాముడు… సోమవారం సర్వ ఏకాదశి ముహూర్తాన ఎక్కడా లేని విధంగా భద్రగిరికే పరిమితమైన విశిష్ట శంఖు చక్రాలు, ధనుర్భాణాలు ధరించి, వజ్రాల కిరీటం ధారుడై మహారాజుగా దర్శనమిచ్చాడు. భక్తుల జయజయ ధ్వానాలతో భద్రగిరి మార్మోగగా… రుత్వికుల వేద మంత్రోచ్చారణలతో భక్తులు ఆధ్యాత్మిక చింతనలో మునిగి తేలగా… మహా పట్టాభిషిక్తుడైన భద్రాద్రి రామయ్య చూడటానికి రెండు కళ్ళు చాలని రీతిలో వెలిగిపోయాడు. నేత్ర పర్వంగా సాగిన నీలి మేఘ శ్యాముని మహా పట్టాభిషేక ఘట్టాన్ని కనులారా వీక్షించిన భక్తులు తమ ధన్యమైందంటూ మదినిండా రామయ్యను నింపుకుని తన్మయంలో మునిగితేలారు. చలువ పందిళ్ల కింద వేంచేసి ఉన్న భక్తజనం… ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తుండగా.. భద్రాద్రి రామయ్య మేళతాళాలు…జయజయ ధ్వానాల… భక్తుల కోలాటాల మధ్య ఊరేగింపుగా మిధిలా స్టేడియంలోని కళ్యాణ మండపానికి చేరుకున్నారు.

అంతకుముందు రామాలయంలోని యాగశాలలో చతుష్టార్చన హోమాదులు పూర్తయిన తరువాత ఉత్సవ మూర్తులును గిరి ప్రదక్షిణగా మండపానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి మిథిలా స్టేడియంలో విశ్వక్షేణ పూజ, పుణ్యహ వచనం నిర్వహించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ఈ పట్టాభిషేక మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మహాపట్టాభిషేకం విశిష్టత, రామయ్య పరిపాలన, ఒక పుత్రునిగా, సోదరునిగా, భర్తగా, మిత్రునిగా, వీరుడిగా, రాజుగా ఆదర్శ ప్రాయమైన శ్రీసీతారామచద్రస్వామి సత్య పరాక్రమం, సుపరిపాలన, శరణన్న సమస్త జీవకోటికి అభయహస్తమిచ్చే వైకుంఠ రాముడి దివ్య చరిత్ర గురించి పండితులు భక్తులకు వివరించారు. మహా పట్టాభిషేకంలో భాగంగా సోమవారం తెల్లవారు జామునే గం.4.00 లకు రామాలయం తలుపులు తెరిచారు. మందుగా సుప్రభాత సేవ, ఆరాధన, బాలబోగం, నివేదన, సేవాకాలం, బలిహరణం, మంగళశాసనం నిర్వహించారు. ఉదయం గం.6లకు దేవస్థానం నాదస్వర విధ్వాంసులచేత కచేరి నిర్వహించారు. గం.7లకు భద్రుని మండపంలో శ్రీరామ పాదుకలకు అభిషేకం నిర్వహించారు. గం.9లకు కళ్యాణ మూర్తులైన స్వామికి అలంకరణ చేశారు.

ముందుగా నదీ, సముద్ర జలాలు ఉన్న కళశాలను రుత్వికులు శిరస్సుపై పెట్టుకుని కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు. అనంతరం స్వామిని గర్భగుడి నుండి యాగశాలకు తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఊరేగింపుగా మిథిలా స్టేడియంలోని కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు. గం.10.30లకు మహా పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమ తంతును ప్రారంభించారు. ఈ మిథిలా కళ్యాణ మండపంలో స్వామికి విశ్వక్షేణ పూజ, పుణ్యహవచనం నిర్వహించారు. ఆతరువాత పూజలు ఉపయోగించే ద్రవ్యాలకు సంప్రోక్షణ చేశారు. పట్టాభిషేకం నిర్వహించే రుత్వికులకు వస్త్రాధరణ చేశారు. నదీ జలాలతో మండపాన్ని సంప్రోక్షణ చేశారు. స్వామికి శ్రీరామ పాదుకలు, రాజముద్రికలు సమర్పించారు. అంతే కాకుండా శ్రీరామ దాసు చేయించిన పచ్చల పతకం, చింతాకు పతకం, రాజముద్రికను సమర్పించారు. స్వామివారి ఖడ్గం, రామమాడ, సుదర్శన చక్రం, శంఖు, ఛక్రాలు, ముత్యాల హారం, కిరీటాన్ని ధరింపచేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున గవర్నర్‌ తమిళసై స్వామికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం స్వామికి నదీ జలాలతో సంప్రోక్షణ చేశారు. ఆ జాలాలను భక్తులపై చల్లారు. దీని వల్ల చేసిన పాపాలు తొలగిపోయి మోక్ష సిద్ది లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ కర్నాటి వెంకటేశ్వర్లు, దేవస్థానం ఇవో బి.శివాజీ, వివిధశాఖల అధికారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

పట్టాభిషేకంలో ప్రొటోకాల్‌ వివాదం
గవర్నర్‌ తమిళిసై ముఖ్య అతిధిగా విచ్చేసిన మహాపట్టాభిషేకంలో ప్రొటోకాల్‌ వివాదం తలెత్తింది. గతంలో ఇఎస్‌ఎల్‌ నర్సింహన్‌ గవర్నర్‌గా ఉన్న సమయంలో జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎస్పీ, ఐటిడిఎ పీవో తప్పనిసరిగా హాజరయ్యేవారు. ఓ విధంగా చెప్పాలంటే గవర్నర్‌ వచ్చే ఈ కార్యక్రమానికి ప్రొటోకాల్‌ తప్పనిసరి. అటువంటిది సోమవారం జరిగిన పట్టాభిషేక కార్యక్రమానికి జిల్లా బాస్‌లు ఎవరూ హాజరు కాలేదు. పీవో మొదలుకొని అందరూ ఒక్కసారిగా సెలవు పెట్టారు. దీంతో గవర్నర్‌కు అవమానం జరిగినట్లుగా పలువురు చర్చించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement