Tuesday, April 30, 2024

ఏపీలో అనధికార లాక్ డౌన్!

ఆంధ్రప్రదేశ్ లో కరోనా సెకండ్ వేవ్  కల్లోలం సృష్టిస్తోంది. దీంతో లాక్ డౌన్ విధించక తప్పని పరిస్థితులు నెలకొంటున్నాయి. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అనధికార కర్ఫ్యూ, లాక్ డౌన్ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా రోజువారీగా నమోదవుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్నిచోట్ల ప్రజలు, వ్యాపారస్తులు స్వీయ లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా ప్రజలు వ్యాపారస్తులు లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తున్నారు.

 రాష్ట్రంలో మహమ్మారి తీవ్రత అధికంగా ఉన్నచోట్ల వ్యాపార సంఘాలు చర్చించుకుని పనివేళలు కుదించుకుంటున్నాయి. మరికొన్ని చోట్ల అధికార యంత్రాంగం, స్థానిక సంస్థలు నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నాయి. మధ్యాహ్నం తర్వాత నుంచి దుకాణాలు, ఇతర వాణిజ్య సముదాయాల్ని మూసేస్తున్నారు. రాత్రి వేళల్లో అనధికారిక కర్ఫ్యూ, లాక్‌ డౌన్‌ వాతావరణం కనిపిస్తోంది. మధ్యాహ్నం వరకే దుకాణాలు తెరుచుకుంటాయని ప్రకటించటంతో సమీప ప్రాంతాల నుంచి వచ్చేవారి రద్దీ బాగా తగ్గిందని వ్యాపారులు అంటున్నారు.

కరోనా సెకండ్ వేవ్ కారణంగా గుంటూరు జిల్లాలో తొలుత లాక్ డౌన్ విధిచాంరు. తొలిసారి భట్టిప్రోలు మండలం, ఆ తర్వాత కొల్లిపర, ఆతర్వాత తెనాలి రూరల్ మండలాల్లోని కొన్ని గ్రామాల్లో లాక్ డౌన్ ఆంక్షలు విధించారు. ఆ తర్వాత కూడా భారీగా కేసులు పెరుగుతుండటంతో వ్యాపారస్తులు కీలకం నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు, మంగళగిరి, సత్తెనపల్లి ఇలా ప్రధాన పట్టణాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకే షాపులు తెరుస్తామని ప్రకటించారు. 

గుంటూరులో రాత్రి 7 ఉదయం 6 గంటల మధ్య పూర్తి కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించారు. బుధవారం సాయంత్రం 6 గంటలకే దుకాణాలు మూతపడ్డాయి. గురువారం నుంచి నరసరావుపేటలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే వ్యాపార, వాణిజ్య సంస్థలు పనిచేయాలని నిర్ణయించారు. విజయవాడలోనూ ఒకింత లాక్ డౌన్ ఆంక్షలు విధించారు. ఈనెల 18న నగరవ్యాప్తంగా షాపులు బంద్ చేశారు. ప్రస్తుతం సాయంత్రం 6గంటల వరకే షాపులు తెరుస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే దుకాణాలు తెరవాలని ఆర్డీవో నిషేధాజ్ఞలు విధించారు.

ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ ఇదే రకమైన నిబంధనలు కొనసాగుతున్నాయి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు వైరస్ హాట్ స్పాట్లుగా మారడంతో స్థానికంగా ఆంక్షలు కొనసాగుతున్నాయి. విజయనగరం జిల్లాలోని సాలూరు, పార్వతీపురం, కురపాంలలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత దుకాణాలు మూసేస్తున్నారు. బొబ్బిలిలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే కిరాణా, కూరగాయల దుకాణాలు తెరుస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, సోంపేటలో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే దుకాణాలు తెరిచేందుకు అనుమతిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో కరోనా కేసుల తీవ్రత అధికంగా ఉన్న 19 మండలాల్లో అధికారులు నిషేధాజ్ఞలు విధించారు. ఉదయం 6-10, సాయంత్రం 4-6 మధ్యే దుకాణాలు తెరవాలని నిర్దేశించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, పాలకొల్లు, ఆచంట తదితర ప్రాంతాల్లో అన్ని దుకాణాలూ సాయంత్రం 6 గంటలకు స్వచ్ఛందంగా మూసేస్తున్నారు. ఆదివారం పూర్తిగా తెరవకూడదని నిర్ణయించారు.

- Advertisement -

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న దృష్ట్యా ప్రజలు కొవిడ్ మార్గదర్శకాలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. మాస్క్, ఫేస్ షీడ్, భౌతిక దూరం పాటించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే మాస్క్ లేనివారికి రూ.100 జరిమానా విధిస్తున్నారు. పబ్లిక్ ప్లేసుల్లో బౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా ఆంక్షలు కఠినతరం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement