Friday, May 17, 2024

కరోనా వ్యాక్సిన్ ఎవరెవరు తీసుకోకూడదు? డాక్టర్లు ఏం చెప్తున్నారు?

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా నడుస్తోంది. ప్రస్తుతం 45 ఏళ్లు దాటిన వారికి మాత్రమే ప్రభుత్వం టీకాలు ఇస్తోంది. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌లు ఇస్తామని ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించారు. అయితే అసలు కరోనా టీకాలను ఎవరు వేసుకోవాలి? ఎవరు వేసుకోకూడదు? అనే ప్రశ్నలు పలువురిని సతమతం చేస్తున్నాయి. చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ ఎందుకు ఇవ్వడం లేదన్న సందేహాలు ఉత్పన్నం అవుతున్నాయి. ఈ ప్రశ్నలకు కొందరు వైద్య నిపుణులు స్పందించారు. కరోనా టీకాలు వేసుకోవడంలో తొందరపడవద్దని వారు హెచ్చరిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకునే ప్రతి ఒక్కరూ ముందుగా తమ ఆరోగ్యంపై పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

ముఖ్యంగా జ్వరం ఉన్నప్పుడు కరోనా టీకాను వేయించుకోవద్దని వైద్య నిపుణులు చెప్తున్నారు. జ్వరం పూర్తిగా తగ్గిన తర్వాతే వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. అలర్జీ ఉన్నవారు కూడా టీకా వేయించుకోకూడదని తెలిపారు. అటు తొలి డోస్ వేయించుకున్న తర్వాత కొంతమంది అస్వస్థతకు గురవుతున్నారు. అలాంటి వారు రెండో డోస్ టీకా వేయించుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. అటు గర్భం ధరించిన మహిళలు, అవయవ మార్పిడి చేయించుకున్నవారు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు, బ్లీడింగ్ సమస్యలతో బాధపడేవారు టీకాల జోలికి వెళ్లవద్దని, ఒకవేళ వేయించుకోవాలని భావిస్తే డాక్టర్ల అనుమతి తీసుకున్న తర్వాతే వ్యాక్సిన్ వేయించుకోవాలని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. కాగా ప్లాస్మా ఆధారిత చికిత్స చేయించుకున్న కరోనా రోగులు అసలు టీకా వేయించుకోకపోవడమే ఉత్తమ మార్గమని వైద్యులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement