Thursday, May 2, 2024

స్థానిక సంస్థలకు నెల నెలా ఫండ్స్‌

ఆంధ్రప్రభ, హైదరాబాద్‌ :తెలంగాణలో పల్లెలు, పట్టణాలకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోని పల్లెలు, పట్టణాల అభివృద్దికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తోంది. రాష్ట్ర ఖజానాను నిధుల భారం వెంటాడు తున్నప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం కేసీఆర్‌ స్థానిక సంస్థల బలోపేతం, స్వయం స్వావ లంభనకు నెలనెలా నిధుల పంట పండిస్తున్నారు. ప్రతీ నెలా రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలకు రూ. 381.17కోట్లను విడుదల చేస్తున్నారు. ఇలా ఈ ఏడాదిలో కరోనా ఉధృతితో రాబడి తగ్గినా పెద్దగా పట్టించుకోకుండా స్థానిక సంస్థల అభివృద్ధికి రూ. 2487కోట్లను చెల్లించింది. కేటాయించిన మొత్తాల కంటే అదనంగా రూ. 200కోట్లను ఎక్కువగా చెల్లించింది. ఆర్ధిక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ అభివృద్ది, సంక్షేమ పథకాలకు వ్యయం చేస్తోంది. ఇందుకు ఈనిధులే సజీవ తార్కాణంగా నిలుస్తున్నాయి.

తెలంగాణ సర్కార్‌ హామీనిచ్చినట్లుగా ఆర్ధిక శాఖ తీవ్ర ఇబ్బందులను పక్కకునెట్టి మరీ ప్రతి నెలా క్రమం తప్పకుండా పల్లె ప్రగతికి రూ. 269.17కోట్లు, పట్టణ ప్రగతికి రూ. 112కోట్లను విడుదల చేస్తున్నది. పట్టణ ప్రగతిలో భాగంగా జీహెచ్‌ఎంసీ మినహా 141 మున్సిపాలిటీలు, మున్సిల్‌ కార్పొరేషన్లకు ఈ ఆర్ధిక యేడాదిలో రూ. 1241.72కోట్లు చెల్లించారు. జీహెచ్‌ఎంసీకి ప్రాధాన్యతా క్రమంలో వారికి ఉన్న బడ్జెట్‌ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికంగా అనేక రూపాల్లో నిధులను ఖర్చు చేస్తోంది. జీహెచ్‌ఎంసీ రాబడినుంచి ఒక్క రూపాయి నిధులను కూడా కజానాకు తరలించకుండా అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఇతర అభివృద్ధి, సంఓఏమ పథకాలకు భారీగా వ్యయాలు చేస్తోంది. పట్టణ ప్రగతికి జీహెచ్‌ఎంసీకి గతేడాది రూ. 377కోట్లు, ఈ ఏడాది రూ. 185కోట్లతో కలుపుకుని మొత్తం రూ. 563కోట్లు చెల్లించింది. ఉపాధిహామీ పథకంలో భాగంగా పల్లె ప్రాంతాలకు రూ. 1929కోట్లను వ్యయం చేసి పూర్తి చేసింది. ఈ ఆర్ధిక ఏడాదిలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ. 1432కోట్లను విడుదల చేయగా, గతేడాది రూ. 1751కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద గతేడాది రూ. 1751కోట్లను, ఈ ఏడాది ఇప్పటివరకు రూ. 927కోట్లను రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపులు చేసింది. ఆర్ధిక సంఘం నిధులతోపాటు వంద శాతం మ్యాచింగ్‌ గ్రాంట్‌కు అదనంగా రూ. 500కోట్లను రాష్ట్ర ప్రభుత్వం జత చేసింది. ప్రస్తుత ఆర్ధిక యేడాదిలో ఆర్దిక సంఘంనుంచి రూ. 733కోట్లురాగా, రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా రూ. 2487కోట్లను చెల్లించింది.

రాష్ట్రవ్యాప్తంగా పల్లెలు, పట్టణాల అభివృద్ధి కీలక ఎజెండాగా నిర్దేశించుకున్న సర్కార్‌ ఆ దిశగా హామీలన్నింటికీ నిధుల వరద పారించింది. ఎక్కడ కూడా పెండింగ్‌లు లేకుండా ఆర్ధికంగా బిల్లులను సకాలంలో చెల్లిస్తూ వచ్చింది. వైకుంఠధామాలకు ఇప్పటివరకు రూ. 1041కోట్లను చెల్లించగా, ఘన వ్యర్ధాల షెడ్లకుగానూ రూ. 268కోట్లను, పల్లె ప్రకృతి వనాలకు రూ. 157కోట్లను, సీసి రోడ్లకు రూ. 461కోట్లను చెల్లించింది. ఇదివరకు రిజిస్ట్రేషన్లపై ఫీజులనుంచి 1.5శాతం బదలీ సుంకం ద్వారా గ్రామ పంచాయతీలకు వచ్చే రాబడి నిల్చిపోయింది. కేంద్ర ఇస్తున్న ఆర్ధిక సంఘం నిధుల్లోనూ కోతలు పడ్డాయి. కేంద్రం ఇచ్చిన హామీల అమలులో విఫలమవుతూ వస్తున్నది. దీంతో స్థానిక సంస్థలకు ఆదాయ వనరులు తగ్గిన ఫలితంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో ఆర్ధికంగా చేయూతనిస్తూ వస్తోంది. బదలీ సుంకాల ద్వారా శివారు గ్రామాలకు ప్రయోజనం చేకూరేది. ఇక్కడ జరిగే రియల్‌ వ్యాపారానికి అనుగుణంగా ప్రతి యేటా రూ. ఐదారు లక్షల ఆదాయం సమకూరేది. రియల్‌ వ్యాపారాలు పెద్దగా లేని మండల కేంద్రాలు, మేజర్‌ గ్రామ పంచాయతీలకు కూడా ఏటా రూ. 50వేలకుపైగా ఆదాయం వచ్చేది. ఈ బదలీ సుంకాన్ని సాధారణ నిధి(జనరల్‌ ఫండ్‌) కింద పరిగణించేవారు. దీంతో గ్రామాల సర్పంచ్‌లు వారి విచక్షణ మేరకు గ్రామాల్లో అభివృద్ధి, ఇతర కార్యక్రమాలకు వీటినిక ఖర్చు చేసేవారు. కానీ వివిధ రూపాల్లో వచ్చే రాబడి స్థానిక సంస్థలకు తగ్గడంతో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమంతో నిధులను అందిస్తోంది. దీంతో వాటిని బలోపేతం చేసేలా కృషి చేస్తున్నది. తద్వారా సీఎం కేసీఆర్‌ ఆశించిన లక్ష్యాలు నెరవేరుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement