Wednesday, May 8, 2024

సర్దార్ పటేల్ తోనే తెలంగాణకు విముక్తి : అమిత్ షా

సర్దార్ వ‌ల్ల‌భాయ్‌ పటేల్ కృషి వల్లే నిజాం పాలన నుంచి తెలంగాణ ప్రాంత ప్రజలకు విముక్తి ల‌భించింద‌ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరుగుతున్న ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన అమిత్ షా.. అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం భద్రతా బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండ్, కర్ణాటక రవాణాశాఖ మంత్రి బి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. హైదరాబాద్ స్వాతంత్య్రం కోసం ఎందరో ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. జలియన్‌వాలాబాగ్ తరహా ఘటన గుండ్రాంపల్లిలో జరిగిందన్నారు. సర్దార్ పటేల్ చొరవతో పోలీసు చర్య తీసుకోవడం వల్లే తెలంగాణ విముక్తి సాధ్యమైందన్నారు. ఆనాడు 109 గంటల పాటు సైనిక చర్య అవిశ్రాంతంగా జరిగిందన్నారు. పటేల్ లేకుంటే తెలంగాణ విముక్తికి మరింత సమయం పట్టేదన్నారు.

తెలంగాణకు, కర్ణాటక, మహరాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు సెప్టెంబర్ 17న స్వాతంత్ర్యం వచ్చిందని గుర్తుచేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఏడాది తర్వాత హైదరాబాద్ ప్రజలకు స్వాతంత్య్రం వచ్చిందన్నారు. ఇన్నాళ్లు ఏ ప్రభుత్వం కూడా విమోచన దినోత్సవం నిర్వహించేందుకు సాహసించలేదని అన్నారు. విమోచన దినోత్సవం నిర్వహించేందుకు అన్ని పార్టీలు భయపడ్డాయన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలతోనే ఇన్నాళ్లు వేడుకలను జరపలేదని విమర్శించారు. ప్రధాని మోదీ ఈ ఏడాది తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని ఆదేశించారని తెలిపారు. ఏ భయం లేకుండా వేడుకలను చేసుకోవాలని ప్రజలను కోరుతున్నట్టుగా చెప్పారు. హైదరాబాద్ స్వాతంత్య్రం కోసం ఎందరో ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. రజాకార్లు అనేక గ్రామాల్లో హత్యలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారని తెలిపారు. సర్దార్ పటేల్ కృషి వల్ల నిజాం పాలన నుంచి ఈ ప్రాంత ప్రజలు విముక్తి పొందారని చెప్పారు. నిజాం పాలనలో మహిళలపై లెక్కలేనన్ని ఆగడాలు జరిగాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement