Thursday, May 2, 2024

లేట్‌ కానున్న ఇంటర్‌ ఫలితాలు.. ముగిసిన మూల్యాంకన ప్రక్రియ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: ఇంటర్మీడియెట్‌ వార్షిక పరీక్షల ఫలితాల ప్రకటన మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను ఇంటర్‌ బోర్డు పూర్తి చేసినా ఫలితాల విడుదలకు సంబందించిన ప్రక్రియను ఇంకా ప్రారంభించలేదని తెలుస్తోంది. దీంతో ఫలితాలను విడుదల చేసేందుకు మరో పది రోజుల సమయం పట్టే అవకాశం ఉందని ఇంటర్‌ బోర్డు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ముగిశాక ఆయా క్యాంపుల నుంచి మర్క్స్‌ వాంటింగ్‌ వివరాలు తెప్పించాల్సి ఉంటుంది. ఇందుకు జవాబు పత్రాలను మూల్యాంకన చేసిన ప్రాంతాలకు కబురు పెట్టి పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కుల వివరాలను సబ్జెక్టుల వారీగా తెప్పించి వాటిని కంప్యూటర్లలో ఎక్కించాల్సి ఉంటుంది.

ఇలా రెండు దఫాలు క్యాంపుల నుంచి విద్యార్థుల వివరాలను తెప్పించి ఆ తర్వాతే ఫలితాల విడుదలకు ప్రక్రియను మొదలు పెడతారు. ఇంటర్‌ బోర్డు పరీక్షల విభాగం అధికారులు సెంటర్‌ ఫేర్‌ గుడ్‌ గవర్నేన్స్‌(సీజీజీ)లో మకాం వేసి విద్యార్థులు పొందిన మార్కుల వివరాలను సబ్జెక్టుల వారీగా అప్‌ లోడ్‌ చేస్తున్నట్టు- సమాచారం ఈ ప్రక్రియ మరో పది రోజుల పాటు- కొనసాగించిన తర్వాతే ఫలితాలను ఎప్పుడు ప్రకటించాలన్న నిర్ణయానికి వస్తామని బోర్డు అధికారులు చెబుతున్నారు. తెలంగాణతో పాటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇంటర్‌ పరీక్షలు జరిగాయని అయితే అక్కడ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను బుధవారం విడుదల చేశారని విద్యార్థులు వారి తల్లి దండ్రులు చెబుతున్నారు.

పరీక్షలు పూర్తయిన 22 రోజుల్లోనే ఏపీ సర్కార్‌ ఇంటర్‌ ఫలితాలను ప్రకటించిందని వారు పేర్కొన్నారు. ఇంటర్‌ బోర్డులో ముక్యంగా పరీక్షల విభాగంలో అనుభవజ్ఞులైన అధికారులు లేనందునే మూల్యాంకనం, ఫలితాల విడుదలలో జాప్యం జరగడానికి కారణమన్న ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద ఇంటర్‌ వార్షిక ఫలితాలు మే 10వ తేదీ తర్వాతే విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement