Thursday, May 16, 2024

మరో చారిత్రిక ఘట్టానికి శ్రీకారం.. ఒడిషా-ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రుల సమావేశం

ఒడిశా- ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య నెలకొన్న పలు సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి జగన్‌ ముందడుగు వేశారు. మంగళవారం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల బేటీ కానున్నారు. 1062లో అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి నేరడి బ్యారేజి నిర్మాణానికి శంకు స్థాపన చేశారు. అప్పటి నుండి సరిహద్దు వివాదం పరిష్కారం కాకపోవడంతో ఆ సమస్య అలాగే ఉండి పోయింది. ఈ వివాదం పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు ఎన్‌టీ రామారావు, చంద్రబాబునాయుడు ప్రయత్నం చేశారు. 2002లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒడిషాతో సంబందం లేకుండా రెండవదశకు సంబందించి 60వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఆముదాలవలస వద్ద వయోడెక్‌ నిర్మించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 2005లో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన జలయజ్ఞం ద్వారా రూ. 800ల కోట్ల వంశదార రెండ వదశ పనులు చేపట్టేందుకు నిర్ణయించారు. 2008 నాటికి వంశధార రెండవదశ పనులు పూర్తిచేయడానికి నిర్ణయించారు. దీంతో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహించి పనులకు ఆటంకం కల్పించింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ఒడిశా ముఖ్యమంత్రితో నదీజలాల వివాదంతో పాటు సరిహద్దు గ్రామాల సమస్యలపై కూడా చర్చించనున్నారు.

వంశధార నదీ జలాల వివాద పరిష్కారంతోపాటు, ఒడిషా-ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య ఉన్న పలు జలవివాదాల పరిష్కారానికి ఎపి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మరో చారిత్రిక ఘట్టానికి శ్రీకారం చుట్టబోతున్నారు. వంశధార రెండవదశ నిర్మాణానికి సంబందించి ఆంధ్రప్రదేశ్‌ తమకు కేటాయించిన 50 శాతం నీటిని పూర్తిగా వినియోగించుకోవడానికి నేరడీ బ్యారేజ్‌ నిర్మాణం ద్వారానే సాధ్యపడుతుంది. ఇందుకు సంబందించి 1962లో అప్పటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య నేరడీ బ్యారేజ్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. అంతకుముందు వివాదాల పరిష్కారం ఒడిషా- ఆంధ్రప్రదేశ్‌ రాస్ట్రాలు ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయి. బ్యారేజ్‌ నిర్మాణ ద్వారా ఒడిషాలోని 106 ఎకరాలు ముంపునకు గురౌతుందని, ఆ మేరకు ఒడిషా ప్రభుత్వం అప్పటి నుండీ అభ్యంతరాలు తెలియజేస్తూనే వస్తోంది. దీంతో వంశధార రెండవదశ నిర్మాణం దాదాపు ఆరు దశాబ్దాలుగా జిల్లాకు తీరని కలగానే ఉంటూ వచ్చింది. ఈ వివాద పరిష్కారానికి గతంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు, ఒడిషా సిఎం బిజూపట్నాయక్‌తో చర్చలు జరపడం కూడా జరిగింది. ఆ తరువాత ఇరు రాష్ట్రాల ఉన్నత స్థాయి అధికారులు సమావేశమైనప్పటికీ వివాదాలు పరిష్కారం కాలేదు. వంశధారపై నేరడి బ్యారేజ్‌ నిర్మాణం వల్ల 1300ల ఎకరాలు ముంపునకు గురవుతుందని ఒడిషా మెలికలు పెడుతూ వస్తోంది. దీంతో రెండవదశ ఆరు దశాబ్దాలుగా చేపట్టడానికి అవకాశం లేకుండా పోయింది. అయితే 2002లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒడిషాతో సంబందం లేకుండా రెండవదశకు సంబందించి 60వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఆముదాలవలస వద్ద వయోడెక్‌ నిర్మించి అక్కడి నుండి శ్రీకాకుళం, గార మండలాలకు కూడా సాగునీటిని అందించే చర్యలు చేపట్టారు. 2004 నాటికి అందుకు సంబందించిన 30వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టినప్పటికీ మరో 30వేల ఎకరాలకు పనులు నిలిచిపోయాయి. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం మిగిలిన 30వేల ఎకరాలకు నీరందించేందుకు పనులు పూర్తి చేసారు.

అయితే వంశధార రెండవదశకు సంబందించి నేరడీవద్ద బ్యారేజ్‌ నిర్మించుకొని, అక్కడి నుండి హిరమండలం రిజర్వాయర్‌కు సాగునీటిని తరలించి ఆ తరువాత కాలువల ద్వారా దాదాపు 1.10లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే కాకుండా, వంశధార మొదటిదశకు సంబంది ంచి 1.45 లక్షల ఎకరాలకు సాగునీటి స్థిరీకరణ చేయడంతోపాటు, రెండు పంటలకు పూర్తిస్థాయిలో నీరందించే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితిని పూర్తిగా పరిశీలించిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2005లో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన జలయజ్ఞం ద్వారా రూ. 800ల కోట్ల వంశదార రెండ వదశ పనులు చేపట్టేందుకు నిర్ణయించారు. ఒడిషాతో సంబందం లేకుండా కాట్రగడ తదితర మూడు ప్రాంతాల్లో మినీ రిజర్వాయర్‌లు కట్టి, సైడ్‌వ్యూయర్‌ కాలువల ద్వారా హిరమండలంలో 19 టిఎంసిల నీటిని నిల్వా చేసే రిజర్వాయర్‌ నిర్మించుకోవడానికి ప్లానింగ్‌ సిద్దం చేయించారు. ఆ మేరకు 2008 నాటికి వంశధార రెండవదశ పనులు పూర్తిచేయడానికి నిర్ణయించారు. దీంతో ఒడిషా ప్రభుత్వం ఆగ్రహించి అంతర్‌రాష్ట్ర జలవివాదాన్ని పరిష్కరించుకోకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒడిషాకు నష్టం కలిగించే విదంగా వంశధార రెండవదశ పనులు చేపడుతోందని సుప్రీమ్‌కోర్టులో ఫిటీషన్‌ దాఖలు చేసి, పనులు చేపట్టకుండా ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఇవ్వాలని కోరింది. ఆ సమయంలో మన రాస్ట్రం తరపున సరైన వాదనలు వినిపించడంలో విఫలం కావడంతో సుప్రీంకోర్టు ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఇవ్వడంతో పనులు నిలిచిపోయాయి. ఆ తరువాత సుప్రీమ్‌కోర్టు ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ట్రిబ్యున్‌లు ఏర్పాటు చేయాలని, అక్కడ రెండు రాష్ట్రాల వాదనలు విన్నతరువాత ట్రిబ్యునల్‌ తీర్పుమేరకు ఉబయరాష్ట్రాలు నడుచుకోవాలని ఆదేశించింది. దీంతో వంశధార పనులకు పూర్తిగా బ్రేకులు పట్టాయి.

అప్పటి కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయడంలో చేసిన జాప్యం, ఆ తరువాత ట్రిబ్యునల్‌కు జడ్జి, ఇతర సిబ్బంది నియామకం, మౌళిక సదుపాయాల కల్పన తదితర అంశాల్లో పూర్తి జాప్యం చేసారు. ట్రిబ్యునల్‌కు తొలిసారిగా నియమించబడిన న్యాయమూర్తి ఆరు నెలల అనంతరం పదవికి రాజీనామా చేయడంతో మళ్లిd సమస్య మొదటికొచ్చింది. ఈలోగా 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ హఠాన్మరణంతో వంశధార రెండవదశను పట్టించుకునే నాధుడే కరువయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్‌ దాదాపు మూడేళ్ల పాటు భయరాష్ట్రాల వాదనలు విని, పరిశీలించిన ట్రిబ్యునల్‌ బృందం కూడా నేరడీ బ్యారేజ్‌ నిర్మాణం, ఒడిషాకు ఏమాత్రం నస్టం జరుగుతుందన్న అంశాలపై క్షేత్రస్థాయి పరిశీలిన జరిపింది. ఉభయరాస్ట్రాల అధికారులు కూడా ట్రిబ్యునల్‌ ముందు వాదనలు వినిపించారు. చివరకు 2014లో వంశధార రెండవదశ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్‌కు పూర్తిస్థాయి హక్కు ఉన్నట్లు ట్రిబ్యునల్‌ పేర్కొంటూ ఒడిషా అభ్యంతరాలను తోసిపుచ్చింది. ఆ తరువాత నేరడీ బ్యారేజ్‌ నిర్మాణానికి కూడా ట్రిబ్యునల్‌ తీర్పు ఇచ్చింది. ఈ అంశంలో కూడా ఆంధ్రప్రదేశ్‌ వాదనాలకు అనుగుణంగానే తీర్పు ఇస్తూ ఈ బ్యారేజ్‌ నిర్మాణం వల్ల ఒడిషాలో నష్టపోయి 106 ఎకరాలకు సంబందించి పరిహారాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒడిషా రాస్ట్రానికి ఇచ్చి, తరువాత పూర్తిస్థాయిలో బ్యారేజ్‌ నిర్మించుకోవచ్చని తీర్పు ఇచ్చింది.

దీంతో 2015 తరువాత అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం వంశధార రెండవదశ నిర్మాణం కోసం చర్యలు చేపట్టింది. ఈ లోగా ప్రోజెక్టు వ్యయం రూ.800ల కోట్ల నుండి దాదాపు రూ. 1600ల కోట్లకు చేరింది. అయితే వంశధార ప్రోజెక్టు నిర్మాణంవల్ల భూములు, ఇళ్లు కోల్పోయే బాధితులకు పరిహారం చెల్లించే విషయంలో అంతకుముందు జరిగిన అవకతవకలపై 21 గ్రామాల ప్రజలు తీవ్ర అభ్యంతరాలు తెలిపారు. వాస్తవానికి రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలోనే వంశధార నిర్మానానికి సంబందించిన భూసేకరణ చేసి, పరిహారం అప్పటి ధరలనుబట్టీ చెల్లించడం జరిగింది. అయితే నిర్వాసితులకు పరిహారం చెల్లించే విషయంలో ఆయా ప్రాంతాల్లో జరిగిన అవకతవకలతో నిర్మాణం జరపనివ్వమంటూ ఆయా గ్రామాల ప్రజలు ఉధ్యమించారు. ఈ ప్రోజెక్టు నిర్మాణాన్ని చేపట్టి సంస్థకు చెందిన ఆస్తులను కూడా అప్పట్లో ధ్వంసం చేయడం జరిగింది. దీంతో తెలుగుదేశం ప్రభుత్వం ఒక మెట్టు దిగి నిర్వాసితులందరికీ న్యాయం జరిగేలా అవసరమైన ప్యాకేజీతోపాటు, యుత్‌ ప్యాకేజీతో సిద్దమవ్వడంతో అప్పట్లో జిల్లా కలెక్టర్‌ ధనంజయరెడ్డి చికచక్యంగా వ్యవహరించడంతో నిర్వాసిత ప్రజలు ప్రోజెక్టు నిర్మాణాని సానుకూలంగా అంగీకరిస్తూ గ్రామాలను ఖాళీ చేసారు. ఆ తరువాత పనులు వేగవంటంగా జరిగాయి. 2018 ఖరీప్‌ నాటికి ఈ ప్రోజెక్టు ఎలాగైనా పూర్తి చేయాలని చంద్రబాబు ప్రభుత్వం భావించినప్పటికీ వివిధ కారాణలవల్ల అది సాధ్యపడలేదు.

- Advertisement -

2019 జనవరికి పూర్తవుతుందని భావించినప్పటికీ, అక్టోబర్‌లో వచ్చిన తిత్లిd తుఫాన్‌ కారణంగా దాదాపు రెండుమూడుమాసాలు పనులు నిలిచిపోయి పనులు జరగలేదు. 85 శాతం పనులు పూర్తయినప్పటికీ, మిగతా పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వం వంశధార ప్రోజెక్టు రెండవదశ నిర్మాణంపై ప్రత్యేక దృష్టిపెట్టినప్పటికీ, నిధుల లేమి సమస్యతోపాటు, ఒడిషా ప్రభుత్వం ఎటువంటి అభ్యంతరాలు లేవనెత్తుందోనన్న అనుమాలు కూడా నెలకొన్నాయి. నేరడి నిర్మానానికి కూడా ట్రిబ్యునల్‌ నుండి అనుమతి రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ బ్యారేజీ నిర్మాణానికి సుముఖత వ్యక్తం చేసింది. అయితే ఒడిషా ప్రభుత్వం ఈ బ్యారేజీ నిర్మాణం వల్ల 1300ల ఎకరాలు ముంపునకు గురవుతుందని మెలికలు పెడుతుండడంతో ఈ మొత్తం వ్యవహారంపై ఒడిషా సిఎంతో మాట్లాడితేనే సమస్య పరిస్కారం అవుతుందని భావించిన ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సాయంత్రం 5 నుండి 7 గంటల వరకూ ఒడిషా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌తో చర్చించేందుకు వెళ్లనున్నారు.

ఒకప్పుడు ఒడిషాలోనే ఉన్న శ్రీకాకుళం జిల్లా రైతాంగానికి న్యాయం జరిగేలా ఒడిషా ప్రభుత్వం సహకరించాలని, నేరడీ బ్యారేజ్‌ నిర్మాణానికి ట్రిబ్యునల్‌ తీర్పును అనుసరించి పూర్తిస్థాయిలో సహకరించాలని ఈ సందర్భంగా సిఎం జగన్మోహన్‌రెడ్డి ఒడిషా ముఖ్యమంత్రిని కోరనున్నారు. అంతేకుండా జంఝ్యావతి, పోలవరం ప్రోజెక్టులకు సంబందించి కూడా ఒడిషా నుండి పూర్తిస్తాయి సహకారం అందించాలని, చిన్నచిన్న అభ్యంతరాలు చెప్పకుండా తమకు సహకరించాలని కోరనున్నట్లు తెలుస్తోంది. మరోపక్క ఆంధ్రప్రదేశ్‌-ఒడిషా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న కొటియా గ్రామస్తుల విషయంలో వారికి న్యాయం జరిగేలా ఒడిషా ప్రభుత్వం వ్యవహరించాలని, కోర్టు తీర్పులను అనుసరించి ఆ గ్రామంపై ఇరు రాష్ట్రాలకు అధికారం ఉన్నందున ఒడిషా అధికారులు ఈ విషయంలో సానుకూలంగా వ్యవహరించాలని జగన్‌ ఒడిషా ముఖ్యమంత్రిని కోరనున్నట్లు తెలుస్తోంది. దాదాపు మూడున్నర దశాబ్దాల తరువాత వంశధార జలవివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించుకోవడానికి ముందుకు రావడంతో ఒక చారిత్రిక ఘట్టంగా అందరూ భావిస్తున్నారు. సిఎం జగన్‌ చూపిన చొరకు ఒడిషా ప్రభుత్వం కూడా సహకరిస్తున్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తం అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement