Saturday, May 4, 2024

Siddipet : కొమురవెళ్లి మల్లన్న ఆలయం దినదినాభివృద్ధి… హరీశ్ రావు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొమురవెళ్లి మల్లన్న దేవాలయం దినదినాభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా కొమురవెళ్లి మల్లిఖార్జున స్వామి దేవాలయ క్యూ-లైన్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు మంత్రి హరీశ్ రావు భూమిపూజ చేశారు. అంతకుముందు స్థానిక జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తో కలిసి పట్నం వేసి కల్యాణోత్సవంలో హాజరై అనంతరం మల్లన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ…. కొమురవెళ్లి మల్లన్న దివ్య క్షేత్రంలో రూ.12 కోట్ల వ్యయంతో క్యూ లైన్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామన్నారు. కొమురవెళ్లి మల్లన్నకు ముఖ్యమంత్రి హోదాలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారన్నారు. దేవాలయాభివృద్ధి భూమిపూజ చేసి, పట్టుదలతో తెలంగాణ సాధించి వచ్చి ఇతోధికంగా ఆలయ అభివృద్ధికై సంకల్పించినట్లు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఇక్కడికి వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు ఉండేవి కావన్నారు. దేవాలయ అభివృద్ధికై రూ.36 కోట్లు వెచ్చించి వివిధ అభివృద్ధి పనులు ముమ్మరంగా చేపట్టినట్లు వెల్లడించారు. మల్లన్న కల్యాణోత్సవంలో ఇచ్చిన హామీ మేరకు మల్లన్నకు బంగారు కిరీటం, వెండి తలుపులు, వెండి ముఖద్వారాలు చేయించినట్లు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని అతిపెద్ద మల్లన్న సాగర్ జలాశయం ప్రారంభించి, ఆ గోదావరి జలాలు తెచ్చి మల్లన్నకు కాళ్లు కడిగి సీఎం కేసీఆర్ మొక్కు చెల్లించుకున్నారన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయించడంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రంకు కల్పతరువుగా మారిందన్నారు. మొక్కు తీర్చుకొనేందుకు వచ్చిన సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రాజీవ్ రహదారి నుంచి ఆలయానికి వచ్చేలా రూ.10.30 కోట్లు నిధులతో డబుల్ లేన్ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయన్నారు. దేవాలయ ఆవరణలోని గుట్టపై 100 గదులతో సత్రాలు త్వరితగతిన పూర్తి చేసుకుంటున్నామన్నారు.

మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాకర్, ఇతర దాతల సహకారంతో దేవాలయ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్లాస్టిక్ రహిత దేవాలయంగా ఉండాలని ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రయత్నం చేస్తున్నారని, ఇందుకు భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో మల్లన్న ఆలయానికి రూ.4, 5 కోట్లు ఆప్యాయం మాత్రమే వచ్చేదని, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత దినదినాభివృద్ధి చెంది ఇవాళ రూ.18 కోట్ల మేర ఆదాయం వస్తున్నదని మంత్రి వెల్లడించారు. ఈ యేడు ఇంకా కాలం కాకున్నా మల్లన్న దేవుడి ఆశీస్సులతో వర్షం కోసం ఎదురు చూపులు చూడకుండా కాళేశ్వరం ద్వారా వచ్చే జలాలు ఉన్నాయని రైతులు ధైర్యంగా, నమ్మకంతో నారు పోశారని ధీమాగా మంత్రి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement