Sunday, April 28, 2024

సాగర్ ఉపఎన్నికలో నిజామాబాద్ సీన్!

తెలంగాణలో ఇప్పుడు అన్నీ పార్టీల దృష్టి నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక పైనే ఉంది. ఎమ్మెల్సీ విజయంతో మంచి ఊపుమీదుంది టీఆర్ఎస్.. సెట్టింగ్ స్థానాన్ని మరోసారి కైవసం చేసుకోవడానికి వ్యూహాలు రచిస్తోంది. ఇక దుబ్బాక విజయాన్ని మరోసారి పునరావృతం చేయాలని బీజేపీ ఆశిస్తోంది. కాగా ఓడిన చోటే తిరిగి జెండా పాతాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీనితో ఈ ఉపఎన్నికను అన్నీ పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

అయితే ఈ ఎన్నికలో పోటీ చేసేందుకు దాదాపుగా నాలుగువందల అమరవీరుల కుటుంబాలు రెడీ అవుతున్నాయి. రేపో మాపో నామినేషన్లు వేసేందుకు కూడా సిద్దమవుతున్నాయి. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన మలిదశ తెలంగాణ పోరాటంలో రాష్ట్రవ్యాప్తంగా 1300 పైగా మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. అయితే ఇందులో కొందరినే గుర్తించిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. కొందరిని అదుకోగా.. మరికొందరిని పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. దీనితో అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని గత కొన్నేళ్లుగా తెలంగాణ అమరవీరుల ఐక్యవేదిక డిమాండ్ చేస్తోంది. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో త్వరలో జరగబోయే నాగార్జున సాగర్ ఉపఎన్నికలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటీ చేసేందుకు సిద్దం అవుతున్నాయి.

గతంలో ఓ సారి టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఇలాంటి ఎదురుదెబ్బ తగిలింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పసుపు రైతులు ఇలానే నామినేషన్లు వేశారు. వందలాదిమంది రైతులు నామినేషన్లు వేయడంతో… టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసిన కవిత ఓడిపోయారు. ఇప్పుడు అచ్చం అలాంటి సీనే సాగర్ లో కూడా రీపీట్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇదే జరిగితే టీఆర్ఎస్ కి భారీ నష్టం జరిగే అవకాశం కనిపిస్తోంది. అమరవీరుల కుటుంబసభ్యులు నామినేషన్లు వేస్తే ఇతర పార్టీలకి లాభం జరుగుతుంది. అందుకే సాగర్ లో ఇలాంటి సమస్య రాకుండా సీఎం కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. సాగర్ ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్న అమరవీరుల కుటుంబాలతో టీఆర్ఎస్ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్టుగా సమాచారం. ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్టుగా పార్టీ నేతలు వారికి చెపుతూ.. వారిని బుజ్జగించే పనిలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరి కేసీఆర్ హామీతో వారు అగిపోతారా లేకా ముందుకు వెళ్తారా అన్నది చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement