Friday, May 3, 2024

మోడీ హయాం – తిరోగమనం… కెసిఆర్

అత్యంత వైఫల్య ప్రధాని
అన్నిరంగాల్లో దేశం తిరోగమనం
మేక ఇన్‌ ఇండియా డంబాచారమే
ప్రజాధనం కార్పోరేట్లకు ధారపోస్తున్నారు
లక్షల కోట్ల ఆస్తులు అమ్మేస్తున్నారు
ఎన్‌పీఏల పేరుతో రూ.14 లక్షల కోట్లు దోపిడీ
దేశ పౌరసత్వాన్ని వదులుకునే దౌర్భాగ్యమెందుకు
కుట్రపూరిత, విద్వేష, నిరంకుశ పాలన
మన్మోహన్‌ హయాంలోనే వృద్ధి భేష్‌
తలసరి ఆదాయంలో… జీడీపీలోనూ మెరుగు
లెక్కల్లో ఒక్కమాట అబద్దమున్నా
రాజీనామా చేస్తా: అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌

రత్నగర్భలాంటి దేశంలో కనీస అవసరాలు తీరడంలేదు… దేశ రాజధాని ఢిల్లీలోనూ తాగునీటికి దిక్కులేదు. ఎన్‌పీఏల పేరుతో కార్పొరేట్‌ సంస్థలకు రూ.14 లక్షల కోట్లు దోచిపెట్టారు… లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తులను ఇష్టారాజ్యంగా అమ్మేస్తున్నారు. అమెరికాలో గ్రీన్‌కార్డు వస్తే పండుగ చేసుకునే పరిస్థితి నెల కొంది… ఇది మన దేశ పాలకుల దౌర్భాగ్యం కాదా? 8 ఏళ్లలో 20 లక్షల మంది భారతీయ పౌరసత్వం వదులుకున్నారు. దేశ పౌరసత్వాన్ని వదులుకునే దౌర్భాగ్యం ఎందుకు? మన్మోహన్‌ సింగ్‌ పాలనతో పోలిస్తే మోడీ పాలనలో దేశం ఘోరంగా దెబ్బతిన్నది. కొందరు భయంతో మాట్లాడకపోవచ్చు.. అందరికీ భయం ఉండదు కదా… ఏమాత్రం ముందు చూపులేని నరేంద్రమోడీ పాలనలో దేశ ప్రజలు ఓడిపోయారు…


హైదరాబాద్‌, ఆంధ్రప్రభబ్యూరో: ప్రపంచంలోనే ఎక్కడా లేని వనరులు కలిగి ఉండి, ఏ రంగంలోనూ పురోగతి సాధించకపోవడం ఖచ్చితంగా దేశ పాలకుల వైఫల్యమేనని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. పుష్కలమైన నీళ్ళు, ఇంధన వనరులు, మేధో సంపత్తి కలిగిన మానవ వనరులు, కష్టపడి పనిచేసే రైతులు.. అన్నీ ఉన్న రత్నగర్భలాంటి దేశంలో ఈ దౌర్భాగ్యమేల అని ప్రశ్నించారు. మతాల మధ్య చిచ్చుపెట్టి, కార్పొరేట్‌ సంస్థల పెట్టుబడితో భారీ మెజారిటీతో భారతీయ జనతా పార్టీ గెలిచినప్పటికీ, ఏ మాత్రం ముందుచూపులేని నరేంద్ర మోడీ పాలనలో దేశ ప్రజలు ఓడిపోయారని ధ్వజమెత్తారు. తెలంగాణ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఆదివారం సభలో ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన చర్చ అనంతరం సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, అన్ని రంగాల్లో దేశం తిరోగమనంలోకి వెళుతున్నా, ప్రధానితో పాటు ఆ పార్టీ నేతలంతా గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. మోడీ కుట్రపూరిత, విద్వేష, నిరంకుశ పాలనలో తెలంగాణ రూ.3 లక్షల కోట్లు నష్టపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. నా లెక్కలు తప్పు.. అని నిరూపిస్తే, రాజీనామాకు సిద్ధమని కేసీఆర్‌ ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని సవాల్‌ చేశారు.


దేశ ప్రజల అవసరాలు తీర్చే అన్ని రకాల వనరులు మనవద్ద ఉన్నా, వాటిని వదిలేసి విదేశీ వ్యామోహాన్ని పెంపొందిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజల సొమ్మును కార్పొరేట్‌ సంస్థలకు దారపోస్తూ ప్రధాని మోడీ లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తులను ఇష్టారాజ్యంగా అమ్మేస్తున్నారని ఆరోపించారు. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’, ‘విశ్వగురు’ నినాదం… అంతా ఉత్తిదేనని, ప్రజలను మోసగించే బీజేపీ నాయకుల డంబాచారమేనని కేసీఆర్‌ విమర్శించారు. మోడీ సర్కారు హయాంలో ఏ ఒక్క రంగంలోనైనా వృద్ధి రేటు- ఉందా అని ప్రశ్నించారు. మన్మోహన్‌ హయాంలో తలసరి ఆదాయం వృద్ధి రేటు- 12.73 శాతం.. మోడీ హయాంలో తలసరి ఆదాయం వృద్ధి రేటు- 7.1 శాతం అని పేర్కొన్నారు. అప్పు చేయడంలో మోడీని మించిన ప్రధాని ఇప్పటి వరకు లేరని ఎద్దేవా చేశారు. డెట్‌ టు- జీడీపీ మోడీ హయాంలో పెరిగిందని.. ఇది ఎవరూ కాదనలేని సత్యం అని స్పష్టం చేశారు. మన్మోహన్‌సింగ్‌ హయాంలో డెట్‌ టు- జీడీపీ 52.2 శాతం.. మోడీ హయాంలో 56.2 శాతం అని కేసీఆర్‌ పేర్కొన్నారు. మూలధన వ్యయం మన్మోహన్‌ హయాంలో 37 శాతం.. మోడీ హయాంలో 31 శాతం అని సభకు వివరించారు.

మన్మోహన్‌ హయాంలో ద్రవ్యలోటు- 4.77 శాతం ఉంటే మోడీ హయాంలో అది 5.1 శాతానికి పెరిగిందని వెల్లడించారు. తాను ప్రస్తావించిన లెక్కల్లో ఒక్కమాట అబద్ధం ఉన్నా.. రాజీనామా చేస్తానని కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. స్వాతంత్య్రానంతరం గడిచిన 75 ఏళ్ళలో దేశంలో అత్యంత విఫలమైన ప్రధాని నరేంద్రమోడీయేనని విమర్శించారు. మన్మోహన్‌ హయాంలో పారిశ్రామిక వృద్ధిరేటు- 5.87 శాతం ఉంటే మోడీ హయాంలో 3.27 శాతానికి పడిపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మన్మోహన్‌ కాలంలో రూపాయి విలువ 58.6 అయితే, మోడీ హయాంలో 82.6కి పెరిగిందని, దేశంలో ఇదే విధానం కొనసాగితే, వచ్చే రెండేల్ళో రూపాయి విలువ 100 దాటుతుందని ఎద్దేవా చేశారు. ఈ లెక్కలన్నీ పరిశీలిస్తే దేశంలో అత్యంత విఫలమైన ప్రధాని మోడీయేనన్నది స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ హయాంలో మన్మోహన్‌ సింగ్‌ ‘లైసెన్స్‌ రాజ్‌’ అయితే బీజేపీ హయాంలో నరేంద్రమోడీ ‘సైలెన్స్‌ రాజ్‌’ అని కేసీఆర్‌ ఎద్దేవా చేశారు.

ఎన్‌పీఏల పేరుతో రూ.14 లక్షల కోట్లు దోపిడీ
దేశంలో ఇప్పటివరకు ఎన్‌పీఏల పేరుతో ప్రధాని నరేంద్రమోడీ రూ.14 లక్షల కోట్లు కార్పొరేట్‌ సంస్థలకు దోచిపెట్టారని సీఎం కేసీఆర్‌ తీవ్రస్థాయిలో ఆరోపించారు. కుటీర, చిన్నతరహా పరిశ్రమల (ఎంఐఎంఈ) ప్రోత్సాహానికి రూ.20 లక్షల కోట్లు- ఇచ్చామని మోడీ సర్కారు చెబుతోందని, ఆ నిధులు ఎక్కడకు పోయాయో, ఎవరు తిన్నారో తెలియదని ధ్వజమెత్తారు. ”ఎన్‌డీఏ అంటే.. నో డాటా ఎవైలబుల్‌” అని చిదంబరం వ్యంగ్యంగా అన్నారని ఈ సందర్భంగా సభకు గుర్తు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి వచ్చి మోడీ ఫొటో కోసం రేషన్‌ డీలర్‌తో కొట్లాడతారా.. అని ప్రశ్నించారు. ఏం సాధించారని మోడీ ఫొటో పెట్టు-కోవాలని అన్నారు. తెలంగాణాకు ఒక్క మెడికల్‌ కాలేజీ కూడా ఇవ్వని బీజేపీకి.. ఒక్క ఓటు- ఎందుకు వేయాలి అని సీఎం ప్రశ్నించారు. నోట్ల రద్దు సమయంలో తాను మోడీ నిర్ణయాన్ని సమర్థించానని గుర్తు చేశారు. ఆ సమయంలో తాను మోడీని కలిసి చెప్పింది వేరు.. ఆయన చేసింది వేరని పేర్కొన్నారు. కొందరు భయంతో మాట్లాడకపోవచ్చు.. అందరికీ భయం ఉండదు కదా అని వ్యాఖ్యానించారు. ఒకే ఒక్క వందేభారత్‌ రైలును మోడీ ఇప్పటికీ 14 సార్లు ప్రారంభించారని కేసీఆర్‌ ఎద్దేవా చేశారు.

హిండెన్‌బర్గ్‌ నివేదికపై మోడీ వివరణ ఇవ్వాలి
దేశంలో ప్రస్తుతం అదానీ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంటే.. ప్రధాని మోడీ నోట నుంచి ఒక్క మాట కూడా రాలేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. హిండెన్‌బర్గ్‌ లేవనెత్తిన అంశంపై ప్రధాని వివరణ ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేశారు. 60, 40ఏళ్ల కిందటి నెహ్రూ, ఇందిరాగాంధీల పాలనను విమర్శిస్తున్న మోడీ.. అదానీ విషయం చెప్పకుండా ఇతర విషయాలు పార్లమెంట్‌లో ప్రసంగిస్తున్నారని మండిపడ్డారు. అదానీ వ్యవహారంపై ‘ది ఎకానమిస్ట్‌’ అంతర్జాతీయ పత్రికలో కథనం వచ్చిందని పేర్కొంటూ అందుకు సంబంధించిన ప్రతిని సభలో సభ్యులకు సీఎం కేసీఆర్‌ చూపించారు. అదానీ అంశంపై ఢిల్లీలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రశ్నిస్తున్నాయని, అయినా ఏ ఒక్కరోజు సమాధానం ఇవ్వలేకపోయారని వివమర్శించారు. దేశ ఆర్థిక దుస్థితిపై పార్లమెంటు-లో చర్చ జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అసలు అభివృద్ధికి తలసరి ఆదాయమే సూచనగా పేర్కొన్నారు. తలసరి ఆదాయంలో భారత్‌ ర్యాంకు 139గా ఉందని కేసీఆర్‌ వెల్లడించారు. బంగ్లాదేశ్‌, భూటాన్‌, శ్రీలంక కంటే మన తలసరి ఆదాయం తక్కువుందని విమర్శించారు. మోడీ చుట్టూ ఉన్న నేతలు అనవసరంగా ఆయన్ను పొగుడుతున్నారని, అనవసర పొగడ్తలు ప్రధానికి మంచి చేయవని హితవు పలికారు. భారత్‌ 5 ట్రిలియన్‌ డాలర్‌ ఆర్థిక వ్యవస్థకు చేరుకుంటుందని కేంద్ర ప్రభుత్వ అంచనా వేయడమే తప్పని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది చాలా తక్కువనీ, గడిచిన 8 ఏళ్ళలో 3.5 ట్రిలియన్‌ డాలర్లకు కూడా చేరుకోలేకపోయారని విమర్శించారు.

పార్లమెంట్‌లో అవాంచనీయ ధోరణులు
చట్టసభల్లో ప్రజా సమస్యలపై చర్చలు జరగాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. ఇటీ-వల చట్టసభల్లో పెడధోరణులు పెరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటులోనూ అవాంఛనీయ ధోరణులు కనిపిస్తున్నాయని, చట్టసభలు నడిచే ధోరణిపై దేశంలో చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. ఇలాంటి వాటిని నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై ఎనిమిదేళ్ళ కాలంగా వివక్ష చూపుతోందని మండిపడ్డారు. ఇటీవల బడ్జెట్‌లో 150 నర్సింగ్‌ కాలేజీలు కేటాయిస్తే, రాష్ట్రానికి ఒక్కటీ- రాలేదని ఆరోపించారు. ఎన్నో వైద్య కళాశాలలు మంజూరు చేసినా మనకు ఒక్కటీ- ఇవ్వలేదని కేసీఆర్‌ దుయ్యబట్టారు.

దేశ పౌరసత్వాన్ని వదులుకునే దౌర్భాగ్యం
దేశ రాజధాని ఢిల్లీలోనూ తాగునీటికి దిక్కులేదని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. రత్నగర్భల్లాంటి దేశంలో కనీస అవసరాలు తీరడం లేదని సీఎం కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో గ్రీన్‌కార్డు వస్తే పండుగ చేసుకునే పరిస్థితి నెలకొందని, ఇది మన దేశ పాలకుల దౌర్భాగ్యం కాదా అని ప్రశ్నించారు. గడిచిన ఎనిమిది సంవత్సరాల్లో 20లక్షల మంది భారతీయ పౌరసత్వం వదులుకున్నారని వెల్లడించారు. దేశ పౌరసత్వాన్ని వదులుకునే దౌర్భాగ్యం ఎందుకని కేసీఆర్‌ ప్రశ్నించారు. ఎన్నికల్లో పార్టీలు, నేతలు గెలుస్తున్నారని.. ప్రజలు ఓడుతున్నారని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. మన్మోహన్‌ సింగ్‌ మంచి వ్యక్తి, ఆయన పరిపాలనలో పని ఎక్కువ ప్రచారం తక్కువని ఈ సందర్భంగా సభలో గుర్తు చేశారు. మన్మోహన్‌ సింగ్‌.. మోడీ కంటే ఎక్కువ మంచి పనులు చేశారని వెల్లడించారు. మన్మోహన్‌, మోడీ పాలన వ్యత్యాసాలపై ప్రముఖ జర్నలిస్టు, సామాజికవేత్త పూజామెహ్రా ‘ది లాస్ట్‌ డికేడ్‌’ అనే పుస్తకం రాశారని తెలిపారు. మన్మోహన్‌ సింగ్‌ పాలనతో పోలిస్తే మోడీ పాలనలో దేశం ఘోరంగా దెబ్బతిన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు రావాల్సిన రూ.450 కోట్ల సొమ్మును ఏపీ ఖాతాలో జమ చెశారని గుర్తు చేశారు. ఆ మొత్తాన్ని తెలంగాణకు ఇప్పించడంలో ఏడేళ్ల జాప్యమా అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి ఎలాంటి సహకారం ఉండట్లేదని ఆరోపించారు. ‘మేం ఏమీ చేయం.. ఏం చేసుకుంటారో చేసుకోండి’ అన్నట్టు- కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement