Sunday, April 28, 2024

కాశీ అభివృద్ధి, దేశానికే దిక్సూచి.. కావాల్సింది వికాసం, విప్లవం కాదు: మోడీ

వారణాసి : కాశీలో అభివృద్ధి.. దేశానికే దిక్సూచి అని ప్రధాని మోడీ అన్నారు. ప్రస్తుతం భారత్‌కు కావాల్సింది వికాసమే కానీ.. విప్లవం కాదని వ్యాఖ్యానించారు. స్వచ్ఛతలో అగ్ర స్థానంలో నిలిచిన నగరాలతో పాటు అందుకు కృషి చేసిన ఇతర ప్రాంతాలనూ గుర్తించాలని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీకి ఆదేశించారు. మేయర్లు తమ నగరాలను అత్యంత స్వచ్ఛత కలిగినవిగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. న్యూ అర్బన్‌ ఇండియా నేతృతం వహిస్తున్న అఖిల భారత మేయర్ల సదస్సును ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి వేదికగా శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన 120 మంది మేయర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. సచ్ఛత అభియాన్‌ పట్ల నిర్లక్ష్యం వహించిన నగరాల జాబితా తయారు చేసి చర్యలు చేపట్టాలని మేయర్లను ఆదేశించారు.

సంప్రదాయబద్దమైన నగరాలు
దేశంలోని చాలా నగరాలు సంప్రదాయబద్దంగా ఉన్నాయన్నారు. ఇవి సంప్రదాయబద్ధంగా అభివృద్ధి చెందాయన్నారు. స్థానిక నైపుణ్యాలు, ఉత్పత్తులు ఏవిధంగా ఓ నగరానికి గుర్తింపుగా మారగలవో.. ఇటువంటి ప్రదేశాలను చూసి తెలుసుకోవచ్చని వివరించారు. నగరాల అభివృద్ధికి ఉన్న ప్రతీ అవకాశాన్నీ సదినియోగం చేసుకోవాలని మోడీ పిలుపునిచ్చారు. తమ నగరం భవిష్యత్తును మెరుగుపర్చడానికి వచ్చే ఏ అవకాశాన్నీ.. వదులుకోవద్దన్నారు. మన వారసత కట్టడాలు కూల్చేసి.. పునర్‌ నిర్మించాల్సిన అవసరం లేదని, వాటికి కొత్త శక్తిని అందించి.. పునరుజ్జీవింపజేయాలని తెలిపారు. అత్యంత పరిశుభ్ర నగరాల జాబితాలో తమ నగరాలను అగ్ర స్థానంలో నిలిపేందుకు మేమర్లు కృషి చేయాలన్నారు. పారిశుధ్యాన్ని వార్షిక కార్యక్రమంగా పరిగణించొద్దన్నారు. వార్డుల్లో ప్రతీ నెలా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఆ అవకాశం ఉందేమో చూడాలని కోరారు. అత్యంత సుందరమైన వార్డును ఎంపిక చేయడం కోసం పోటీ పడాలన్నారు.

సంస్కృతిని పరిరక్షించాలి : యోగీ
యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ మాట్లాడుతూ.. ప్రపంచంలోని అత్యంత దార్శనికత, ప్రజాదరణ పొందిన నాయకుడు తమ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నందుకు వారణాసి ప్రజలు గర్వపడుతున్నారని తెలిపారు. గత ఏడేళ్లలో ప్రధాని కనుసన్నల్లో.. కాశీ ఎంతో అభివృద్ధి చెందిందని వివరించారు. కాశీలో సంస్కృతిని పరిరక్షించేందుకు ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. మోడీ నాయకత్వంలో కాశీ అభివృద్ధి.. భారత్‌కు చిరునామగా మారిందన్నారు. మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. ఆయనతో పాటు కేంద్ర, గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్‌ పూరీ సింగ్‌ హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement