Sunday, April 28, 2024

Spl Story | నల్లమలలో కాలాపానీ.. నిజాంకు ఎదురుతిరిగితే చచ్చేదాకా అక్కడే!

నల్లమల అడవుల రహస్యాల మూట విప్పితే ఒళ్లు జలదరించే అనేక అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి. ఈ అడవుల్లోని రహస్యాలను ఛేదించేందుకు పురావస్తు పరిశోధకులు నిరంతర అన్వేషణలో ఉన్న.. ఇంకా సేకరించాల్సిన అనేక అంశాలు అంతుచిక్కని రహస్యాలుగానే ఉన్నాయి. స్వాంత్రత్య పోరాటాల్లో పాల్గొన్న దేశభక్తులను అండమాన్‌ కాలాపానీ జైల్‌లో నిర్భంధించి శిక్షలు అమలు చేసేవారనేది జగమెరిగిన సత్యం. అయితే అదే తరహాలో నల్లమల అడవుల్లో నిజాం కాలాపానీ జైలు నిర్మించి తెలంగాణ సాయుధ పోరాట యోధులపై, దేశభక్తులపై రాజద్రోహం కేసు నమోదుచేసి మరణించేంతవరకు శిక్షలు విధించిన విషయం నల్లమల అడవుల్లోని రహస్యాల్లో ఒకటిగా నిలిచింది.

– వి. భూమేశ్వర్​, ఆంధ్రప్రభ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కరువు జిల్లాగా ఆకలిని నింపుకుని వలసలను పులుముకున్న మహబూబ్‌ నగర్‌ జిల్లా చరిత్రలో అనేక అద్భుతాలు దాగి ఉన్నాయి. కొల్లాపూర్‌ కృష్ణాపరివాహక ప్రాంతంలో కోహినూర్‌ వజ్రం లభించడంతో పాటుగా కాకతీయ ప్రతాపరుద్రుడు శత్రుదుర్భేద్యమైన కోటను ఈ అడవుల్లోనే నిర్మించినట్లు సుప్రసిద్ధ పురావస్తు పరిశోధకుడు పివి పరబ్రహ్మశాస్త్రి ప్రపంచానికి చాటారు. ఇలాంటి ఎన్నో రహస్యాల పొదిలో నిజాం 1905లో కాలాపానీ జైలు నిర్మించి బ్రిటీష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నిజాం పాలనపై తిరగబడ్డ యోధులను నిర్భందించారు.

అమ్రాబాద్‌ మండలంలోని మన్ననూరు అడవిలో చుట్టూ కొండలు, తప్పించుకునే అవకాశాలు లేకుండా జైలును నిర్మించి అనేకమంది స్వాతంత్య్ర సమరయోధులను, తెలంగాణ సాయుధ పోరాట యోధులను నిర్భందించి కఠినమైన పనులు చేయించి మరణించేంతవరకు శిక్షించే వారని తెలుస్తోంది. మన్ననూరు కాలాపానీ జైలు నుంచి తప్పించుకునే సాహసం చేసిన వారిని నేరుగా మృత్యు కుహరాల్లోకి పంపించేవారని చరిత్రకారులు చెప్తున్నారు. అయితే శిక్ష పొందిన వారి రికార్డులను కూడా లభ్యం కాకుండా నిజాం పటిష్టమైన చర్యలు తీసుకోవడంతో పాటుగా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా సిబ్బంది ఉండేవారని సమాచారం.

జైలు నిర్మించిన ప్రాంతంలో భూగర్భ జలాలు కలుషితమై నల్లగా ఉండటంతో ఈ ప్రాంతానికి కాలాపానీ అని పేరువచ్చింది. భూగర్భ జలాలు ఇప్పటికీ ఫ్లోరైడ్‌తో నిండి ఉండటంతో ఇక్కడి నీరు తాగితే మరణమే శరణ్యం అయ్యేదని తెలిసింది. జైల్లోని ఖైదీలతో కఠినమైన పనులు చేయించి బలవంతంగా కాలాపానీ తాగించేవారని చరిత్రకారులు చెప్పారు. విషతుల్యమైన నీరు తాగడంతో అంతుచిక్కని వ్యాధులతో ఖైదీల ఆరోగ్యం క్షీణించి మరణించేవారని తెలిసింది. ఆర్యసమాజ్‌ ఉద్యమకారుడు పండిట్‌ నరంద్ర జీని ఈ జైల్లోనే వేసి మూడున్నర సంవత్సరాలు నిర్భందించారు. అనంతరం ఆయన ఆరోగ్యం క్షీణించింది. అయితే స్వాంత్రత్య పోరాటంలో పాల్గొని జైలు నిర్భందంలో ఊపిరి ఆగిపోయిన ఎందరో దేశభక్తులు శిక్ష అనుభవించిన మన్ననూరు కాలాపానీ జైలును దేశం మరిచిపోయింది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో చోటుదక్కపోవడంతో దేశభక్తుల చరిత్ర నల్లమలలోనే నిక్షిప్తమైపోవడం విచారకరం.

- Advertisement -

మరణించేవరకు శిక్ష
ఈ జైల్‌లో నిర్భంధిస్తే ఇక అంతిమ ఘడియలు దాపురించినట్టేనని చరిత్రకారుడు, కాలపానీ జైలుపై విస్తృత పరిశోధన చేసిన ద్యావనపల్లి సత్యనారాయణ చెప్పారు. ఈ జైల్లో వేసిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. తీవ్రమైన దేశద్రోహం ఆరోపించి జైల్లో వేసేవారని, విషతుల్యమైన కాలాపానీని తాగించి నెమ్మదిగా చంపేవారని చెప్పారు. 1965 వరకు మన్ననూరుకు కనీసం రహదారి కూడా లేదన్నారు. అండమాన్‌ జైలు చుట్టూ సమద్రం ఉంటే ఈ జైలు చుట్టూ దండకారణ్యం ఉండటంతో ఖైదీలు తప్పించుకునే అవకాశాలే లేవన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement