Tuesday, May 7, 2024

టీఆర్ఎస్ మీటింగ్‌లో ఉద్రిక్తత.. ‘జై ఈటల’ నినాదాలు..

భూ కబ్జా ఆరోపణలతో బర్తరఫ్ అయిన తర్వాత మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి దూరం అయ్యారు. ప్రస్తుతం టీఆర్ఎస్ వర్సెస్ ఈటలగా వార్ కొనసాగుతోంది. హుజూరాబాద్ లో ఈటలను ఒంటరిని చేసేందుకు ఇప్పటికే ఆయన మద్దతుదారులను టీఆర్ఎస్ తమవైపు తిప్పకుంది. ఈ నేపథ్యంలో వీణవంకలో టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ హాజరయ్యారు. ఈటల వైపు ఎవరూ వెళ్లొద్దని కార్యకర్తలకు లక్ష్మణ్ పిలుపు నిచ్చారు. అయితే టీఆర్‌ఎస్ పార్టీ ఒకటి తలిస్తే అక్కడ మరొకటి జరిగింది. ఈ సమావేశంలో ఈటల రాజేందర్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. ‘జై ఈటల’ నినాదాలతో సభ దద్దరిల్లింది. దీంతో ఒక్కసారిగా టీఆర్‌ఎస్ నేతలు ఖంగుతిన్నారు.

మండల స్థాయి టీఆరెఎస్ నాయకులు మాట్లాడుతూ వ్యక్తులు ముఖ్యం కాదు మనకు పార్టీ ముఖ్యం అని వాఖ్యనించారు. దీంతో ఈటల వర్గీయుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. నిన్నటి వరకు ఈటల వెంట ఉండి ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. టీఆర్ఎస్, ఈటెల వర్గీయుల మధ్య  ఘర్షణ వాతావరణం తలెత్తడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. నచ్చ చెప్పేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలోనే ఈటల వర్గీయుల జై ఈటెల అంటూ మరింత స్వరం పెంచారు.  దీంతో ఈటల వర్గీయులను పోలీసులు బయటకు పంపారు.

ప్రస్తుతం హుజూరాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఈటల రాజేందర్‌.. తన తదుపరి రాజకీయ కార్యచరణను ఇంకా ప్రకటించలేదు. ఈటల బీజేపీలో చేరుతారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ప్రచారాన్ని ఆయన ఖండించారు. మద్దతు కోసమే బీజేపీ నాయకులను కలిసినట్లు తెలిపారు. అయినప్పటికీ ఆయన బీజేపీ చేరేందుకు రెడీ అయ్యారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. జూన్ లో ఆయనకు ఫిక్స్ అయిందని, ఈ మేరకు బీజేపీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మరోవైపు కొవిడ్ ఉద్ధృతి తగ్గిన తర్వాత తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామనని మాత్రం స్పష్టం చేశారు. దీంతో హుజూరాబాద్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ వర్సెస్ ఈటల వర్గాలుగా పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ఈటల టీఆర్ఎస్ పై మాటల దాడిని పెంచారు. అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా.. తనను హుజూరాబాద్ ప్రజల నుంచి దూరం చేయలేంటూ ధీమా వ్యక్తం చేశారు. మొత్తం మీద ఈటల రాజకీయ భవిష్యత్ పై ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement