Wednesday, May 15, 2024

వెనక్కి తగ్గిన జగ్గారెడ్డి.. రాజీనామా నిర్ణయం వాయిదా

తెలంగాణ కాంగ్రెస్ లో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాజీనామా అంశం సెగలు రేపుతోంది. పార్టీలో తనను కోవర్టు అంటూ అవమానిస్తున్నారని, పార్టీకి రాజీనామా చేస్తానని నిన్న ప్రకటించిన జగ్గారెడ్డి.. తాజాగా ఈ విషయంలో కాస్త వెనక్కి తగ్గారు. కాంగ్రెస్ ను వీడే విషయాన్ని కొద్ది రోజుల పాటు వాయిదా వేసుకున్నారు. కొంద‌రు కాంగ్రెస్‌ సీనియ‌ర్ నేత‌లు త‌నతో మాట్లాడారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. 15 రోజులు తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయ‌బోన‌ని వారికి మాట ఇచ్చానని తెలిపారు. త‌న‌కు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో అపాయింట్‌మెంట్ ఇప్పిస్తే వారితో అన్ని విష‌యాలు మాట్లాడ‌తాన‌ని జ‌గ్గారెడ్డి చెప్పారు. ఆ అవ‌కాశం రాక‌పోతే రాజీనామా చేస్తాన‌ని చెప్పారు.

పెద్దల సలహా మేరకు కొద్దిరోజులు పార్టీ వీడే అంశాన్ని పక్కకు పెడుతున్నానని తెలిపారు. 15 రోజుల తర్వాత అయినా.. తన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీని కలవాలని ఉత్తమ్ సూచించారని చెప్పారు. త‌నకు అపాయింట్‌మెంట్ వ‌చ్చిన త‌ర్వాతే తాను ఢిల్లీకి వెళ్తానని తెలిపారు. అధిష్ఠానంతో మాట్లాడితే ప‌రిష్కారం దొరుకుతుంద‌నే తాను ఆశిస్తున్నానని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. త‌న‌ ఆవేద‌న చెప్పుకునే అవ‌కాశం రావాలని ఆయ‌న చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement