Friday, April 26, 2024

ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకం మూవీ రివ్యూ.. అల్ల‌రి న‌రేష్ కి హిట్ట్ పడినట్లేనా

కొత్త ద‌ర్శ‌కుడు ఏఆర్ మోహ‌న్ తెర‌కెక్కించిన చిత్రం ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకం. ఈ చిత్రంలో హీరోగా అల్లరి నరేష్ న‌టించాడు..మ‌రి ఈ మూవీ న‌రేష్ కి విజ‌యాన్ని అందించిందా లేదా ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

కథ ఏంటంటే.. శ్రీనివాస్ (అల్లరి నరేష్) ఒక ప్రభుత్వ పాఠశాలతో తెలుగు ఉపాధ్యాయుడు. ఎవరైనా కష్టంలో ఉంటే కదిలిపోయి సాయం చేసే మనస్తత్వం అతడిది. శ్రీనివాస్ ఎన్నికల విధుల్లో భాగంగా ఏజెన్సీ ప్రాంతం అయిన మారేడుమిల్లికి వెళ్లాల్సి వస్తుంది. ఐతే దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రయాణించి తాను ఎన్నికలు జరిపించాల్సిన ప్రాంతానికి వెళ్లడానికి శ్రీనివాస్ చాలా కష్టపడాల్సి వస్తుంది. అక్కడికి వెళ్లాక విద్య.. వైద్య.. రవాణా సౌకర్యాలు లేక ఆ ప్రాంత జనం పడుతున్న కష్టం శ్రీనివాస్ కు అర్థం అవుతుంది. ప్రజా ప్రతినిధులకు.. ప్రభుత్వ అధికారులకు తమ గోడు పట్టని నేపథ్యంలో తాము ఎన్నికల్లో ఓటు వేయమని అక్కడి జనాలు భీష్మించుకుని కూర్చుంటారు. అక్కడి జనాలను మార్చి వారు ఎన్నికల్లో పాల్గొనేలా చేస్తాడు శ్రీనివాస్. అతి కష్టం మీద ఎన్నికలు కూడా పూర్తి చేశాక శ్రీనివాస్.. అతడి సహచర ఉద్యోగిని మారేడుమిల్లి జనం కిడ్నాప్ చేస్తారు.. వాళ్లు అలా ఎందుకు చేశారు.. దీని వెనుక సూత్రధారి ఎవరు.. కిడ్నాప్ ద్వారా వాళ్లు అనుకున్నది సాధించారా.. శ్రీనివాస్ అక్కడి నుంచి క్షేమంగా బయటపడ్డాడా అనేదే క‌థ‌.

- Advertisement -

విశ్లేషణ.. ఫిలిం మేకర్స్ ట్రెండుకు తగ్గట్లే సినిమాలు తీస్తుంటారు కాబట్టి.. సినిమాల ద్వారా ప్రపంచానికి తెలియాల్సిన ఎన్నో విషయాలు మరుగున పడిపోతున్నాయి. అనేక కోణాలు వెలుగు చూడట్లేదు. ఇలాంటి టైంలో ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’తో దర్శకుడిగా పరిచయం అయిన ఏఆర్ మోహన్ పెద్ద సాహసమే చేశాడు. అభివృద్ధికి చాలా దూరంగా ఓ మారు మూల అటవీ ప్రాంతంలో ఉండే జనాలు.. తమ సమస్యల పోరాటం కోసం ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడి అండతో చేసే పోరాటం నేపథ్యంలో సినిమా తీశాడు. ఈ ప్లాట్ లైన్ చదవగానే ఇలాంటి సినిమాలు ఏం చూస్తాం.. ఈ రోజుల్లో ఇవేం నడుస్తాయి అనిపించొచ్చు. కానీ ఒక కాజ్ నేపథ్యంలో సాగే సినిమానే అయినా.. ఎన్నో పరిమితులు ఉన్నా.. కథనాన్ని వీలైనంత ఆసక్తికరంగా నడిపిస్తూ.. అక్కడక్కడా వినోదాన్ని కూడా జోడిస్తూ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ చిత్రాన్ని జనరంజకంగానే తీర్చిదిద్దాడు దర్శకుడు. ప్రేక్షకులను ఈ చిత్రం సర్ప్రైజ్ చేయకపోవచ్చు కానీ.. రెండున్నర గంటల పాటు కుదురుగా కూర్చోబెట్టడంలో.. అక్కడక్కడా ఎంటర్టైన్ చేయడంలో.. ఎమోషనల్ గా కదిలించడంలో.. అన్నింటికీ మించి ఒక ఆలోచన రేకెత్తించడంలో విజయవంతం అయింది.

నటీనటులు.. గతంలో వరుసగా కామెడీ సినిమాలే చేసినప్పుడు కూడా.. వాటిలో సీరియస్-ఎమోషనల్ టచ్ ఉన్న సీన్లు పడితే వాటినీ బాగానే పండించేవాడు నరేష్. కాబట్టి అతను సీరియస్ పాత్రల్లోనూ చక్కగా నటిస్తుంటే ఆశ్చర్యమేమీ కలగదు. ‘నాంది’ లాంటి హార్డ్ హిట్టింగ్ మూవీలో ఎలా తన పాత్రను పండించాడో.. ఇందులో ఒక కాజ్ కోసం పని చేసే ప్రభుత్వ ఉపాధ్యాయుడి పాత్రలోనూ అంతే సిన్సియర్ గా నటించి మెప్పించాడు. పాత్ర తాలూకు సిన్సియారిటీ.. ఇంటెన్సిటీ ఆద్యంతం కనిపించేలా నరేష్ ఆ పాత్రను పోషించిన విధానం ఆకట్టుకుంటుంది. లుక్ పరంగానూ నరేష్ ఆకట్టుకున్నాడు. అవసరమైన చోట కథకు.. మిగతా పాత్రలకు అవకాశం ఇచ్చి అతను తగ్గడం అభినందనీయం. వెన్నెల కిషోర్ ఈ సీరియస్ మూవీలో అక్కడక్కడా మంచి పంచులేస్తూ రిలీఫ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ప్రవీణ్ అతడికి సహకరించాడు. కాసేపు రఘుబాబు కూడా బాగానే ఎంటర్టైన్ చేశాడు. కలెక్టర్ పాత్రలో సంపత్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. హీరోయిన్ ఆనంది కాస్త చదువుకున్న అటవీ ప్రాంత అమ్మాయిని మెప్పించింది. ఇలాంటి పాత్రలకు అందరూ సూట్ కారు. ఆనంది లుక్స్.. తన నటన ఆ పాత్రకు చక్కగా సరిపోయాయి. హీరోయిన్ లాగా కాకుండా ఒక మామూలు అమ్మాయిలా ఆ పాత్రలో ఆమె ఒదిగిపోయింది. అడవి బిడ్డలుగా శ్రీతేజ్.. కుమనన్ సేతురామన్.. మిగతా నటీనటులందరూ కూడా బాగా చేశారు.

టెక్నిక‌ల్.. సినిమా శైలికి తగ్గట్లు సాంకేతిక హంగులన్నీ బాగానే కుదిరాయి. శ్రీ చరణ్ పాకాల పాటలు.. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. ఉన్న రెండు మూడు పాటలు సినిమాలో ఫ్లోలో బాగానే నడిచిపోయాయి. నేపథ్య సంగీతం కూడా హృద్యంగా సాగింది. రామ్ రెడ్డి ఛాయాగ్రహణం బాగుంది. ఎన్నో పరిమితుల మధ్య అడవిలో చిత్రీకరణ కోసం ఛాయాగ్రాహకుడు.. ఆర్ట్ డైరెక్టర్ ఎంత కష్టపడి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. వారి కష్టానికి ఫలితం తెరపై కనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇలాంటి కథకు సపోర్ట్ చేసిన నిర్మాతలను కూడా అభినందించాలి. అబ్బూరి రవి ‘మంచి’ మాటలు చాలానే రాశారు. ”అన్యాయంగా బెదిరించే వాడి కంటే న్యాయంగా ఎదిరించే వాడే నిజమైన బలవంతుడు” తరహా మాటలు థియేటర్లో బాగా పేలాయి. కథా రచయిత.. దర్శకుడు ఏఆర్ మోహన్ ప్రతిభ చాటుకున్నాడు. ఈ రోజుల్లో ఇలాంటి సినిమా చేయాలనుకోవడం సాహసమే. అలాగే హీరో నిర్మాతలను ఒప్పించగలగడం విశేషమే. ఎక్కడా రాజీ పడకుండా ఓ మంచి కథను సిన్సియర్ గా తెరపై ప్రెజెంట్ చేశాడతను. ఉన్న పరిమితుల్లో వినోదం కూడా బాగానే ఉంది.కాగా ఈ సినిమాకి పాజిటీవ్ టాకే వ‌స్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement