Monday, May 13, 2024

సత్తా చాటనున్న ఇస్రో.. మరో భారీ ప్రయోగానికి నాంది..

(ప్రభన్యూస్‌): భారత కీర్తి ప్రతిష్టలను మరోమారు ప్రపంచ దేశాలకు చాటి చెప్పే విధంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి నాంది పలికింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టేందుకు సర్వం సిద్దం చేస్తుంది. ఇస్రోకు ఎన్నో ఘనవిజయాలను అందించి విజయాశ్వంగా పిలువబడుతున్న పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లోని పీఎస్‌ఎల్‌వీ-సీ52 ద్వారా ఈ ప్రయోగాని చేపట్టనున్నారు. ఇస్రో ఈ ఏడాది చేపట్టబోయే మొట్టమొదటి ప్రయోగం ఇదే కావడం విశేషం. ఇప్పటికే ప్రయోగానికి సంబంధించిన రాకెట్‌ అనుసంధాన పనులు షార్‌ లో చురుగ్గా సాగుతున్నాయి. శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్‌ నుంచి ఈ నెల 14వ తేదీన ఉదయం 5.59 గంటలకు భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ (ఇస్రో) పీఎస్‌ఎల్‌వీ -సీ52 రాకెట్‌ నింగిలోకి ప్రవేశపెట్టనుంది. కరోనా మహమ్మారి ప్రభావంతో షార్‌లో రాకెట్‌ ప్రయోగాలకు కొంత ఆటంకం కలిగినప్పటికీ శాస్త్రవేత్తలు మరోమారు తమ సత్తాను ప్రపంచ దేశాలకు చాటి చూపేందుకు సిద్దమయ్యారు. ఈ ప్రయోగం ద్వారా 1710 కిలోగ్రాముల బరువున్న ఈఎస్‌ఓ-04 ఉపగ్రహంతో పాటు ఇన్స్పైర్‌ శాట్‌-1, దీన్ని యూనివర్సిటీ ఆప్‌ కొలారాడోకు చెందిన లేబోరేటరీ ఆఫ్‌ అట్మాస్పియరిక్‌ అండ్‌ స్పెస్‌ ఫిజిక్స్‌తో కలిసి ఇండియా ఇన్స్ట్‌ట్యూట్‌ ఆప్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ తయారు చేసింది. రెండో చిన్న శాటిలైట్‌ ఐఎన్‌ఎస్‌-2టీడీ. ఇది ఇండియా – భూటాన్‌ జాయింట్‌ శాటిలైట్‌. వ్యవసాయం, అటవీ ప్లాంటేషన్లు, నేలపై తేమ, హైడ్రాలజీ, వరదలు సంభవించే వాతావరణం వంటి అనువర్తనాలను అన్ని వాతావరణ పరిస్థతుల్లో అధిక నాణ్యత చిత్రాలను అందించే విధంగా ఈఎస్‌ఓ -04 ఉపగ్రహాన్ని తయారు చేశారు. ఈ ఉపగ్రహాలను భూమికి 529 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సూర్యసమకాలిక ధ్రువ కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు సంబంధించిన రాకెట్‌ అనుసంధాన పక్రియ పూర్తి చేసి లాంచ్‌ అథరైజేషన్‌ బోర్డు ప్రయోగానికి గ్రీన్‌ సిగ్నెల్‌ ఇచ్చిన వెంటనే కౌంట్‌డౌన్‌ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. 25గంటల పాటు ఈ కౌంట్‌డౌన్‌ పక్రియ చేపట్టనున్నట్లు వారు తెలియజేశారు.

ఇస్రో తురుపు ముక్క పీఎస్‌ఎల్‌వీ ద్వారా ప్రయోగం..

షార్‌ ద్వారా ఎన్నో ఉపగ్రహాలను అనేక రకాల నౌకల ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా పీఎస్‌ఎల్‌వీ , జీఎస్‌ఎల్‌వీలు భారతీయ అంతరిక్ష ప్రయోగ నౌకలుగా ఉన్నాయి. ముఖ్యంగా పీఎస్‌ఎల్‌వీ ప్రయోగించిన ప్రతిసారి విజయాన్ని నమోదు చేసుకుంటూనే ఉంది. జీఎస్‌ఎల్‌వీతో పోలిస్తే పీఎస్‌ఎల్‌వీ విజయాల శాతం ఎక్కువగా ఉండగా , తాజాగా జరపనున్న ప్రయోగం పీఎస్‌ఎల్‌వీ ద్వారానే చేస్తుండడంతో ఉపగ్రహ ప్రయోగం విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శాస్త్రవేత్తలు కూడా అహర్నిశలు అందుకోసం కృషి చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement