Friday, May 3, 2024

కరోనా థర్డ్ వేవ్‌కు.. మెట్రో నగరాలే కారణమా?

దేశంలో కరోనా థర్డ్ వేవ్‌కు మెట్రో సిటీస్ కారణంగా మారుతున్నాయా? అవును అదే నిజమంటున్నారు వైద్య నిపుణులు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ లో కొత్త వేరియంట్ కేసులు కేవలం ఒక్క నెలలోనే వేగం పుంజుకున్నాయి. యూరప్ తర్వాత కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇండియాలో అతి వేగంగా విస్తరిస్తోంది. ఈ సంక్రమణ చూస్తుంటే దేశ ప్రజలకు కరోనా థర్డ్ వేవ్ భయం పట్టుకుంది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి మెట్రో నగరాల్లో రోజువారీ కేసులు కేవలం నెల రోజుల్లోనే బాగా స్పీడ్ గా వ్యాపిస్తోంది. ఈ నగరాల్లో దాదాపు 75శాతం ఒమిక్రాన్ కేసులు వెలుగుచూస్తున్నాయి.

ఇండియాలో ఒమిక్రాన్ డిసెంబర్ 2న ప్రవేశించింది. అప్పటి నుంచి కేవలం 1 నెలలోనే ఇండియాలో ఒమిక్రాన్ కేసులు 1892కు చేరుకుంది. ఒక వారంలోనే కరోనా కొత్త వేరియంట్ మూడు రెట్లు పెరిగిపోయి.. అత్యంత వేగంగా సంక్రమించడం ప్రజల్లో ఆందోళన కల్గిస్తోంది. అయితే లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. కానీ, కేసుల సంఖ్య మాత్రం రోజు రోజుకూ పెరుగుతోంది. ఇండియాలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందనే విషయాన్ని కొవిడ్ టాస్క్ ఫోర్స్ ఛీఫ్ డాక్టర్ ఎన్ కే అరోరా ధ్రువీకరించారు.

దేశంలో కరోనా ధర్డ్ వేవ్ ప్రారంభమైందనేది స్పష్టమైందని చెప్పారు డాక్టర్ ఎస్ కే అరోరా. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. కరోనా కేసులు కూడా 22శాతం పెరిగాయన్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్ ఫలితాల ప్రకారం దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల్లో 12 శాతం ఒమిక్రాన్ కేసులున్నాయని డాక్టర్ అరోరా చెప్పారు. గత వారం ఇది 28 శాతానికి చేరుకుందని.. దేశంలో ఇతర వేరియంట్లు కూడా వేగంగా సంక్రమిస్తున్నాయని చెప్పారు. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా వంటి నగరాల్లో ఒమిక్రాన్ కేసులు పెరగడం ఆందోళన కల్గించే అంశమన్నారు. 

దేశంలో ఒమిక్రాన్ (Omicron Variant) అత్యధిక కేసులు మహారాష్ట్ర, ఢిల్లీలో నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటి వరకూ 568, ఢిల్లీలో 382, కేరళలో 185, రాజస్థాన్‌లో 174, గుజరాత్‌లో 152, తమిళనాడులో 121 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ప్రభుత్వ లెక్కల ప్రకారం.. మొత్తం 67 కేసులు నమోదు కాగా.. అనధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా 84 కేసులు ఉంటాయని అంచనా..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌,  ట్విట్టర్    పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement