Monday, May 6, 2024

నేటి సంపాదకీయం-కవ్విస్తున్న చైనా!

కొత్త సంవత్సరం ఆరంభం రోజున చైనా సైనికులు కవ్వింపు ధోరణిలో గాల్వాన్‌ లోయలో పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పిఎల్‌ఏ) జెండాను ఎగురవేసి, ఈ ప్రాంతంలో ఒక అంగుళాన్ని కూడా భారత్‌ ఆక్రమించుకునేందుకు అంగీకరించం అంటూ రాసి ఉంచిన బ్యానర్‌ని వేలాడ దీశారు. చైనా సరిహద్దు వివాదాన్ని కోరి తెచ్చుకుంటోందనడానికి ఇంతకన్నా వేరే నిదర్శనంఏం కావాలి. మరోవైపు ప్యాంగాంగ్‌ సరస్సుపై వంతెన నిర్మాణాన్ని కూడా చైనా చేపట్టింది. గాల్వాన్‌లో భారత్‌ సరిహద్దులకు దగ్గరగా చైనా జెండాని ఎగురవేశారు. కొత్త సంవత్సరంలో తాము చేపట్టే కార్యక్రమాలకు, సూచికగా పీఎల్‌ఏ ఈ బరితెగింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు స్పష్టం అవుతోంది. అరుణాచల్‌ప్రదేశ్‌ తమదేనంటూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ప్రకటన చేసిన కొద్ది రోజులకే పిఎల్‌ఏ ఈ జెండా ఎగురవేయడం గమనార్హం.

ఇదంతా ఒక పథకం ప్రకారం చైనా ప్రభుత్వమే నడిపిస్తున్నట్టు కనిపిస్తోంది. కొద్ది నెలల క్రితం గాల్వాన్‌ లోయలో చైనా దళాలు దూసుకుని వచ్చినప్పుడు మన సైనికులు తిప్పి కొట్టారు.ఈ ఘర్షణల్లో మరణించిన వారిలో తెలంగాణకు చెందిన బి.సంతోష్‌ బాబు అనే మేజర్‌ కూడాఉన్నారు. ఈ ఘర్షణ అనంతరం ఇరుదేశాల సైనికాధికారుల చర్చలతో తిరిగి సానుకూల పరిస్థితి ఏర్పడింది. గాల్వాన్‌ సంఘటనపై చైనాకు మన దేశం తీవ్ర నిరసన తెలిపింది. ఈ ఘర్షణలో చైనా సైనికులు కూడా మరణించారు. ముందు ఎవరూ మరణించ లేదని బుకాయించిన చైనా తర్వాత సైనిక నష్టం నిజమేనని అంగీకరించింది. అయితే, ఎంత మంది మరణించిందీ ప్రకటించలేదు. చైనా కవ్వింపు ధోరణి చూస్తుంటే మరోసారి ఆక్రమణకు దుస్సాహసం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే, గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మన సేనలు పిఎల్‌ఏ ఆర్మీని తరిమి కొట్టేందుకు సంసిద్ధంగా ఉన్నారు.

అలాగే, మానస సరోవర్‌ ప్రాంతంలో కూడా మన యాత్రికులకు అడ్డంకులను సృష్టించేందుకు చైనా ప్రయత్నాలు సాగిస్తోంది. ఆ యాత్రను అడ్డుకునేందుకే ఈ వంతెనను నిర్మిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఖురాంక్‌ ప్రాంతంలో నిర్మిస్తున్న ఈ వంతెన వల్ల తమకు180 కిలోమీటర్ల దూరం తగ్గుతుందనీ, ఇది పూర్తిగా తమ ప్రాదేశిక పరిధిలోని ప్రాంతమేనని చైనా చెబుతోంది. ఈ ప్రాంతంలో రెండేళ్ళ క్రితం తమ దాడులను భారత్‌ సైన్యం తిప్పి కొట్టడాన్ని దృష్టిలో ఉంచుకుని చైనా ఈసారి జాగ్రత్తగానే ఈ నిర్మాణాన్ని చేపట్టింది. ఏమైనా దీని నిర్మాణం వల్ల మన వైపు నుంచి వచ్చేవారిపై ఒత్తిడి పెరుగుతుంది. దీనిపై కూడా వెంటనే స్పందించాలని రక్షణరంగ నిపుణులు కోరుతున్నారు. చైనా ఆక్రమణవాదాన్ని ఎదుర్కొనేందుకే మన దేశం అమెరికాతో సన్నిహితంగా వ్యవహరిస్తోంది. అమెరికాతో మన దేశం చాలా విషయాల్లో విభేదించినా, రక్షణ వ్యవహారాల్లో సన్నిహితంగా మెలుగుతోంది. పొరుగుదేశాలకు తాయిలాలు ప్రకటించి వాటిని లోబర్చుకోవడానికి చైనా సాగిస్తున్న యత్నాలను మన దేశం గమనిస్తోంది. భూటాన్‌ , శ్రీలంక వంటిచిన్న దేశాలను లొంగదీసుకోవడానికి చైనా ఇప్పటికీ యత్నాలు సాగిస్తోంది. లడఖ్‌ తూర్పు ప్రాంతంలో ఉన్న గాల్వాన్‌పై చైనా కన్ను పడటానికి కారణం, అక్కడి నుంచి అయితే, సులభంగా భారత్‌ భూభాగాన్ని ఆక్రమించుకో వచ్చున్నది.

అయితే, గాల్వాన్‌పై గతంలో జరిగిన ఘర్షణ అనంతరం మన దేశం చైనా సైనికులను అడుగు ముందుకు వేయనీయకుండా నిరంతరం గస్తీకాస్తున్నారు. ఇప్పుడు చైనా సైనికులు జెండా ఎగురవేసి కవ్వుంపునకు పాల్పడ్డారు. దీనిపై మన దేశం ఇంకా అధికారికంగా స్పందించలేదు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అమర సైనికుల త్యాగాలను తమ విజయాలుగా చెప్పుకునే ప్రధాని మోడీ ఈ విషయంలో చొరవ తీసుకోవాలనీ, చైనాను దౌత్య పరంగా ఎండగట్టాలని డిమాండ్‌ చేశారు. 2020లో కైలాస్‌ ప్రాంతంలో భారత్‌ ఆపరేషన్‌ చేపట్టింది. భారత సేనను ఎదుర్కోవడానికి చైనా సైనికులు రావడానికి బాగా ఆలస్యం అయింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ భారత్‌లో అంతర్భాగంగా ఉంది. అక్కడ భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. అయినప్పటికీ ఆ రాష్ట్రాన్ని తమ భూభాగంగా చైనా ప్రకటించడం దుస్సాహసమే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement