Monday, April 29, 2024

Big Story: ధరల మంట, చార్జీల మోత.. సామాన్యుల‌పై పెనుభారం

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అన్ని రకాల ధరలు పెరిగిపోయాయి… ఎండలు పెరిగినట్లే ధరలు కూడా పెరిగిపోతుండటంతో సామాన్యులు విలవిలలాడుతున్నారు. సంపాదన అంతంత మాత్రంగానే ఉండటం ధరలు పెరిగిపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. కొనేదెలా, తినేదెలా అంటూ తలలు పట్టుకుంటున్నారు.. రెక్కలు ముక్కలు చేసుకున్నా కుటుంబానికి మూడుపూటల భోజనం పెట్టే పరిస్థితులు కనిపించడం లేదు.. గ్యాస్‌నుండి మొదలుకుని విద్యుత్తు చార్జీలు, పెట్రో ధరలు. నిత్యవసర వస్తువుల ధర ఇలా చెప్పుకుంటూపోతే లీస్టు పెద్దదిగానే ఉంటుంది. ధరల పెంపు మధ్యతరగతి వర్గాల నడ్డి విరుస్తోంది. భార్యాభర్తలు ఇద్దరూ కష్టపడితేనే తమ కుటుంబానికి మూడుపూటల తిండి పెట్రో పరిస్థితులు.. అదే ఒకరే పని చేస్తే వారి కష్టాలు చెప్పనక్కరలేదు.

ప్రభన్యూస్‌బ్యూరో ఉమ్మడిరంగారెడ్డి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటాపోటీగా ధరలు పెంచుతున్నాయి. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకోవడం తప్పిస్తే పేదలకు న్యాయం చేయాలనే ఆలోచన కలగడం లేదు. పెట్రో..గ్యాస్‌ ధరలు కేంద్రం పరిధిలోకి రాగా మరో నాలుగురోజుల్లో విద్యుత్తు చార్జీల మోత మోగించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. రెండు ప్రభుత్వాలు ధరలు పెంపుకు పోటీపడుతుండటంతో సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు ఇబ్బందిపడే పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా నేపథ్యంలో ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితులు గాడిలో పడుతున్నాయని సంబురపడుతున్న సమయంలో చార్జీలు, ధరల పెంపులు కోలుకోని విధంగా దెబ్బతీస్తున్నాయి. పాపం మీదంటే మీదని వాదులాడుకోవడం తప్పిస్తే మధ్యతరగతి వర్గాల ప్రజలపై భారం పడకుండా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. భార్యాభర్తలు ఇద్దరూ పని చేస్తేనే కుటుంబాన్ని పోషించుకోవడం భారంగా మారుతున్న తరుణంలో చార్జీలు, ధరల పెంపు వారిని ఇబ్బందులపాలు చేస్తోంది. నిత్యవసర వస్తువుల ధరలను మొదలుకుని విద్యుత్తు చార్జీలు, పెట్రో ధరలు, గ్యాస్‌ ధరలు పెంచడంతో కోలుకోని పరిస్థితులు నెలకొన్నాయి. మధ్యమధ్యలో ధరలు పెరిగితే కొంతమేర ఇబ్బందిపడ్డా సర్దుకుపోయే అవకాశాలుంటాయి. కానీ అన్నీ ఒకేసారి పెరగడంతో మోయలేని భారంగా మారింది. మార్చి మాసంలోనే ధర మోతమోగుతుండటం వచ్చేనెలనుండి విద్యుత్తు చార్జీల మోత మోగనుండటం ఆందోళన కలిగించే పరిస్థితులు నెలకొన్నాయి….

గ్యాస్‌ భారం వంద కోట్లపైనే మాటే..
కొన్ని మాసాలపాటు గ్యాస్‌ ధరలు పెరగలేదు. హమ్మయ్యా అనుకుంటున్న తరుణంలో ఒకేసారి గ్యాస్‌పై రూ. 50 భారం మోపారు. పేదలను మొదలుకుని ధనవంతుల వరకు అందరూ గ్యాస్‌ వినియోగిస్తున్నారు. గ్యాస్‌ధర పెంచడంతో అందరిపై భారం పడుతోంది. రంగారెడ్డి జిల్లాలో 9లక్షలకు పైగానే గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో ప్రతిరోజు 30వేల వరకు రీఫిల్‌ చేయించుకుంటున్నారు…రోజుకు రూ. 15లక్షల భారం కేవలం రంగారెడ్డి జిల్లా పైనే పడుతోంది…మేడ్చల్‌ జిల్లాలో 12లక్షల వరకు గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. వికారాబాద్‌ జిల్లాలో 3.40లక్షల వరకు కనెక్షన్లు ఉన్నాయి. పెరిగిన గ్యాస్‌ ధరలతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై ఏడాదికి ఏకంగా రూ. 100కోట్ల భారం పడనుంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా గ్యాస్‌ వినియోగం పెరిగిపోయింది. కట్టెల పొయ్యిలు చాలావరకు తగ్గించారు. గ్యాస్‌పై అదనపు భారం పడనుండటంతో మధ్యతరగతి వర్గాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరో కొన్నిరోజుల్లో విద్యుత్తు చార్జీల మోత..
మరో కొన్ని రోజుల్లో విద్యుత్తు చార్జీల మోతమోగనుంది. ఏప్రిల్‌ 1వ తేదీనుండి చార్జీలు పెంచుతూ విద్యుత్తు రెగ్యులరేటరీ కమిషన్‌ నిర్ణయం తీసుకుంది. ఉగాదిపండగకు ముందే విద్యుత్తు చార్జీలు పెరగనున్నాయి. గృహ కనెక్షన్లకు సంబంధించి యూనిట్‌పై 50 పైసలు…వాణిజ్య సంస్థలపై యూనిట్‌పై రూపాయి చొప్పున భారం మోపనున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపైనే ఏకంగా రూ. 1400కోట్ల భారం పడనుంది. రంగారెడ్డి జిల్లాలో 14.68లక్షల9 గృహ కనెక్షన్లు ఉండగా 2.36లక్షల వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో 12.92లక్షల గృహ కనెక్షన్లు ఉండగా 1.76లక్షల వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి. వికారాబాద్‌ జిల్లాలో 2.18లక్షల గృహ కనెక్షన్లు 33వేలకు పైగానే వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి. రంగారెడ్డి, మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లాల పరిధిలో వాణిజ్య కనెక్షన్లు ఎక్కువగా ఉన్నాయి. ఐటీ కంపనీలు కూడా ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై భారం ఎక్కువగా పడనుంది. అసలే వేసవి కాలం కావడంతో విద్యుత్తు వినియోగం ఎక్కువగా ఉంటుంది. మధ్యతరగతి వర్గాల ప్రజలు ప్యాన్లు, కూలర్లు వినియోగిస్తుండగా ధనవంతులు మాత్రం ఏసీలు వినియోగిస్తున్నారు. ఎండలు ముదరడంతో వీటి వినియోగం పెరిగింది. అసలే ఎండకాలంలో విద్యుత్తు బిల్లులు ఎక్కువగా వస్తాయి. దీనికితోడు పెంచిన చార్జీలు జతకావడంతో బిల్లుల మోత మోగనుంది. పెంచిన విద్యుత్తు చార్జీలు ఏప్రిల్‌ 1వ తేదీనుండి అమలులోకి రానుంది. ఉగాది పండగ కంటే ముందే విద్యుత్తు చార్జీలు పెరగనున్నాయి.

పెరుగుతూ పోతున్న పెట్రో ధరలు..
నాలుగుమాసాలపాటు పెట్రో ధరలు పెరగలేదు. అందరూ హమ్మయ్యా అని ఊపిరిపీల్చుకున్నారు…దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో పెట్రో ధరలు పెంచలేదనే విమర్శలు ఎదుర్కొంటోంది కేంద్రం. ఎన్నికల ప్రక్రియ ముగియగానే వరుసబెట్టి పెట్రో ధరలు పెంచుతోంది. ఏడురోజులుగా పెట్రో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఏడురోజుల్లో లీటర్‌ పెట్రోల్‌పై రూ. 4 పైనే భారం పడుతోంది. తాజాగా సోమవారం రోజు లీటర్‌ పెట్రోల్‌పై 50 పైసలు వడ్డించారు. డీజిల్‌పై 35 పైసల భారం మోపారు. ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌కు రూ. 112.71కి చేరగా డీజిల్‌ లీటర్‌కు రూ. 99.07 చేరింది. పెట్రో ధరలు ఇలాగే పెరిగితే మాత్రం రెండుమూడురోజుల్లో డీజిల్‌ ధరలు సెంచరీ దాటిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. సామాన్యులపై పెట్రో భారం ఎక్కువగా కనిపిస్తోంది. నేడు అందరి వద్ద ద్విచక్రవాహనాలు ఉన్నాయి. మధ్యతరగతి వర్గాల ప్రజలు కూడా కార్లు వినియోగిస్తున్నారు. కరోనా నేపథ్యంలో పాత కార్ల కొనుగోలు ఎక్కువగా జరిగింది. ద్విచక్ర వాహనం డబ్బులకు పాత కారు రావడంతో చాలామంది కార్లు కొనుగోలు చేశారు. వీరందరిపై భారం పడుతోంది. గతంలో మాదిరిగా రోజురోజుకు పెట్రో వడ్డన చేస్తుండటంతో మధ్యతరగతి వర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదేమి భారమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా ఏడురోజులుగా పెట్రో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బ్రేకు పడుతుందనే నమ్మకంతో ప్రజలున్నా ఇప్పట్లో సాధ్యమయ్యే అవకాశాలు లేవనే ప్రచారం కూడా సాగుతోంది….

- Advertisement -

నిత్యవసర వస్తువుల ధరల పెంపు..
నిత్యవసర వస్తువుల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. పప్పులు…నూనె ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఎక్కువగా వినియోగించే వస్తువుల ధరలు పెరిగిపోవడంతో వెనకా ముందుచూసి వినియోగించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా…ఉక్రెయిన్‌ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో నూనె ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కిలో నూనెప్యాకెట్‌ రూ. 210 దాటిపోయింది. విడతల వారీగా కాకుండా ఒకేసారి ధర పెరగడంతో ఇబ్బందిపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గ్యాస్‌ ధరలతోపాటు నూనె ధరలు కూడా పెరిగిపోవడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నూనె ధరలే కాకుండా ఇతర నిత్యవసర వస్తువుల ధరలు కూడా పెరిగిపోయాయి. కరోనా సీజన్‌ ప్రారంభమైన తరువాత నిత్యవసర వస్తువుల ధరలకు రెక్కలు వచ్చాయి. పెరుగుతూ పోతున్నాయి తప్పిస్తే ధరలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇటీవల ధరలు మరింతగా పెరిగిపోయాయి. నూనె ధరలు సలసల మరుగుతుండటంతో వెనకాముందు చూసి వినియోగించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నిత్యవసర వస్తువుల ధరలతోపాటు చికెన్‌ ధరలు కూడా పెరిగిపోయాయి. వేసవి కాలంలో చికెన్‌ ధర రూ. 200 లోపే ఉండేది.. ప్రస్తుతం రూ. 280నుండి రూ. 300 వరకు ధర పలుకుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement