Tuesday, May 7, 2024

భారత్‌-బ్రిటన్‌ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. బోరిస్‌ పర్యటన చారిత్రాత్మకం

భారత్‌, బ్రిటన్‌ దేశాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై (ఎఫ్‌టీఏ) పని చేస్తున్నాయని, ఈ ఏడాది చివరి నాటికి ఎఫ్‌టీఏను ముగించేందుకు కృషి చేయాలని నిర్ణయించుకున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. మోడీ, బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సమక్షంలో భారత్‌-యూకే మధ్య వివిధ ఒప్పందాలు జరిగాయి. రెండు రోజుల పర్యటన నిమిత్తం తొలిసారి ప్రధాని బోరిస్‌ భారత్‌కు వచ్చారు. రెండో పర్యటనలో భాగంగా.. శుక్రవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు ప్రధానులు సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా ప్రధాని బోరిస్‌ భారత్‌ పర్యటన చారిత్రాత్మకమని ప్రధాని మోడీ కొనియాడారు. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌తో రక్షణ రంగం, వాణిజ్యం, వాతావరణం, ఇంధన భద్రతపై చర్చలు జరిగాయని మోడీ తెలిపారు. అదేవిధంగా ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో భద్రతా పరంగా సహకారాన్ని అందిపుచ్చుకోవడంపై కూడా చర్చించినట్టు మోడీ పేర్కొన్నారు. గతేడాది భారత్‌-యూకే మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రారంభించామని తెలిపిన ప్రధాని మోడీ.. ఎఫ్‌టీఏకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

జీఐ ట్యాగ్‌పై చర్చ
బోరిస్‌ జాన్సన్‌తో భారత్‌ విదేశాంగ మంత్రి జైశంకర్‌ కూడా భేటీ అయ్యారు. బోరిస్‌.. భారత్‌ను తమ స్నేహితుడిగా అర్థం చేసుకున్నాడని ప్రధాని మోడీ వివరించారు. బ్రిటన్‌ ప్రధానికి కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న తన స్నేహితుడు అయిన బోరిస్‌ జాన్సన్‌ను ఇండియాలో చూసిన తరువాత చాలా ఆనందం వేస్తున్నదని తెలిపారు. బోరిస్‌తో చర్చల కోసం చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నట్టు మోడీ ప్రకటించారు. న్యూ ఏజ్‌ ట్రేడ్‌ డీల్‌పై కూడా చర్చించినట్టు వివరించారు. అదేవిధంగా రష్యా-ఉక్రెయిన్‌ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో.. పలు విషయాలు కూడా ఇరు దేశాల ప్రధానులు చర్చించారు. ఉత్పత్తి, సేవల రంగం, పెట్టుబడులు, మేధో సంపత్తి హక్కులు, జియో గ్రాఫికల్‌ ఇండికేషన్‌ (జీఐ ట్యాగ్‌) వంటి అంశాలపై చర్చించినట్టు వివరించారు. రక్షణ రంగంలో ఆయుధాల సేకరణ, ముడి సరుకుల సరఫరా సహా దేశీయంగా ఫైటర్‌ జెట్స్‌ను తయారు చేసుకునే విషయంపై కూడా బోరిస్‌తో మాట్లాడినట్టు మోడీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement