Saturday, May 4, 2024

ఆగస్టు 8 నుంచి తెలంగాణలో స్వాతంత్య్ర వజ్రోత్సవాలు.. గడపగడపకు దీపాంజలి కార్యక్రమం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు, పోరాట యోధుల త్యాగాలను స్మరించుకునేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను జరపాలని నిర్ణయించినట్లు వజ్రోత్సవ కమిటీ ఛైర్మన్‌, ఎంపీ కె.కేశవరావు తెలిపారు. ఈమేరకు తెలంగాణలో 15 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన స్పష్టం చేశారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల నిర్వహణపై ఎంపీ కేశవరావు ఆధ్వర్యంలోని కమిటీ బుధవారం మొదటి సారిగా భేటీ అయింది. ఈ సందర్భంగా బీఆర్‌కేఆర్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేశవరావు మాట్లాడుతూ ఆగస్టు 8 నుంచి 22 వరకు వజ్రోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆగస్టు 8న హెచ్‌ఐసీసీలో వజ్రోత్సవ వేడుకలను సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారని తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఇళ్లపై జాతీయ జెండా ఎగురవేసేలా, గడపగడపకూ దీపాలు వెలిగించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ట్రాఫిక్‌ సిగ్నళ్ల వద్ద ఒకేసారి ఒక రోజు ట్రాఫిక్‌ను ఆపి జనగణమన కూడా పాడిస్తామని పేర్కొన్నారు. ఆగస్టు 22న ఎల్‌బీ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం చేపడతామని, ఆ సమావేశానికి ఒక్కో జిల్లా నుంచి వెయ్యి మంది వచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌ నగరమంతా స్వాతంత్య్ర సమరయోధులు, పోరాట నాయకుల చిత్రాలు, త్రివర్ణాలతో తీర్చిదిద్దేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.

పోరాట యోధుల జీవిత చరిత్ర తెలిపేలా ఫిల్మ్‌ఫెస్టివల్‌ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. 15 రోజుల పాటు చేపట్టే ఈ కార్యక్రమాల్లో పాఠశాలలను సైతం భాగస్వామ్యమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ట్యాంక్‌బండ్‌ వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహం నుంచి సంజీవయ్య పార్కు వరకు ర్యాలీని చేపడుతున్నట్లు తెలిపారు. ఇంతేకాకుండా ఇంకా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement