Friday, May 3, 2024

Imran Khan: పాకిస్థాన్ లో కూలిన ఇమ్రాన్‌ ప్రభుత్వం

పాకిస్థాన్‌లో గత నెల రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. పాకిస్థాన్ లో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం కుప్పకూలింది. దాదాపు నెలరోజులపాటు కొనసాగిన రాజకీయ పరిణామాల అనతరం ఇమ్రాన్‌ ఖాన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో ప్రతిపక్షాలు వివజయం సాధించింది. దీంతో ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పదవీ చ్యుతుడయ్యారు. మొత్తం 342 మంది సభ్యుల జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానానికి 174 మంది సభ్యులు అనుకూలంగా ఓటువేశారు. దీంతో సాధారణ మెజారిటీ సాధించలేకపోవడంతో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కుప్పకూలింది.

ఇమ్రాన్‌ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ సందర్భంగా శనివారం అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. జాతీయ అసెంబ్లీలో అర్ధరాత్రి పొద్దుపోయాక తీర్మానంపై ఓటింగ్‌ జరిగింది. అవిశ్వాస ఓటింగ్ కు ముందు జాతీయ అసెంబ్లీ నాలుగుసార్లు వాయిదా పడింది. దీంతో రోజంతా తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. అయితే, ఓటమి ఖాయమని తెలియడంతో ఇమ్రాన్‌ వర్గం ఓటింగ్‌కు దూరంగా ఉన్నది. సుమారు 14 గంటల పాటు సాగిన జాతీయ అసెంబ్లీ.. అవిశ్వాస తీర్మానం ద్వారా ఇమ్రాన్‌ను సాగనంపింది. పాక్‌ జాతీయ అసెంబ్లీలో 342 మంది సభ్యులు ఉండగా, మెజార్టీకి అవసరమైన బలం 172. అయితే ఇమ్రాన్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా 174 ఓట్లు వచ్చినట్లు జాతీయ అసెంబ్లీ స్పీకర్‌ ఆయాజ్‌ సాదిఖ్‌ ప్రకటించారు.

ఇక, పాకిస్థాన్ కొత్త ప్రధానిగా షెహబాజ్‌ షరీఫ్‌ ఎన్నిక కానున్నారు. ఇమ్రాన్‌ ఖాన్‌పై కక్షసాధింపు చర్యలు ఉండవని షెహబాజ్‌ ప్రకటించారు. కాగా, పాకిస్థాన్‌ చరిత్రలో అవిశ్వాసం ద్వారా పదవిని కోల్పోయిన తొలి ప్రధానిగా ఇమ్రాన్ నిలిచారు.తొలగించబడిన తొలి ప్రధానిగా ఇమ్రాన్‌ ఖాన్‌ అపకీర్తి మూటగట్టుకున్నారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌లో పదవి కోల్పోవడం ఖాయం కావడం వల్ల ఇమ్రాన్‌ దానికి ముందే తన అధికారిక నివాసం ఖాళీ చేసి వెళ్లిపోయారు. పాక్‌ జాతీయ అసెంబ్లీ స్పీకర్‌ అసద్‌ ఖైసర్‌, డిప్యూటీ స్పీకర్‌ ఖాసిం సూరీ రాజీనామా చేశారు. అనంతరం ప్యానెల్‌ ఛైర్మన్‌ ఆయాజ్‌ సిద్దిఖ్‌ స్పీకర్‌ బాధ్యతలు చేపట్టారు. ఆయనే ఓటింగ్‌ను నిర్వహించారు.

అవిశ్వాస తీర్మానంపై ఏప్రిల్‌ 3న పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ సమావేశం జరిగినా డిప్యూటీ స్పీకర్‌ తిరస్కరించడం వల్ల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శనివారం ఉదయం పదిన్నర గంటలకు మరోసారి భేటీ అయ్యింది. శనివారం ఉదయం మొదటి సారి భేటీ అయిన సభ మధ్యాహ్నం 12.30 వరకు వాయిదా పడింది. అనంతరం 3 గంటల వరకు ఒకసారి, రాత్రి 8గంటల వరకు మరోసారి వాయిదా పడింది. ఆ తర్వాత సమావేశమైనా మరో రెండు సార్లు వాయిదా పడి రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు వాయిదా పడింది. ఆ తర్వాత ఓటింగ్ జరిగింది. ఓటింగ్ జరిగే సమయంలో ఇమ్రాన్ సభలో లేరు. ఓటింగ్‌ సమయంలో ఇమ్రాన్‌ పార్టీ తెహ్రీకే ఇన్సాఫ్‌ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేయగా, ఆయనపై తిరుగుబాటు జెండా ఎత్తిన సొంత పార్టీ సభ్యులు మాత్రం ప్రభుత్వ స్ధానంలోనే ఆసీనులయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement