Sunday, April 28, 2024

తెలంగాణలో భానుడి భగభగలు… అవసరమైతే తప్ప బయటకు రావొద్దు

తెలంగాణ వ్యాప్తంగా ఎండలు భారీగా పెరిగాయి. రాబోయే నాలుగు రోజులు ఎండలు తీవ్రంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీచేసింది. వడగాలుల తీవ్రత పెరుగుతుందని, పగటిపూట ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని తెలిపింది. తెలంగాణలోని ఆదిలాబాద్, జగిత్యాల, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, కుమురం భీమ్, హైదరాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో నాలుగు రోజుల పాటు వేడిగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటాయి. ఆదిలాబాద్‌లో ఉష్ణోగ్రత 41.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. నిజామాబాద్, రామగుండంలో కూడా 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో 39.7 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది, మరో రెండు రోజుల్లో ఇది 40 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. ఎండల తీవ్రత, వడదెబ్బ నుంచి రక్షించుకునేందుకు ప్రజలకు పలు సూచనలు చేసింది. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు హెచ్చరించారు. నిరంతరం బయట ఉండి విధులు నిర్వర్తించేవారు ఎక్కువగా నీరు, శీతల పానీయాలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా మధ్యాహ్న సమయంలో రోడ్లపై తిరగొద్దు. అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలి. లేదంటే ఇంట్లోనే ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఎండలో తిరిగేటప్పుడు నల్లటి దుస్తులు వేసుకోవద్దు. తెల్లటి దుస్తులు వేసుకుంటే ఎండ ప్రభావం తక్కువగా ఉంటుంది. ఫ్లూయిడ్స్, కొబ్బరి నీళ్లు, మజ్జిగ ఎక్కువ తీసుకోండి. ఇలాంటి జాగ్రత్తలు పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement