Friday, May 3, 2024

Fun Day: ‘డిజె టిల్లు’ చూస్తే.. నవ్వులతో పాండమిక్ ప్రెష‌ర్‌ మర్చిపోతారు: నేహాశెట్టి

అన్ని వర్గాల ప్రేక్షకులను ‘డిజె టిల్లు’ మూవీ ఎంతో ఆక‌ట్టుకుంటుంద‌ని అంటోంది హీరోయిన్‌ నేహా శెట్టి. త‌ను రాధిక పాత్రలో నటించిన ‘డిజె టిల్లు’ ఈనెల 12వ తేదీన రిలీజ్ కానుంది. ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. విమల్ కృష్ణ డైకెక్ట్ చేశారు. కాగా, సూర్యదేవర నాగ వంశీ చిత్ర నిర్మాత. అయితే ఈ మ‌ధ్య ‘డిజె టిల్లు’ సినిమా ముచ్చ‌ట్ల‌ను.. మూవీలో తన గ‌మ‌నం.. సినిమా చిత్రీక‌ర‌ణ‌లో అనుభవాలను మీడియాకు తెలియ‌జేసింది నేహా శెట్టి. అవేంటో చ‌దివి తెలుసుకుందాం..

త‌న‌కు బాల్యం నుంచే నటి కావాలనే కోరిక ఉండేదని, హృతిక్ రోషన్ సినిమాలో డాన్సులు చూసి సినీ రంగంపై మ‌రింత ఇష్టం పెరిగింద‌ని తెలిపింది ఈ బ్యూటీ.. త‌న చదువు పూర్తయ్యాక మోడలింగ్ చేశాన‌ని, మలయాళంలో ముంగారమళై 2 చిత్రంలో నటించాక, తెలుగులో పూరీ జగన్నాథ్ నుంచి పిలుపు వచ్చిన‌ట్టు తెలిపింది. మెహబూబా చిత్రంలో నటించాన‌ని, ఆ సినిమా తర్వాత కొన్నాళ్లు యూఎస్ వెళ్లి అక్కడ న్యూయార్క్ ఫిల్మ్ అకాడ‌మీలో నటనలో కోర్సు నేర్చుకున్న‌ట్టు తెలిపింది. అక్కడి నుంచి వచ్చాక టాలీవుడ్‌లో గల్లీ రౌడీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ వంటి చిత్రాల్లో నటించిన‌ట్టు తెలిపింది. ఇప్పుడు “డిజె టిల్లు” సినిమా విడుదల కోసం చాలా ఇంట్రెస్ట్‌గా తాను ఎదురుచూస్తున్న‌ట్టు చెప్పింది నేహా శెట్టి..

‘‘సితార ఎంటర్ టైన్ మెంట్స్ వంటి ప్రముఖ సంస్థలో అవకాశం వస్తే ఎలా కాదనుకుంటాం. ఈ సినిమా ఒప్పుకోవడానికి అదొక్కటే కారణం కాదు, మంచి స్క్రిప్ట్ ఉంది. సిద్ధూ, విమల్ క్రియేటివ్ గా సినిమాను, ఫన్ గా డిజైన్ చేశారు. మీరు ట్రైలర్ లో డైలాగ్స్ వినే ఉంటారు. ఇవన్నీ కలిసిన ఒక మంచి ప్రాజెక్ట్ లో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా.. డిజె టిల్లు ట్రైలర్ చూసి రొమాంటిక్ ఫిల్మ్ అనుకుంటారు.. కానీ, ఈ సినిమా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపిన ఒక ప్యాకేజ్ లాంటిది. ఇందులో కామెడీ, థ్రిల్, ఎంటర్ టైన్ మెంట్, రొమాన్స్ అన్నీ ఉన్నాయి. డిజె టిల్లు సినిమాలో రాధిక పాత్రలో నటించాను. ట్రైలర్ రిలీజ్ అయ్యాక అంతా రాధిక ఆప్తే అని పిలుస్తున్నారు. రాధిక ఈ తరం అమ్మాయి, నిజాయితీగా, ఆత్మవిశ్వాసంతో ఉంటుంది.. తను కరెక్ట్ అనుకున్న పనిని చేసేస్తుంది. ఎ‌వరేం అనుకుంటారు అనేదాని గురించి ఆలోచించదు. తను తీసుకునే నిర్ణయాల గురించి పూర్తి స్పష్టతతో ఉంటుంది. రాధిక క్యారెక్టర్ ను నేను త్వరగా అర్థం చేసుకోగలిగాను. ఆ కేర‌క్ట‌ర్‌లోకి మారిపోయాను. తప్పును తప్పులా ఒప్పును ఒప్పుగా చెబుతుంది. నేను రాధిక క్యారెక్టర్ తో చాలా రిలేట్ చేసుకోగలను. ఇలాంటి పాత్రను నేను సినిమాల్లో ఇప్పటిదాకా చూడలేదు.

రాధిక పాత్రలో నటించేప్పుడు డైరెక్ట‌ర్‌ విమల్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. నానుంచి సహజంగా ఆ పాత్ర స్వభావం ఎలా ఉంటుందో చూపించాలనుకున్నారు. కానీ, నేను ముందుగా భయపడ్డా.. నేను అనుకున్నట్లు చేస్తే ఎలా వస్తుందో అని. కానీ అందరికీ రాధిక క్యారెక్టర్ లో నేను నటించిన విధానం బాగా నచ్చింది. సన్నివేశాలన్నీ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఉంటాయి. రాధిక పాత్ర చేసేందుకు ఎలాంటి రిఫరెన్స్ తీసుకోలేదు. సహజంగా నాకు అనిపించినట్లు నటించాను. ఈ సినిమా చెప్పినప్పుడు బాగా నవ్వుకున్నా. నేను తెలంగాణ యాస వినడం కొత్త.. ఈ యాసలో కామెడీ చేస్తున్నప్పుడు చాలా కొత్తగా అనిపించింది. ఈ యాసలో ఇంకా సినిమాలు రావాలి. చాలా ఫ్రెష్ కామెడీ కథలా ఉంటుంది. హీరోను రాధిక కన్ఫ్యూజ్ చేసినట్లు ట్రైలర్ లో చూపించాం. రాధిక ఏం చేసినా దానికో కారణం ఉంటుంది. అదేంటి అనేది సినిమా చూసినప్పుడు తెలుస్తుంది.

సిద్ధు టాలెంటెట్ యాక్టర్. అతను యాక్ట్ చేస్తుంటే నేనే నవ్వు ఆపుకోలేకపోయా. అతను రచయిత, గాయకుడు కూడా. సిద్ధు నుంచి నటనలో చాలా విషయాలు నేర్చుకున్నా. నేను, సిద్దు, విమల్, బ్రహ్మాజీ, ప్రిన్స్ మేమంతా ఫ్రెండ్స్‌లా సరదాగా ఉండేవాళ్లం. పాండమిక్ వల్ల మనమంతా ఒత్తిడికి గురయ్యాం, బాధపడ్డాం, ఆ ఒత్తిడినంతా డిజె టిల్లు చూస్తే నవ్వుతూ మర్చిపోతారని నేను క‌చ్చితంగా చెప్పగలను. ఇక దీని త‌ర్వాత యాక్ట్ చేయ‌డానికి కొన్ని సినిమాలకు సంప్రదింపులు జరుగుతున్నాయి.. అవి అగ్రిమెంట్ కాగానే తెలియ‌జేస్తా’’ అని నేహాశెట్టి ‘డీజే టిల్లు‘ సినిమా ముచ్చ‌ట్లు, అందులో త‌ను ఎలా యాక్ట్ చేసింద‌నే విష‌యాల‌ను వివ‌రంగా చెప్పుకొచ్చింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement