Tuesday, April 30, 2024

Spl Story: వాట్సాప్​లో ఇట్లా చేస్తే అకౌంట్​ బ్లాక్​ అవుతుంది.. ఈ పొరపాటు అస్సలు చేయొద్దు!

దోస్తులకు, రిలేటీవ్స్​కి, ఇంకా తెలిసిన వారికి ఏ విషయం చెప్పాలన్నా ఇప్పుడు వాట్సాప్​ ఓపెన్​ చేయడం, మెస్సేజీ, ఫొటో పెట్టి సెండ్​ చేయడం చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. కొన్ని తప్పుడు విషయాలను తెలియకుండా ఫార్వార్డ్​ చేయడం వల్ల వినియోగదారుల ప్రైవసీకి భంగం కలుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వాట్సాప్​ మెస్సేజింగ్​ సంస్థ కొన్ని చర్యలు చేపడుతోంది. రూల్స్​ పాటించని వినియోగదారుల అకౌంట్స్​ని బ్లాక్​ చేస్తోంది. మరి మన అకౌంట్​ బ్లాక్​ కాకుండా ఉండాలంటే ఏం చేయకూడదో చదివి తెలుసుకుందాం.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్‌ను వినియోగించే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఈజీగా, ఫాస్ట్ గా ఉండడమే దీనికి కారణం. మెసేజ్ ఫార్వర్డ్ చేసుకునే వెసులుబాటు కలిగిన ఈ యాప్‌ను కోట్లాది మంది వినియోగిస్తున్నారు. దీంతో వినియోగదారుల ప్రైవసీ, సెక్యూరిటీ, ప్లాట్‌ఫామ్ దుర్వినియోగం కాకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది వాట్సాప్ యాజమాన్యం. ఈ క్రమంలోనే యాప్‌ను దుర్వినియోగం చేసే అకౌంట్స్ ని ప్రతి నెలా బ్లాక్ చేస్తోంది. వాట్సాప్ రూల్స్ పాటించని కారణంగా ఈ మధ్య లక్షలాది మంది అకౌంట్స్ బ్లాక్ చేసింది వాట్సాప్​ సంస్థ. ఆగస్టు నెలలో కంపెనీ 2.3 మిలియన్ల ఖాతాలను బ్లాక్ చేసింది. దీనికి అనేక కారణాలను చూపింది.  

ఫార్వర్డ్ మెసేజ్‌లు..

వాట్సాప్‌లో ఫార్వర్డ్ మెసేజ్‌లు ఎక్కువ అవుతున్నాయి.. తమకు నచ్చినవి, నచ్చనవి అన్నిటిని ఒక్క క్లిక్​తో ఫార్వార్డ్​ కొట్టేస్తున్నారు. ఇట్లా అన్ని ఫార్వార్డ్ మెసేజ్‌ల కోసం ఒక లేబుల్‌ను రూపొందించింది వాట్సాప్​ సంస్థ. దీని కారణంగా ఆ సందేశంపై ఎట్లాంటి సందేహం ఉన్నా.. అది ఫార్వర్డ్ మెసేజ్ అని లేబుల్ అయ్యిందో దాన్ని షేర్ చేయకుండా ఉండాలి. అట్లా కాకుండా.. తప్పుడు సందేశాన్ని పదే పదే ఫార్వర్డ్ చేస్తే కనుక.. వాట్సాప్ యూజర్​ అకౌంట్‌ను బ్యాన్ చేసే చాన్సెస్​ ఎక్కువ ఉన్నాయి.

- Advertisement -

బల్క్ మెసేజ్‌లు..

ఒకేసారి వరుసగా.. పెద్ద పెద్ద మెసేజ్‌లు పంపడాన్ని కూడా వాట్సాప్​ సంస్థ తీవ్రంగా తీసుకుంటోంది. మెషిన్, యూజర్ రిపోర్ట్ లెర్నింగ్ ద్వారా ఆటోమేటెడ్ సందేశాలను పంపేవారిని కూడా వాట్సాప్ నిషేధిస్తుంది. అందుకే ఒకేసారి ఎక్కువ మెసేజ్‌లు పంపకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

బ్రాడ్‌కాస్టింగ్ ఫీచర్‌ దుర్వినియోగం..

కొంతమంది బ్రాడ్‌కాస్టింగ్ నుంచి మెస్సేజులను పంపిస్తుంటారు. అట్లా పంపిన మెసేజ్‌లు వారి ఫోన్​ నెంబర్​ మీ ఫోన్​లో సేవ్ చేసినప్పుడు మాత్రమే రిసీవర్ ద్వారా కనిపిస్తాయి. దీన్ని కూడా ఎక్కువగా ఉపయోగిస్తే వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అయ్యే చాన్సెస్​ ఉన్నాయి. 

పర్మిషన్​ లేకుండానే గ్రూప్‌లో యాడ్ చేయడం..

ఏదైనా గ్రూప్‌లో, ఎవరినైనా యాడ్ చేసుకునే చాన్స్​ అడ్మిన్లకు ఉంటుంది. కానీ, ఇట్లా యాడ్​ చేసే ముందు వారి పర్మిషన్​ తీసుకోవడం తప్పనిసరి. అనుమతి లేకుండా ఎవరిని పడితే వారిని వాట్సాప్ గ్రూప్‌లో చేర్చుకోవడాన్ని కూడా వాట్సాప్​ సంస్థ తీవ్రంగా పరిగణిస్తోంది. అట్లా చేయడం కూడా పెద్ద తప్పుగా చూస్తోంది. ఒకవేళ సదరు వ్యక్తి దీనిపై రిపోర్ట్ చేస్తే కనుక ఆ అకౌంట్‌ను బ్లాక్ చేసే చాన్స్ ఉంది.

తెలియని నెంబర్‌కు మెస్సేజ్​ పంపించొద్దు..

వాట్సాప్​ వినియోగదారులు తమకు తెలిసిన వ్యక్తులకు మాత్రమే వాట్సాప్‌తో కనెక్ట్ అవ్వాలని, తెలియని వ్యక్తులకు మెసేజ్‌లు పంపితే మాత్రం అకౌంట్ బ్లాక్ అవడం ఖాయం అని హెచ్చరికలు జారీ చేసింది సంస్థ. ఇవే కాకుండా వాట్సాప్​ రూల్స్​ అండ్​ రెగ్యులేషన్స్​ కచ్చితంగా అంగీకరించాలని, లేకుంటే వారి అకౌంట్​ని బ్లాక్​  చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకని వాట్సాప్​ వినియోగదారులు కేర్​ఫుల్​గా ఉంటూ.. ఇతరుల ప్రైవసీని కూడా గౌరవించాలని ఇవన్నీ చేస్తున్నట్టు ప్రకటించింది వాట్సాప్​ సంస్థ.

Advertisement

తాజా వార్తలు

Advertisement