Tuesday, April 30, 2024

పోలీస్ స్టేష‌న్ లో భారీ పేలుడు.. 13మంది పోలీసులు దుర్మ‌ర‌ణం

పోలీస్ స్టేష‌న్ లో భారీ పేలుడు సంభ‌వించింది. రెండుసార్లు పేలుడు చోటు చేసుకోవ‌డంతో బిల్డింగ్ పూర్తిగా నేల‌మ‌ట్ట‌మ‌యింది. దాంతో 13మంది పోలీసులు దుర్మ‌ర‌ణం చెందారు. కాగా మరో 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. పోలీస్‌ స్టేషన్‌ లోపల రెండు సార్లు భారీ పేలుళ్లు సంభవించాయని అధికారులు తెలిపారు. ఈ సంఘ‌ట‌న పాకిస్థాన్‌లోని స్వాత్ లోయలో చోటుచేసుకున్నది. ఖైబర్‌ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఉన్న స్వాత్‌లో కౌంటర్‌ టెర్రరిజమ్‌ డిపార్ట్‌మెంట్ పోలీస్‌ స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఇది ఆత్మాహుతి దాడి కాదని, ఆయుధాలు, మోటార్‌ షెల్స్ భద్రపరిచిన ప్రదేశంలో పేలుడు సంభవించిందని చెప్పారు.

స్టేషన్‌పై ఎలాంటి దాడి కానీ, స్టేషన్‌ లోపల కాల్పులు కానీ జరగలేదని స్పష్టం చేశారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ఈ పేలుళ్లు జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘనపై బాంబ్‌ డిస్పోజల్‌ స్వాడ్‌ దర్యాప్తు జరుపుతుందని వెల్లడించారు. పేలుళ్ల దాటికి భవనం పూర్తిగా కూలిపోయిందని తెలిపారు. కాగా, అంతకు ముందు ఇది ఆత్మాహుతి దాడి అని జిల్లా పోలీస్‌ అధికారి షఫీ ఉల్లా గందాపూర్‌ చెప్పారు. పేలుడు ఘటనను పాక్‌ ప్రధాని షెహబాజ్‌ ఫరీఫ్‌ తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. పేలుడుకు సంబంధించి పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రావిన్స్‌ మొత్తం హై అలర్ట్‌ ప్రకటించినట్లు ఖైబర్‌ ఫఖ్తుంఖ్యా ఐజీ అక్తర్‌ హయత్‌ ఖాన్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement