Monday, April 29, 2024

దూసుకొస్తున్న ‘యాస్’.. తెలుగురాష్ట్రాలకు హెచ్చరికలు

తౌక్టే తుపాను సృష్టించిన బీభత్సాన్ని మరవకముందే తూర్పు తీరం దిశగా ‘యాస్’ తుపాను దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారి.. ఆ తర్వాత 12 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనుందని హెచ్చరించింది. ఒడిశాలోని బాలాసోర్‌కు దక్షిణ ఆగ్నేయంగా 510 కి.మీ దూరంలో, పారాదీప్‌కి 420 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. రేపు ఒడిశా-పశ్చిమ బెంగాల్‌ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. ఆ సమయంలో గాలుల వేగం గంటకు 185 కి.మీ. వరకూ పెరిగే అవకాశముందన్నారు. దీని ప్రభావంతో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ‘యాస్‌’ తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తుపాను ప్రభావిత రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.  లోతట్టు, తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని ఆదేశించింది. దీంతో ఒడిశా, బంగాల్‌ రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.

తుపాను ప్రభావంతో మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ తీరంలో గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇదే తీవ్రత కొనసాగుతుందన్నారు. బుధవారం కోస్తా జిల్లాల్లో ఒకటిరెండు చోట్ల ఇదే తరహాలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తెలంగాణలోనూ పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, ఈ నెల 26న తెల్లవారుజాము నుంచి ఉత్తరాంధ్రలో గంటకు 50-70 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు. మంగళ, బుధవారాల్లో ఉత్తరాంధ్ర, ఒడిశా, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల తీరాల్లో సముద్రం అత్యంత కల్లోలంగా ఉంటుంది అధికారులు వెల్లడించారు. ఈ నెల 25 నుంచి 27లోపు ఒడిశా, పశ్చిమబెంగాల్‌, సిక్కిం రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పలుచోట్ల ఉంటాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement