Thursday, May 2, 2024

Weather Effect: వడగాలులతో హీటెక్కుతోంది.. 41డిగ్రీల నుంచి 45 డిగ్రీలు పెరిగే చాన్స్

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ: వేసవికాల సమయం రావడంతో భానుడు తన ప్రతాపాన్ని క్రమంగా పెంచుతున్నాడు. ఇప్పటికే ఫిబ్రవరి చివరి వారం, మార్చి మొదటి వారాల్లో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరగ్గా, ప్రస్తుతం సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో నేటి నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరిగే అవకాశం ఉండగా, వీటికి తోడు రాష్ట్రంలో మూడు రోజుల పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4డిగ్రీలకు పెరగనుండగా, ఇది ప్రాంతాలను బట్టి మారే అవకాశం ఉందన్నారు. అధికారుల అంచనా ప్రకారం రాష్ట్రంలో నేటి నుంచి సుమారు 41 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవనున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో గరిష్ఠంగా 37.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 0.35శాతం మేర గాలిలో తేమ శాతం ఉంది.

జిల్లాల్లో ఉష్ణోగ్రతల నమోదు..

వేసవి సమయం నేపథ్యంలో సూర్యుడు భూమధ్య రేఖ నుంచి ఉత్తర ధృవం వైపు పయనిస్తూ పైకి వెళ్తున్న తరుణంలో ఎండలు పెరగడంతో పాటు వేడి గాలలు వీచనున్నాయి. ఈ కారణంతోనే మార్చి 23 నుంచి జూన్‌ 20 లేదా 23వరకు వేసవికాలంలో ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి. ప్రస్తుతం అధికారులు అంచనా ప్రకారం ఈ రోజు నుంచి 20 వరకు ఆదిలాబాద్‌, భద్రాద్రి కొత్త గూడెం, జగిత్యాల,కొమురం భీం, మంచిర్యాల, నల్గొండ, నిర్మల్‌, సూర్యాపేట జిల్లాల్లో 41నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకానుంది. కాగా మిగతా జిల్లాల్లో ఈ నాలుగు రోజుల్లో అటు ఇటుగా ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి.

ఈ ఏడాది సాధారణమే..

ఈ వేసవికాలంలో ఎండలు సాధారణంగానే ఉండనున్నాయని, ఈ మేరకు ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదు అయ్యే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. కాగా సాధారణం మేరకు 41 నుంచి 45డిగ్రీల కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలు లేవనే రిపోర్టులు చెబుతున్నాయన్నారు. అయితే ఏప్రిల్‌, మే మాసాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల్లో మార్పులు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. కాగా మొత్తం వేసవిలో మాత్రం సాధారణంగానే ఉష్ణోగ్రతలు ఉండనున్నాయి.

- Advertisement -

వడగాల్పుల ప్రభావిత జిల్లాలు..

రాష్ట్రంలో మూడు రోజుల పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉండగా, ఇందులో జిల్లాలు, ప్రాంతాల వారీగా మార్పులు చోటుచేసుకోనున్నాయి. నేడు, రేపు ఆదిలాబాద్‌, కొమురం భీం ఆసిఫాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహాబూబాబాద్‌, వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, నాగర్‌ కర్నూల్‌, నిర్మల్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, గాలులు వీచనున్నాయి. 18న రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో వడగాల్పులు వీచనున్నాయి.

జిల్లాల వారీగా బుధవారం నమోదైన ఉష్ణోగ్రతలు..

జిల్లా.. ఉష్ణోగ్రత (డిగ్రీల్లో)
ఆదిలాబాద్‌ 40.3
భద్రాచలం 40.0
హన్మకొండ 38.0
హైదరాబాద్‌ 38.6
ఖమ్మం 38.2
మహాబూబ్‌నగర్‌ 40.1
మెదక్‌ 39.6
నల్గొండ 42.4
నిజామాబాద్‌ 40.1
రామగుండం 40.0

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement