Thursday, April 18, 2024

దేశానికి ఆదర్శం తెలంగాణ సంక్షేమ పథకాలు.. అన్ని వ‌ర్గాల‌కు అండ‌గా టీఆర్ఎ​స్ ప్ర‌భుత్వం: కేటీఆర్‌

తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. గురువారం క‌రీంన‌గ‌ర్ జిల్లా చొప్పదండి పట్టణంలో పలు అధివృద్ధి పనులకు మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం అంచెలంచేలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువస్తూ, కావాల్సినన్ని నిధులిచ్చి సమస్యలన్నీ తీరుస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. 200/- రూపాయలు ఉన్న పించన్ ను ఒకేసారి పదిరెట్లు పెంచి 2వేల రూపాయలకు తీసుకువచ్చి
వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు అందిస్తున్న‌ట్టు తెలిపారు. సర్కారు పేదలకు అండగా ఉంటూ వారి ఆత్మ గౌరావాన్ని పెంచడం జరిగిందని పేర్కొన్నారు.

కరోనా కారణంగా ఆలస్యమైన కొత్తఫించన్లు మే లేదా జూన్ నుంచి ఇస్తామని, బడ్జెట్ లో కూడా ఇందుకోసం నిధులు కేటాయించడం జరిగిందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల పైచిలుకు ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదిముబారక్ కింద ఆదుకున్నాం. గతంలో నేనురాను బిడ్డో సర్కారు దవఖానాకు అనే స్థితిని పూర్తిగా మార్చి సర్కారు దవాఖానలో ప్రసవాలు జరిపించడంతో పాటు వారికి కేసీఆర్ కిట్ తో పాటు మగపిల్లాడు పుడితే 12 వేలు, ఆడపిల్ల పుడితే 13 వేల రూపాయలు ఇస్తున్నాం అని తెలిపారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతం ఉన్న ప్రసవాలు 56 శాతానికి పెరిగాయి అన్నారు . మాతా శిశు మరణాలు తెలంగాణలో తగ్గాయని, ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగిందని నీతి ఆయోగ్ చెప్పిందని మంత్రి ఈ సందర్భగా పేర్కొన్నారు.

తెలంగాణ రాకముందు 150 లోపున్న గురుకుల పాఠశాలలను 973 కు పెంచి నాణ్యమైన విద్యను లక్షలాది మంది విద్యార్థులకు అందిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఉన్నత విద్య కోసం 16 వేల కోట్ల రూపాయలను ఫీజ్ రీఎంబర్స్ మెంట్ కింద ఇస్తున్నామని, విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లే వారికోసం అంబేద్కర్ ఓవర్సీస్, జ్యోతీభాపూలే ఓవర్శిస్ స్కీం కింద 20 లక్షల రూపాయలను ఇస్తున్నామని. 26 వేల సర్కారు స్కూళ్లను రూ. 7 వేల 300 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. ఇంటి స్థలాలున్న వారికి ఇల్లు కట్టుకునేందుకు రూ. 3లక్షలు ఇస్తామని, చొప్పదండిలో మూడు వేల మందికి ఇండ్లకోసం ఈ ఆర్థిక సంవత్సరం డబ్బులిస్తామని, రాబోయే 6 నుంచి 9 నెలల్లో 80 వేల పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయబోతున్నామని తెలిపారు.

24 గంటల కరెంట్, రైతులకు రైతు బంధు పథకం కింద ఎకరాకు 10 వేల రూపాయలు ఇస్తున్నామని, ఏదైనా కారణం చేత రైతు చనిపోతే వారి కుటుంబసభ్యులకు రైతు బీమా కింద రూ 5 లక్షలు ఇచ్చి ఆదుకుంటున్నామని, అంతకు ముందు చొప్పదండి ఎమ్మెల్యే గంగాధరను మున్సిపాలిటీ చేయాలని కోరగా . మున్సిపాలిటీగా మారిస్తే ఉపాధి హామీ పథకం పోతుంది. ప్రజలందరు ఏకగ్రీవ తీర్మానం చేసి పంపిస్తే గంగాధరను మున్సిపాలిటీ చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఎలగందుల రమణ, పాడి కౌశిక్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కలెక్టర్ ఆర్ వి కర్ణన్, అదనపు కలెక్టర్లు అగర్వాల్, శ్యాం ప్రసాద్ లాల్, మున్సిపల్ చైర్ పర్సన్ గుర్రం నీరజ భూమిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి ఎంపీపీలు జడ్పీటీసీలు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement